సీఎం సభలో 'ఢీ'ఎస్సీ

7 Dec, 2018 11:24 IST|Sakshi
సీఎం సభా ప్రాంగణం నుంచి డీఎస్సీ అభ్యర్థిని బలవంతంగా తరలిస్తున్న పోలీసులు

సభాప్రాంగణంలో  డీఎస్సీ అభ్యర్థుల నిరసన

అభ్యర్థులపై మండిపడిన ముఖ్యమంత్రి

విద్యార్థులను బలవంతంగా తరలింపు

బాధిత విద్యార్థులకు వైఎస్సార్‌సీపీ బాసట

సభకు జనం బస్సుల్లో తరలింపు

ప్రసంగంతో విసుగుచెందిన వైనం

ఆదరణ పనిముట్లు కొందరికే..

సాక్షి, చిత్తూరు,తిరుపతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో సొంత డబ్బాకు పాధాన్యతనిస్తున్నారు. పేదరికంపై గెలుపు పేరుతో గురువారం తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీయూనివర్సిటీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగంమే ఇందుకు నిదర్శనం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేం దుకు జిల్లా అధికారయంత్రాంగం నానా అవస్థలు పడ్డారు. డ్వాక్రా మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు రుణాలు, పనిముట్లు ఇస్తామని హామీ ఇచ్చి చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు, పీలేరు ప్రాంతాల నుంచి  ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించారు. మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుందని చెప్పారు. సీఎం సాయంత్రం4.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. జనం గంటల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి.  కొందరు ఓపిక నశించి వెనక్కి వెళ్లిపోయారు.  సీఎం లబ్ధిదారులకు పనిముట్లను అందజేయకుండా తన పాలన గురించి గంట పాటు తనకు తానే పొగుడుకున్నారు. కలెక్టర్‌ ప్రద్యుమ్న అందజేసిన స్క్రిప్టును చదివి లబ్ధిదారులకు  విసుగు పుట్టించారు. జనం వెళ్లిపోతున్నా సీఎం చదవటం కొనసాగించారు. పనిముట్లను, రుణాల పథకాలను ఎరగా వేసి తీసుకొచ్చిన వారికి మొండిచేయి చూపించారు. 11వేల మందికి ఆదరణ పనిముట్లు ఇవ్వాల్సి ఉండగా 15 మందికి ఇచ్చి మిగిలిన వారిని వెనక్కి పంపారు.

డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
డీఎస్సీ కోసం నాలుగున్నరేళ్లుగా ఎదురుచూసిన నిరుద్యోగ అభ్యర్థులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.  సీఎం వస్తున్నారని తెలుసుకున్న వీరు సభా ప్రాంగణానికి చేరుకుని న్యాయం చేయాలని నినాదాలు చేశారు.  వీరిపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో అభ్యర్థులంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొంద రు సీఎం తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు కొందరు అభ్యర్థులను అరెస్టు చేశారు. వారిని పోలీసులు తీవ్రస్థాయిలో హెచ్చరించినట్లు తెలిసింది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువనాయకుడు భూమన అభినయరెడ్డి, ఎస్‌కే బాబు, ఎంవీఎస్‌ మణి, పుల్లయ్య, ఇమామ్, లక్ష్మి, కుమార్, రెడ్డిరాణి, సుబ్రమణ్యం, చంద్ర, అనిల్‌ తదితరులు యూనివర్సిటీ పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయం చేయమని అడిగేందుకు వచ్చిన అభ్యర్థులను అరెస్టు చెయ్యటం అన్యాయమన్నారు. అభ్యర్థులను విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, అందులో భాగంగా అవిలాల చెరువులో రూ.181.13 కోట్లతో ఎస్వీ ఆధ్యాత్మిక, వైభవ ఉద్యానవనం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అవిలాల చెరువులో ఎస్వీ ఆధ్యాత్మిక, వైభవ ఉద్యానవనం పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు.

>
మరిన్ని వార్తలు