ఎర్రచేళ్లను మాగాణిగా మారుస్తాం

5 Nov, 2018 11:40 IST|Sakshi
మాట్లాడుతున్న ప్రకాష్‌రెడ్డి

అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే లక్ష ఎకరాలకు హంద్రీ–నీవా నీరు

జీడిపల్లి నుంచి పైపులైన్‌ ద్వారా మూడు నెలలకే తాగునీరు

పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

జనసంద్రంగా మారిన ఆత్మకూరు

అనంతపురం, ఆత్మకూరు: తాను ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఎర్ర చేళ్లను మాగాణులుగా మార్చి రాప్తాడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని, ఆరు నెలలు తిరక్కుండానే హంద్రీ–నీవా ద్వారా ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామని వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. కరువు పోరు రైతు యాత్రలో భాగంగా ఆదివారం ఆయన ఆత్మకూరు మండలంలోని పంపనూరు, వై.కొత్తపల్లి నుంచి పి.యాలేరు మీదుగా ఆత్మకూరు వరకు పాదయాత్ర చేపట్టారు. దారి పొడవునా అన్ని గ్రామాల్లో ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బాణాసంచా పేలుళ్లు, డప్పుల మోతల నడుమ పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర ముగిసిన అనంతరం ఆత్మకూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అందులో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ససశ్యామలం చేసి చూపిస్తానన్నారు. హంద్రీ నీవా నీరు కళ్లముందు కనపడుతున్నా... చేళ్లలోకి తెచ్చుకోలేకుండా ప్రజలు ఏ విధంగా మోసపోయారో, కరువు వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రభుత్వానికి చెప్పడానికే తాను పాదయాత్ర చేస్తూ ప్రజల ముందుకు వచ్చానన్నారు.

కరువుబారిన పడిన వేరుశనగ రైతుకు ఎకరాకు రూ.20 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రాక, ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూ్యరెన్స్‌లు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంత రైతుల గోడు కోట్టుకోకముందే, ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవకముందే కళ్లు తెరిచి రైతులకు న్యాయం చేయాలన్నారు. మంత్రిగా పరిటాల సునీత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు నిర్ణయాలు తీసుకున్నారని, పిల్ల కాలువలు రద్దు చేసి రైతుల పొలాలకు రావాల్సిన నీళ్లను కుప్పం తీసుకెళ్లడం ఒకటైతే... రెండోది ఆత్మకూరు మండలంలో రూ.9 కోట్ల విలువజేసే పనులను సీఎం రమేష్‌కు రూ.90 కోట్లకు అప్పగించడమన్నారు. పొలాలకు నీళ్లివ్వాలని అడిగితే సోలార్‌ పవర్‌ప్లాంట్లు తెచ్చి ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నారని, సోలార్, గాలిమరల ప్రాజెక్టుల్లో కమీషన్లు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్‌మెంట్‌ భూములన్నీ ఆన్‌లైన్‌లో పరిటాల సునీత బంధువుల పేర్ల మీద మార్చుకుంటున్నారని విమర్శించారు.

ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నీరు ఇవ్వచ్చు
కంబదూరు, కళ్యాణదుర్గం మండలాల మీదుగా పేరూరు డ్యాంకు నీరు తీసుకురావచ్చని, తురకలాపట్నం నుంచి పెన్నానదిలోకి నీరు వదిలితే రూపాయి ఖర్చు లేకుండా నీళ్లు వస్తాయని ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని సమావేశాలు, పత్రికల ద్వారా తెలియజేసినా మంత్రి వాటిని వక్రీకరిస్తున్నారని విమర్శించారు. 2009, 2014 సంవత్సరాల్లో ఆత్మకూరు చెరువుకు నీళ్లిస్తామని మంత్రి మాట ఇచ్చారని, కానీ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2008లోనే హంద్రీ–నీవా రెండోదశ టెండర్లు పిలిచి ఆత్మకూరు ఎగువ ప్రాంతాలకు నీరు అందాలంటే ఆత్మకూరుకు రెండు కిలోమీటర్లు ఎగువన కాలువ వెళ్లాలని చెప్పారన్నారు. ఆ కాలువ పనులు పూర్తయి ఉంటే ఇప్పటికే ఆత్మకూరు మండలంలోని 12వేల ఎకరాలకు నీళ్లు అందేవన్నారు. వైఎస్సార్‌ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి వరమిస్తే... ఆయన మరణానంతరం టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పరిటాల సునీత జీఓ 22 తీసుకొచ్చి పిల్లకాలువల నిర్మాణాన్ని రద్దుచేసి రైతులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. పేరూరుకు కాలువ తీసుకుపోవడం తమకూ సంతోషమేనని, కానీ ఆత్మకూరు మండలానికి నీళ్లు ఇవ్వకుండా కాలువను కిందకు దించి అన్యాయం చేశారని విచారం వ్యక్తం చేశారు.

తోపుదుర్తి చందు మాట్లాడుతూ ప్రకాష్‌రెడ్డి అధికారంలో లేకపోయినా ఉచితంగా బోర్లు వేయించారని, గొర్రెల సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను అదుకున్నారని చెప్పారు. హంద్రీ నీవా కాలువను రాజశేఖర్‌రెడ్డి తీసుకొస్తే మంత్రి సునీత గంగపూజలు, తెప్పోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 30 సంవత్సరాల టీడీపీ పాలనలో నియోజకవర్గప్రజలు నలిగిపోతున్నారని, తమకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు.

రాగే పరుశురామ్‌ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు 600 అపద్దాలతో అధికారంలోకి వచ్చారన్నారు. రాష్ట్రంలో 63 లక్షల మంది నిరుద్యోగులుంటే ఏ కొద్దిమందికో నిరుద్యోగ భృతి ఇచ్చారన్నారు. వైఎస్సార్‌ హయాంలో 45 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం 4 లక్షలు కూడా మంజూరు చేయలేదన్నారు. అనంతరం గంగుల భానుమతి, రాజారాం మాట్లాడుతూ ప్రకాష్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు శంకర్‌నారాయణ, రిటైడ్‌ జడ్జ్‌ కిష్టయ్య, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారాం, రాష్ట్ర కార్యదర్శి మహానందరెడ్డి, జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, జిల్లా అధికార ప్రతినిధిè చంద్రశేఖర్‌రెడ్డి, ఆయా మండలాల కన్వీనర్లు బాలపోన్న, రామాంజి, నాగముణి, వరప్రసాద్‌రెడ్డి, నాగరాజు, శ్రీధర్, నాగమళ్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆయకట్టు రద్దు చేసి అన్యాయం చేశారు
రైతుల గరించి ఆలోచించి హంద్రీ నీవా కాలువను తీసుకొచ్చింది దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అయితే టీడీపీ నాయకులు గంగపూజలు చేస్తూ ఆనందపడుతున్నారు. వైఎస్సార్‌ హయాంలో హంద్రీ నీవా కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం టీడీపీ వారు పూర్తి చేసి తామే చేశామంటూ గొప్పలు చెబుతున్నారు. కానీ వాస్తవంగా వాళ్లు ఆయకట్టు రద్దు చేసి రైతులకు అన్యాయం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే కోస్తాంధ్రాలను తలపించే విధంగా అనంతకు హంద్రీ నీవా నుంచి పిల్ల కాలువల ద్వారా నీటిని అందిస్తాం.– నదీమ్‌ అహమ్మద్, హిందూపురం పార్లమెంట్‌ సమన్వయకర్త

కరువు నివారణ పథకాలు కరువు
జిల్లాలో కరువును నివారించే పథకాలే కరువయ్యాయి. దీంతో చాలామంది రైతులు పొలాల్లో నీరులేక భూములను బీళ్లుగా వదిలేసి వలసలు వెళ్తున్నారు. కోస్తాంధ్రాలో ప్రతి ఎకరాకూ నీళ్లు వెళ్లాయి. రాయలసీమలో ఆ పథకం మొదలైతే రైతులు రాజు అవుతారు. రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అనంతలో నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. గతంలో జిల్లాకు రూ.7,676 కోట్లతో ప్రాజెక్టు ఉన్నా టీడీపీ ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు.– పీడీ రంగయ్య, అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు