కరవు మండలాల ప్రకటన కంటితుడుపే

21 Apr, 2019 13:22 IST|Sakshi

ప్రభుత్వాల మతిమాలిన విధానాలు రైతులకు కడగండ్లనే మిగులుస్తున్నాయి. కరవు మండలాల ప్రకటన కంటితుడుపు చర్యే అయింది. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌లో సగానికి పైగా పంటలు ఎండిపోయాయి. ఆ తర్వాత వచ్చిన పెథాయ్‌ మిగిలి ఉన్న కాస్త పంటను తుడిచేసింది. ఎన్నికల ముంగిట అన్నదాతలను బురిడీకొట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కరవు మండలాల ప్రకటన   ఏమాత్రం అక్కరకు రాలేదు. రుణాలు రీషెడ్యూల్‌ అవుతాయని ఆశించిన అన్నదాతలకు నిరాశే ఎదురైంది. రుణాలపై వడ్డీ మాఫీ లేదు. ఇన్‌పుట్‌సబ్సిడీ జాడలేదు. వ్యవసాయ కూలీలకు అదనపు పనిదినాలు కల్పించలేదు.

సాక్షి, విశాఖపట్నం: తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గత ఖరీఫ్‌లో సగానికి పైగా సాగు విస్తీర్ణం ఎండిపోయింది. మిగిలిన సగం పంటను పెథాయ్‌ తుడిచిపెట్టేసింది. గత ఖరీఫ్‌లో1,97,100 హెక్టార్లలో పంటలు చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ 1,75,782 హెక్టార్లలోనే సాగు చేయగలిగారు. అందులో 1.05 లక్షల హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా, అతికష్టమ్మీద 99,900 హెక్టార్లలో పంటలు వేయగలిగారు. దాంట్లో అధికారిక లెక్కల ప్రకారం వర్షాభావ పరిస్థితుల వల్ల 40వేల హెక్టార్లలో పంట ఎండిపోయింది. పెథాయ్‌ తుఫాన్‌ ప్రభావానికి 25వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఎకరాకు పట్టుమని 12–15 బస్తాలకు మించిదిగుబడి రాలేదు. పైగా రంగుమారిపోయి మద్దతు ధర మాట దేవుడెరుగు కనీసం గిట్టుబాటు ధర కూడా రాని దుస్థితి చోటుచేసుకుంది. ఇలా రూ.170 కోట్లకు పైగా విలువైన పంటను కోల్పోయారు.

ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కరవుమండలాలు ప్రకటించాలన్న డిమాండ్‌ వ్యక్తమైంది. ప్రజాప్రతినిధులు కూడా పార్టీలకతీతంగా ముక్తకంఠంతో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రెండుసార్లు జెడ్పీ సర్వసభ్యసమావేశాల్లోనూ తీర్మానాలు చేశారు. కానీ డ్రైస్పెల్స్, ఇతర నిబంధనలను సాకుగా చూపి జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరవు ప్రాంతంగా ప్రకటించ లేదు. ఖరీఫ్‌ దెబ్బతో రబీ సాగుకు కూడా అన్నదాతలు దూరంగా ఉన్నారు. కనీసం చేతికొచ్చిన పంటైనా ఆశించిన దిగుబడి నిచ్చిందా? అంటే అదీ లేదు. ఎన్నికల ముంగిట కరవు చాయలుకమ్ముకోవడంతో అన్నదాతలు ప్రభుత్వ తీరుపైతీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో  రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని జిల్లాకు 


చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృషికి తీసుకొచ్చారు. రైతన్నలను శాంతింప చేసేందుకు ఎన్నికల షెడ్యూల్‌ ముందు మొక్కుబడిగా కరవు మండలాల ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 257 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది.  వాటిలో 228 తీవ్ర కరవు మండలాలుగా, మరో 29  మోడరేట్‌ డ్రౌట్‌ ప్రాంతాలుగా పేర్కొంది. జిల్లాలో 29 మండలాలు కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. వాటిలో ఒక్కదానికీ  తీవ్ర కరవుమండలాల జాబితాలో చోటు దక్కలేదు. ప్రకటించిన 29 మండలాలు మోడరేట్‌ డ్రౌట్‌ మండల్స్‌ జాబితాలోనే ఉన్నాయి. పైగా ప్రకటించిన 29మండలాల్లో ఎలాంటిసాగు లేని విశాఖపట్నం అర్బన్, గాజువాక, పెదగంట్యాడ, పరవాడ మండలాలతో పాటు పెద్దగా సాగు లేని ఆనందపురం, భీమునిపట్నం, సబ్బవరం, పెందుర్తి మండలాలు ఉండడం గమనార్హం.

కానరాని సాయం..
సాధారణంగా ప్రకటించిన కరవు మండలాల్లో డ్రై స్పెల్, క్రాప్‌ కటింగ్‌ ఎక్స్‌పరమెంట్‌ ప్రకారం నష్టపోయిన రైతులకు సాగు విస్తీర్ణం, పంటలను బట్టి ఇన్‌పుట్‌ సబ్సిడీ (పంట నష్టపరిహారం) ప్రకటిస్తారు. తీసుకున్న రుణాలన్నీ రీషెడ్యూల్‌ అవుతాయి. పైగా రుణాలపై వడ్డీ మాఫీ ఉంటుంది. కరవు మండలాల్లో వ్యవసాయ కూలీలకు అదనంగా 50 పనిదినాలు కల్పిస్తారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తారు. కొత్తగా రుణాలు కూడా మంజూరు చేస్తారు. కానీ కంటితుడుపు చర్యగా  కరవు మండలాల ప్రకటన వల్ల  రైతులకు , రైతు కూలీలకు ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదు. ఖరీఫ్‌లో రూ.2371కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఏకంగా రూ.2390కోట్ల రుణాలు ఇచ్చినట్టుగా అధికారులు ప్రకటించారు. వాటిలో 80శాతం రీషెడ్యూల్‌ అయినవే. వీటిపై వడ్డీ కూడా ఏటా రూ.200కోట్ల వరకు చెల్లిస్తున్నారు. కరవు మండలాల ప్రకటన వల్ల ఖరీఫ్‌లో ఇచ్చిన రుణాలన్నీ మళ్లీ రీషెడ్యూల్‌ అవుతాయని రైతులు ఆశించారు.

కానీ ఒక్క రూపాయి కూడా రీషెడ్యూల్‌ కాలేదు. అంతేకాదు కనీసం తీసుకున్న రుణాలపై వడ్డీ కూడా మాఫీ కాలేదు. కనీసం ప్రీమియం చెల్లించిన వారికైనా బీమా సొమ్ము దక్కుతుందా అంటే అదీ లేదనే చెప్పాలి. ఇక కనీసం వ్యవసాయ కూలీలకైనా మేలు జరుగుతుందనుకుంటే అదీ లేదు. ఉపాధి హామీ పథకంలో సాధారణ మండలాల్లో ఏటా కుటుంబానికి వందరోజులు పనిదినాలు కల్పిస్తే కరవు మండలాల్లో మాత్రం కూలీలకు 150రోజులు పనిదినాలు కల్పిస్తారు. జిల్లాలో పేరుకు 29 మండలాలు కరవు మండలాలుగా ప్రకటించినా ఏ ఒక్క మండలంలో ఏ ఒక్క కూలీకి అదనంగా ఒక్క రోజు పనిదినం కల్పించలేని దుస్థితి నెలకొంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు హæడావుడిగా కరవు మండలాల ప్రకటన చేసిన ప్రభుత్వం కరవు సాయం మాత్రం ప్రకటించకపోవడం పట్ల అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడులు నష్టపోయాను..
నేను 60 సెంట్లలో వరిపైరు వేశాను. వర్షాభావ పరిస్థితులతో పంట పూర్తిగా ఎండిపోయింది. రూ.12 వేల మేర పెట్టుబడులు నష్టపోయాను.కరవు మండలాల ప్రకటనతో ఇన్‌పుట్‌సబ్సిడీ వస్తుందని ఆశించాం. కానీ ఆ పరిస్థితి కన్పించడం లేదు. కరవు మండలాల ప్రకటనకంటితుడుపు చర్యగానే మిగిలింది.– చదరం మాణిక్యం, రైతు, గణపర్తి

పైసా సాయం లేదు
నేను 50 సెంట్ల మేర చెరకుసాగు చేపట్టాను. ఇందుకోసం రూ.18వేలకు పైగా పెట్టుబడి పెట్టా. వర్షాలు లేక చెరకుతోట ఎండిపోయింది. మూడు పాకాలకు మించి దిగుబడి రాలేదు. కరవు మండలాల ప్రకటనతో ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూశాను. కానీ పైసా సాయం అందే పరిస్థితులు కన్పించడం లేదు. – భీశెట్టి అప్పారావు, రైతు, మునగపాక

మరిన్ని వార్తలు