అయ్యయ్యో!

27 Oct, 2013 03:42 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: పెన్నానది మురుగు కూపంగా మారుతోంది. నగరంలోని చెత్తా, చెదారం, డ్రైనేజీ నీరు, ఫ్యాక్టరీల వ్యర్థాలకు పవిత్ర పెన్నానది  నిలయంగా మారి నది నీళ్లు విషపూరితమౌతున్నాయి. దీంతో నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్న  పెన్నాతాగునీరు విషమయం అవుతున్నాయి. ఈ నీటితో పండే పంటలు సైతం విషపూరితంగా మారుతున్నాయి. మరోవైపు మితిమీరిన ఆక్రమణలతో నది రోజురోజుకూ కుంచించుకు పోతోంది.
 
 సింహపురి నగరానికి సమీపంలో ఉన్న  పవిత్ర పెన్నానది నెల్లూరు కార్పొరేషన్ వారికి చెత్తా చెదారం నింపుకునే డంపింగ్ యార్డుగా మారిపోయింది. ప్రతిరోజూ  నగరంలోని టన్నుల కొద్దీ చెత్తను వారు బోడిగాడితోట ప్రాంతానికి ఆనుకొని ఉన్న నదిలోకి వదులుతున్నారు. మురిగిన చెత్త నదినీటిని విషపూరితం చేస్తోంది.
 
 దీంతో పాటు రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు, చిన్నచిన్న పరిశ్రమల మురుగు, వ్యర్థాలు నేరుగా నదిలోకి వస్తుండటంతో నీరు విపరీతమైన కాలుష్యానికి గురవుతోంది. ఇక నగరానికి తాగునీటిని అందించే పాత పెద్దాస్పత్రి ప్రాంతంలోని నదిలో ఉన్న  వాటర్ పంపింగ్ సిస్టమ్‌లు ఉన్న  ప్రాంతంలో  సైతం చెత్త, వ్యర్థాలతో పాటు మురుగు నీరు వదులుతున్నారు. దీంతో ఆ ప్రాంతం కలుషితమౌతోంది. తాగునీరు సైతం కలుషితం అవుతుండటంతో నగరవాసులు రోగాల బారిన పడుతున్నారు.
 
 ఈ విషయమై ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, ఆందోళనలు నిర్వహించినా వారు ఏమాత్రం స్పందించిన పాపానపోలేదు. ఇక కలుషితమైన నది నీరు పంటపొలాలను నిర్వీర్యం చేయడమే కాక పంటలను విషపూరితం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఇదివరకే నిపుణులు నిర్ధారించారు. గతంలో ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పెన్నా నీటిని  పరీక్షించింది. నీటిలో అధిక మోతాదులో ప్రమాదకర స్థాయిలో కలుషిత పదార్థాలు ఉన్నాయని నిర్ధారించింది. నదినీరు కలుషితం కాకుండా బయటే శుద్ధి చేసేందుకు  రీసైక్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించిం ది. దీంతో పాటు వర్షపు, మురుగు నీరు  సైతం  నే రుగా నదిలో కలవకుండా ప్రత్యేక కాలువను నిర్మించడమే కాక పెన్నాలో పేరుకు పోయిన  పూడికతీత పనులను   చేపట్టాలని నాడు కమిటీ సూచిందింది. ఇందులో భాగంగా  పెన్నా కలుషిత నివారణకు కేం ద్రం నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఆ తర్వాత  ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదనలు, నిధుల కేటాయింపులు అటకెక్కాయి. ప్రజల పుణ్యమాని పదవులు అనుభవిస్తున్న ఇక్కడి ప్రజాప్రతినిధులు, మంత్రి వారి బాగోగులు పట్టించుకునే పరిస్థితి లేకపోయింది.
 
 ఆక్రమణలతో రోజురోజుకూ పెన్నా కుంచించుకుపోతోంది. అధికార పార్టీ నేతల అండతో నేతలు  నగర పరిధిలోని వెంకటేశ్వరపురం, జనార్దన్‌రెడ్డి కాలనీ, రంగనాయకులపేట రైల్వేగేటు, జాఫర్ సాహెబ్ కాలువకట్ట, బోడిగాడితోట నుంచి మైపాడుగేటు  వరకూ పెద్ద ఎత్తున నదిని ఆక్రమించి  ఏకంగా పక్కా గృహాలనే నిర్మించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించడంతోపాటు  పూడికతీత, నదీజలాల శుభ్రతపై  దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.     

మరిన్ని వార్తలు