అతి ప్రచారానికి ఆద్యుడు చంద్రబాబే..

19 Sep, 2018 13:12 IST|Sakshi

విజయవాడ : గోదావరి పుష్కరాల సమయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు కారణం ముహుర్త కాలంపై జరిగిన విస్తృత ప్రచారమేనని సోమయాజులు కమిషన్‌ నివేదిక తేల్చింది. మూడేళ్ల కిందట జరిగిన పుష్కర విషాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. మాటల కందని ఈ విషాదం బాధితులను ఇంకా వెంటాడుతుంటే గోదావరి పుష్కరాలపై ఊదరగొట్టిన సీఎం చంద్రబాబునాయుడు మాత్రం ఈ దుర్ఘటనకు కారణం కాదని కమిషన్‌ నివేదిక నిగ్గుతేల్చడం విడ్డూరం. కమిషన్‌ నివేదికలో ప్రస్తావించిన అంశాలు చూస్తే..144 ఏళ్ల తర్వాత మహాపుష్కరాలు వచ్చాయని నమ్మి హద్దుమీరిన ఉత్సాహంతో ప్రజలు పోటెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని  పేర్కొంది. ముహూర్త కాలంపై విస్తృత ప్రచారమే ప్రమాదానికి ప్రధాన కారణమని, ఒకే రోజు, ఒకే ముహూర్తానికి పవిత్ర స్నానం చేయాలనే నిబంధన ఎక్కడాలేదని తెలిపింది. పత్రికలు, ఛానెళ్లు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాయని వెల్లడించింది.


బాబు ఊతంతో రెచ్చిపోయిన ఎల్లో మీడియా
మహాపుష్కరాలకు మహా ఏర్పాట్లంటూ ఎల్లో మీడియా హోరెత్తించడం, చంద్రబాబు ప్రచారార్భాటం ఈ విషాదానికి అసలు కారణం అన్నది బహిరంగ రహస్యమే.  వీఐపీలకు సరస్వతీ ఘాట్‌ను కేటాయించినా నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కోసం పుష్కర ఘాట్‌లో సీఎం కుటుంబం, మంత్రులు స్నానాలు చేయడం తోపులాటకు కారణమైంది.  ఒకే చోట వీఐపీలందరూ స్నానం చేయాలన్న కారణంతో పోలీసులు సాధారణ భక్తులను ఆపేశారు. ఫలితంగానే తొక్కిసలాట జరిగిందని సోమయాజులు కమిషన్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాన్ని తొక్కిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివేదికలో ఈ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం మరుగునపరిచిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబులెన్స్‌లకు సైతం దారి ఇచ్చేలా ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఉదయం 8 గంటల సమయంలో తొక్కిసలాట జరగ్గా, 9.15 గంటలకు తొలి బాధితుడిని ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు అంబులెన్స్‌ రికార్డులో పేర్కొన్నారు. సరైన సమయంలో అంబులెన్స్‌లు వచ్చిఉంటే పలువురు ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండేదని చెబుతున్నారు.

షార్ట్‌ ఫిలింపైనే శ్రద్ధ..
పుష్కరాల నేపథ్యంలో విపరీత రద్దీ ఏర్పడకుండా నిర్ధేశిత ప్రాంతాల్లో భక్తులను నిలువరించడం, ఇతర ఘాట్లకు వారిని మళ్లించడం వంటి మార్గదర్శకాలను విస్మరించారు. నిబంధనల ప్రకారం ఘాట్లలో ప్రతి 50 మీటర్లను కంపార్ట్‌మెంట్లుగా విడగొట్టాలి. సీసీ టీవీలు ఏర్పాటు చేసి 72 గంటల ఫుటేజ్‌ను స్టోర్‌ చేయాలి. వీటిని ఏమాత్రం పట్టించుకోని అధికారులు పుష్కర ఘాట్‌కు ప్రజలను భారీగా మళ్లించారు. షార్ట్‌ ఫిల్మ్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో వచ్చినట్టు కనిపించాలనే ఇలా చేసినట్టు స్పష్టమవుతోంది. ఇక వాస్తవాలు వెలుగుచూస్తాయనే ఉద్దేశంతో నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌ చిత్రీకరించిన షార్ట్‌ ఫిల్మ్‌ నేటికీ వెలుగుచూడలేదు.


 ప్రచారయావతో గాల్లో కలిసిన ప్రాణాలు..
చంద్రబాబు ప్రచార యావే పుష్కర భక్తుల ప్రాణాలు తీసిందని ప్రజలు బాహాటంగా చర్చించుకోవడం తెలిసిందే. 29 మంది చనిపోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చంద్రబాబే కారణమని విస్పష్టంగా తేలినా సోమయాజులు కమిషన్‌లో చెప్పిన అంశాలను మరుగునపరిచి మరీ ప్రభుత్వం సీఎంకు క్లీన్‌చిట్‌ ఇవ్వడం దారుణం.
 

మరిన్ని వార్తలు