అలజడి రేపుతున్న ఆకతాయిలు

5 Nov, 2018 11:43 IST|Sakshi
ఆకతాయిల దాడుల్లో పగిలిన సమాధుల నామఫలకాలు

నగరంలో అర్ధరాత్రి వరకు     తాగి చిందులు

ప్రభుత్వ, ప్రైవేట్‌     ఆస్తుల ధ్వంసం

భయాందోళనలో ప్రజలు  

అక్టోబర్‌ 30వ తేదీ అశోక్‌నగర్‌     శివారులోని ముస్లింల శ్మశానవాటికలో వందలాది సంఖ్యలో సమాధుల బోర్డులను పగులగొట్టారు.
అంతకు ముందుకు రోజు సైఫుల్లా బ్రిడ్జిపై పూలకుండీలు, తొట్టెలు ధ్వంసం చేశారు. దీనిపై పలువురు కార్పొరేటర్లు త్రీటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అయినా ఇంతవరకూ నిందితులను పోలీసులు గుర్తించకపోవడం గమనార్హం.

అనంతపురం సెంట్రల్‌: అనంతపురం నగరంలో ఆకతాయిలు అలజడి సృష్టిస్తున్నారు. అర్ధరాత్రి వరకు తాగి తందనాలు ఆడటమే కాకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. రాత్రి వేళ పోలీసుల గస్తీ నిద్రావస్థలో ఉండటం వల్లే వీరి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా యువతలో చాలా మంది పెడదారి పడుతున్నారు. తమ కుమారులు ఏమి చేస్తున్నారో కూడా కొంతమంది తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అతిగారాబంతో రూ.లక్షలు విలువజేసే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తదితర అధునాతన ద్విచక్రవాహనాలను కొనిస్తున్నారు. పాకెట్‌ మనీ కోసం రూ. వందలు, వేలు ఇస్తున్నారు. ఇంకేముంది అర్ధరాత్రి వరకు ఇళ్లకు వెళ్లకుండా స్నేహితులతో కలిసి షికార్లు కొడుతున్నారు. పూటుగా మద్యం తాగి చిందులేస్తున్నారు. వారిలో వారే కొట్టుకొని పోలీసుస్టేషన్‌ల వరకు వెళ్తున్నారు. కొంతమంది చిల్లర ఘటనలపై పోలీస్‌స్టేషన్‌ల వరకు ఎందుకని నేరుగా ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారు.  

ఆ బైక్‌ల శబ్దం వింటే గుండె గుబేల్‌..
పెడదారిన పెట్టిన యువకుల్లో ఎక్కువశాతం రూ. లక్షలు విలువజేసే ద్విచక్రవాహనాలను నడుపుతున్నారు. వీటికి పెద్ద పెద్ద సౌండ్లు వచ్చేలా హారన్‌లు, సైలెన్సర్లు ఏర్పాటు చేసుకొని నగరంలో చక్కర్లు కొడుతున్నారు. ద్విచక్రవాహనం దగ్గరకు సమీపించిన తర్వాత భారీ శబ్దాలు వస్తుండడంతో సామాన్యులు అదురుకుంటున్నారు. ఓ మోస్తారు బాంబులు పేలినంతగా శబ్దాలు వస్తున్నాయి. అయితే ఇలాంటి వారిపై పోలీసుల నిఘా పూర్తిగా కొరవడిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అర్దరాత్రి వరకూ బార్‌లు ఉండడం, ఆపై హోటల్స్‌ కూడా నడస్తుండడం వలన వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. ఎంత సేపూ రోడ్డుపై తాగిన వ్యక్తులు ఎవరొస్తారా అని ఎదురు చూడడం తప్ప ఆకతాయిల అడ్డాలపై పోలీసులు నిఘా సారించడం లేదు. అతివేగంతో నగరంలో దూసుకుపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆకతాయిలను పట్టుకోవాలనే ఆలోచన కూడా వారికి పెద్దగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆకతాయిలకు ముకుతాడు వేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు