ఓ అధికారి ఓవరాక్షన్‌ అన్నీ నేనే.. అంతా నేనే..

11 Jan, 2020 12:55 IST|Sakshi

డీఎస్‌ఓ కార్యాలయంలోరచ్చరచ్చ

తాను తలచుకుంటే ఇక్కడ ఉండరని హెచ్చరికలు

సతాయింపునకు గురవుతున్న ఉద్యోగులు

తాజాగా ఓ మహిళా ఉద్యోగికి బెదిరింపు

జేసీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు

విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కార్యాలయంలో ఓ సహాయ అధికారి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నాకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసు అని అతను చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. ఆ శాఖలో ఆయన పెత్తనం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. చెప్పాలంటే డీఎస్‌ఓ కార్యాలయంలో అంతా ఆయన అజమాయిషీయే కొనసాగుతున్నది. ఉద్యోగులపై తప్పుడు ఫిర్యాదులు పెట్టడం, ఆ ఫిర్యాదులతో బ్లాక్‌మెయిల్‌ చేయడం, అధికారులు సైతం ఆయన చెప్పినట్టే నడుచుకుంటారని బెదిరించడం పరిపాటిగా మారింది. ఇప్పడాయనపైనే జాయింట్‌ కలెక్టర్‌కు, కలెక్టర్‌కు ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధిస్తున్నారని మొరపెట్టుకోవడమే కాకుండా ఆయన గారి లీలలన్నీ సదరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్‌ జె. నివాస్‌ ఆయనపై విచారణకు ఆదేశించారు.

సస్పెండైన ఒక సీఎస్‌ డీటీకి మళ్లీ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.50 వేలు లాగేశారు. నేరుగా తన బ్యాంకు ఖాతాలోనైతేఇబ్బందులొస్తాయని ఒక అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఖాతాలో ఆ సొమ్ము వేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఆ ఉద్యోగికి న్యాయం చేయలేదు. సాధారణంగా సస్పెన్షన్‌ పునరుద్ధరణ విషయంతో ఆ అధికారికి సంబంధం లేదు. శాఖాపరమైన నిబంధనల మేరకు జేసీ తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది.  ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తి వేసి ఎలాగూ విధులకు అనుమతిస్తారని తెలుసుకుని తానే అంతా చేస్తానన్నట్టుగా బిల్డప్‌ ఇచ్చి రూ.50 వేలు పిండేశారన్న వాదనలు ఉన్నాయి. మచ్చుకు ఇదొకటి. ఇలాంటివి అనేకం ఉన్నాయని అక్కడి ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. తనకు వాళ్లు తెలుసు, వీళ్లు తెలుసని పెద్ద పెద్ద వాళ్ల పేర్లు చెప్పి డీఎస్‌ఓ కార్యాలయంలో అంతా తానై వ్యవహరిస్తున్నారు. భయపెట్టి దారికి తెచ్చుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. ఇంకొక విషయమేమిటంటే తానే ఫేక్‌ ఫిర్యాదులు పెట్టి, ఆ ఫిర్యాదులు చూపించి ఉద్యోగులను బెదిరించడం పరిపాటిగా మారింది. 

చేసేవి తప్పులు.. ఆపై ఎదురుదాడి  
ఆ సహాయ అధికారికి ఉన్న అహం అంతా ఇంతా కాదు. తప్పులు చేసి తిరిగి ఎదురు దాడి చేస్తారు. ప్రజాప్రతినిధులను సైతం పట్టించుకోవడం లేదు. వారెంత నా ముందు అన్నట్టుగా ఓవరాక్షన్‌ చేస్తారు. తాజాగా మిల్లులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల అడ్డగోలు ట్యాగింగ్‌పై ఇదే రకంగా వ్యవహరించారు. పోలాకి మండలం ఈదులవలస కొనుగోలు కేంద్రాన్ని గాలికొదిలేసి రాళ్లపాడుకు చెందిన మిల్లును నరసన్నపేట కొనుగోలు కేంద్రానికి ట్యాగ్‌ చేయడంపై పెద్ద వివాదమే నడుస్తోంది.

మిల్లరు, డీఎస్‌ఓ కార్యాలయం ఉద్యోగులు కొందరు కుమ్మక్కై చేసిన అడ్డగోలు భాగోతంపై విచారణ కూడా జరిగింది. దీనిపై రైతులు కూడా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పరిశీలించిన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు లేఖ కూడా రాసారు. రైతులకు అన్యాయం చేసిన వారిని వదలకూడదని లేఖలో తెలిపారు. చినికి చినికి గాలివానగా మారినట్టు అడ్డగోలు ట్యాగింగ్‌ వివాదం పెద్దది కావడంతో అధికారులు సైతం ఒక ఉద్యోగిపై చర్యలు తీసుకునేందుకు ఫైలు పెట్టారు. అయితే ఆ ఉద్యోగిపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవద్దని అధికారులపై ఈయన గారు ఒత్తిడి చేస్తున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన బాగోతమే.

మహిళా ఉద్యోగికి బెదిరింపు
డీఎస్‌ఓ కార్యాలయంలో జరుగుతున్న అడ్డగోలు బాగోతమంతా బయటికి వెల్లడిస్తున్నారని చెప్పి శారద అనే మహిళా ఉద్యోగిపై కక్ష సాధింపునకు దిగారు. ఆమెను ఇష్టమొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా... తానేంటో చూపిస్తానని, తనకు పలుకుబడి ఉందని, వదిలేని లేదని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా ఫేక్‌ ఫిర్యాదులను చూపించి భయపెట్టారు. దీంతో ఆ మహిళా ఉద్యోగి ఆందోళనకు గురై, తీవ్ర మనస్తాపం చెంది జాయింట్‌ కలెక్టర్, కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. డీఎస్‌ఓ కార్యాలయంలో జరుగుతున్న తంతు, ఆయన వ్యవహార శైలి, లీలలను ఆమె ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాస్తవమేంటో తెలుసుకుని కలెక్టర్‌ జె.నివాస్‌ విచారణకు ఆదేశించారు. మహిళ ఫిర్యాదు చేసిన అధికారిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా పౌరసరఫరాల అధికారి నాగేశ్వరరావును కలెక్టర్‌ ఆదేశించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ జె.నివాస్‌ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమకు మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై విచారణకు ఆదేశించామని, ఇరువురి వాదనలు విన్నాక ఏది వాస్తవమో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు