ఇసుక మాఫియాలో ఆధిపత్య పోరు

16 Nov, 2013 02:48 IST|Sakshi

మిర్యాలగూడ, న్యూస్‌లైన్:  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా వాగుల్లో ఇసుక భారీగా వచ్చింది. దీంతో ఇసుక వ్యాపారులు పండగ చేసుకుంటున్నారు. ఓ వైపు ఇసుకకు రోజురోజుకూ డిమాండ్ పెరిగిపోతుండడంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా. ఇటీవల ఇసుక మాఫియాలో అలజడి రేగింది. మిర్యాలగూడ సమీపంలోని పాలేరు వాగుపై ఇసుక వ్యాపారుల కన్ను పడింది. వర్షాలకు వేములపల్లి, మిర్యాల గూడ మండలాల్లో ఉన్న పాలేరు వాగులో ఇసు క వచ్చింది. ఒక్క లారీ ఇసుక లోడు చేసి పంపి స్తే రూ 15 వేలు వస్తున్నాయి. దాంతో గ్రామాల లో ఇసుక మాఫియా ముఠాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇసుక దందాలో ఆధిపత్య పోరుకు రాజకీయ రంగు పులుముకుంది.

ఇసుక దందాతో రాజకీయ పార్టీ నాయకుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన వేములపల్లి మండలం రావులపెంటలో ఒక పార్టీ వారు నిర్వహించిన వేలం పాటను అడ్డుకోవడానికి మరో పార్టీ వారు ప్రయత్నించడంతో ఘర్షణ నెలకొన్నది. దాం తో రెవెన్యూ అధికారులు నాలుగు రోజులుగా రావులపెంట సమీపంలోని పాలేరు వాగు వద్ద గస్తీ ఏర్పాటు చేశారు. ఇరువర్గాలకు చెందిన 32 మందిపై కేసు కూడా నమోదు చేశారు. ఇటీవల మిర్యాలగూడ మండలంలోని తడకమళ్ల వద్ద ఒక పార్టీకి చెందిన వారు ఇసుక దందా నిర్వహిస్తుండగా మరో రాజకీయ పార్టీకి చెంది న వారు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి మూడు లారీలు, ఒక జేసీబీని పట్టించారు.
 రాత్రికి రాత్రి డంప్‌లు, రవాణా
 రాత్రికి రాత్రి ఇసుక డంప్‌లు చేయడంతో పా టు లారీలలో రవాణా కూడా చేస్తున్నారు. పాలే రు వాగులోని ఇసుకను జేసీబీతో ట్రాక్టర్‌లో లోడ్ చేసి ఆ తర్వాత మిర్యాలగూడ మండలంలోని ఎడమ కాలువ సమీపంలో డంప్ చేస్తున్నారు. ఆ వెంటనే అక్కడ మరో జేసీబీతో లారీలోకి ఇసుకను ఎత్తుతున్నారు. కేవలం 10 నిమిషాల్లో లారీలోడు చేసుకొని వెళ్తున్నారు. వేములపల్లి మండలం కామేపల్లి నుంచి పాలేరు వాగు నుంచి జోరుగా ఇసుక డంప్‌లు చేసి రవాణా చేస్తున్నారు. మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్రగూడెంలో అద్దంకి - నార్కట్‌పల్లి రహదారి వెంట కూడా రాత్రికి రాత్రి ఇసుక డంప్ చేసి లారీలలో రవాణా చేస్తున్నారు. అయినా కనీసం అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇసుక మాఫియాకు రాజకీయ అండదండలతో పాటు అధికారులూ తోడవ్వడంతో ఈ దందా జోరుగా సాగుతోంది.  
 గ్రామాలలో వేలం పాటలు
 ఇసుక రవాణా చేసుకోవడానికి గ్రామాలలో బహిరంగంగా వేలం పాటలు నిర్వహించి దం దా నిర్వహిస్తున్నారు. అయినా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన వేములపల్లి మండలంలోని రావులపెంటలో వేలం పాట నిర్వహించగా నెలకు రూ 1.80 లక్షలు వేలంపాటలో అధికార పార్టీకి చెందిన నాయకుడు దక్కించుకున్నాడు. అదే విధంగా వేములపల్లి మండలంలోని కామేపల్లిలో వేలం పాట నిర్వహించి ఇసుక రవాణా చేస్తున్నారు. సల్కునూరు. బొమ్మకల్లు, భీమనపల్లి, ఆగామోత్కూర్, చిరుమర్తి, కల్వెలపాలెం గ్రామాలలో కూడా ఇసుక వేలం పాటలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు