మామూళ్ల కిక్‌

27 Jul, 2018 13:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జిల్లాలో ఎక్సైజ్‌ శాఖ మూమూళ్ల మత్తులో తూలుతోంది. జిల్లాలో కల్తీ మద్యం, నాటుసారా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటి మూలంగా ఎంతో మంది ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. కల్తీని, ఛీప్‌ లిక్కర్‌ను నియంత్రించాల్సిన ఎక్సైజ్‌ శాఖ మొక్కుబడి చర్యలకే పరిమితం అయింది. తాజాగా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో ఇద్దరు వ్యక్తులు కల్తీ మద్యానికి బలయ్యారు. మద్యం బాటిల్‌ మూత తీయకుండానే విషపూరిత పదార్థాలు కల్తీ చేయడం మూలంగానే వీరు ప్రాణాలు కోల్పోయారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది.  దీన్ని బట్టి మద్యం బాటిళ్లలో ఏ స్థాయిలో కల్తీ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

నెల్లూరు(క్రైమ్‌) : జిల్లాలో 349 మద్యం దుకాణాలు, 46 బార్లు ఉన్నాయి. వీటిలో అధికశాతం దుకాణాలు, బార్లలో కల్తీ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. మద్యం సీసామూతలను చాకచక్యంగా తొలగించి అధికంగా అమ్ముడుపోయే బ్రాండ్ల (ఛీప్‌లిక్కర్‌)లో కల్తీకి పాల్పడుతున్నారు. క్వార్టర్‌ బాటిల్‌లో 30 ఎంఎల్‌ మద్యాన్ని తీసివేసి నీటిని కలుపుతున్నారు. పెద్దపెద్ద బ్రాండ్లలో నీటికి బదులు ఛీప్‌లిక్కర్‌ను కలిపి విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కల్తీ మద్యం తాగడం వల్ల మం దుబాబులు అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. మద్యం వ్యాపారులు «ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నా.. ఎక్సైజ్‌శాఖ పట్టీపట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రతి మద్యం దుకాణం, బార్‌ను ఎక్సైజ్‌ శాఖ అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. దుకాణంలోని ప్రతి బ్రాండ్‌ నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలు నిర్వహించాలి. కల్తీని కనుగొనేందుకు అవసరమైతే పరీక్షల నిమిత్తం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపాలి. అయితే ఈ ప్రక్రియ జిల్లాలో నామమాత్రంగానే జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. 

నామమాత్రపు దాడులు 
కల్తీ విక్రయాలపై క్రమం తప్పకుండా ఎక్సైజ్‌శాఖ తనిఖీలు నిర్వహించి విక్రయాలకు పాల్పడే దుకా ణాలపై కేసులు నమోదు చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎక్సైజ్‌ శాఖ చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్‌శాఖ  ఉన్నతాధికారులు మందలిస్తేనో? ఏవైనా ఫిర్యాదులు అందితేనో దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జిల్లాలోని వింజమూరు, రాజుపాళెం, ఆదూరుపల్లి, కావలి తదితర ప్రాంతాల్లో ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేసి కల్తీ విక్రయాలను గుర్తించారు. ఆయా దుకాణాలపై కేసులు నమోదు చేసి సరిపెట్టుకున్నారు. మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలు జరపకూడదనే నిబంధన ఉన్నా.. అనేక మద్యం దుకాణాల్లో లూజు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీనిని నియంత్రించడంలోనూ ఎక్సైజ్‌శాఖ విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. 

తాజా ఘటనతో కదలిక 
బుచ్చిరెడ్డిపాళెం మండలంలో బుధవారం అర్ధరాత్రి మద్యం తాగి ఇద్దరు మృతి చెందిన విషయం విది తమే. ఈ ఘటన జిల్లాలో తీవ్రకలకలం రేకెత్తించిం ది. ఈ పరిణామాలతో ఎక్సైజ్‌ శాఖ సైతం ఉలిక్కిపడింది. ఉన్నతాధికారులు దీనిపై ఆరా తీయడంతో ఎక్సైజ్‌ శాఖలో కదలిక మొదలైంది. దీనికి కారణ మైన మద్యం దుకాణంలో ఎక్సైజ్‌ అధికారులు తని ఖీ చేశారు. మృతులు తాగిన మద్యం సీసాను స్వాధీ నం చేసుకున్నారు. ఆ మద్యం ఏ దుకాణం నుంచి కొనుగోలుచేశారనే వివరాలు సేకరిస్తున్నా రు. 

జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
తాజా ఘటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్నీ మద్యం దుకాణాలు, బార్లలో తనిఖీలు నిర్వహించాలని ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ టి. శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. దీంతో జిల్లాలోని బార్లు, మద్యం దుకాణాల్లో ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. కల్తీ విక్రయాలను గుర్తిస్తే వెంటనే సంబంధిత దుకాణంపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. మొత్తం మీద మందుబాబుల ప్రాణాలు హరీ అంటే గాని ఎక్సైజ్‌ శాఖలో కదలికలు లేకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్‌ అధికారులు స్పందించి దాడులు ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు.    

>
మరిన్ని వార్తలు