హత్య విషయం తెలిసి.. లేటుగా వచ్చారా?

2 May, 2015 15:35 IST|Sakshi
హత్య విషయం తెలిసి.. లేటుగా వచ్చారా?

అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రసాద్‌ రెడ్డిని హత్య చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన అనుచరుడు శివను దుండగులు కంప్యూటర్‌ గదిలో నిర్బంధించారు. ప్రసాద్‌రెడ్డిపై దాడి జరుగుతుందని ఎస్సై నాగేంద్ర ప్రసాద్‌కు ఫోన్‌ చేసినా..10 అడుగుల దూరంలో ఉన్నప్పటికీ ఎస్సై చాలా లేట్‌గా వచ్చారని ప్రత్యక్ష సాక్షి శివ చెబుతున్నారు. ఎస్సై సకాలంలో స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని ప్రసాద్‌ రెడ్డి కుటుంబీకులు కూడా అంటున్నారు. ప్రసాద్‌రెడ్డిని హత్య చేయడానికి ముందురోజు ఆయన సోదరుడు మహానందరెడ్డిని కూడా హత్య చేయడానికి స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. మట్టి రవాణా వ్యవహారంలో అనంతపురం నుంచి రాప్తాడుకు మహానందరెడ్డి మూడుసార్లు వచ్చేలా ఎస్సై ప్లాన్‌ చేశారని అంటున్నారు. ఈ సమయంలో ప్రత్యర్ధులు మహానందరెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రసాద్‌రెడ్డి హత్య కేసును ఓ కొలిక్కి తీసుకురావాల్సిన పోలీసులు.. హత్య జరిగిన తరువాత చోటుచేసుకున్న పరిణామాలపై దృష్టిపెట్టారు. రాప్తాడు తహశీల్దార్‌  కార్యాలయంలో ప్రసాద్‌రెడ్డిని ఆయన ప్రత్యర్ధులు  నరికి చంపిన సంగతి తెలిసిందే. దీంతో మనస్తాపం చెందిన వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు కొంత విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రసాద్ రెడ్డి హత్య కేసులో 14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు...ఇప్పటిదాకా నలుగుర్ని మాత్రమే అరెస్ట్ చేశారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు  చెందిన  50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఇటుకులపల్లి, కూడేరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఓ పోలీసు ఉన్నతాధికారి ఒత్తిడితోనే  అనంత పోలీసులు ప్రసాద్‌రెడ్డి హత్య కేసును పక్కనపెట్టి వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు