డ్వాక్రా మహిళల ఆకలికేకలు

25 Jan, 2019 20:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : సెల్ ఫోన్, పదివేల నగదు ఇస్తామని నమ్మించి కనీసం భోజనం కూడా పెట్టలేదని సీఎం చంద్రబాబు నాయుడు సభలకు వెళ్లిన డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు బస్సుల్లో తీసుకెళ్లి, టీడీపీ నేతలు సభప్రాంగణంలో వదిలేశారని నిప్పులు చెరిగారు. సాయంత్రం ఆరు వరకు తిండితిప్పలను కూడా నేతలు పట్టించుకోలేదన్నారు. మహిళల ఆగ్రహంతో సాయంత్రం ఒక్కొక్కరికి రూ.20 చొప్పున పంపిణీ చేశారు. తిరుగు ప్రయాణానికి బస్సులు రావటం ఆలస్యం కావడంతో మహిళలు ఇబ్బందిపడ్డారు. నిన్నటి వరకు డ్వాక్రా మహిళలకు పదివేలు చొప్పున ఇస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈరోజు అమలు దగ్గరికి వచ్చే సరికి పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులిచ్చి చేతులు దులుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో చెక్కులు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చాక డబ్బులు ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. 

మరోవైపు డ్వాక్రా సంఘాల ఆత్మీయ సమ్మేళనం పేరుతో చంద్రబాబు నిర్వహించిన సభకు వెళ్లి వస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. నందిగామ సోమవారం గ్రామానికి చెందిన జిల్లేపల్లి రామారావు అనే వ్యక్తి తన భార్య డ్వాక్రా సంఘాల బుక్ కీపర్ కావడంతో తనకు సహాయంగా ముఖ్యమంత్రి సభకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో స్థానిక కంచికచెర్ల ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే రామారావు చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. అయితే సభకు వెళ్లిన మహిళలకు కనీస సదుపాయాలు లేవని ఉదయం బయలుదేరి వెళ్లిన వారికి కనీసం భోజన సదుపాయాలు కూడా కల్పించలేదని, ఖాళీ కడుపుతో తిరిగి వచ్చామని  మార్గ మధ్యలో నీరసంగా ఉండి  రామారావు గుండెపోటుకు గురయ్యారని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు