ప్రణబ్‌దా భారతరత్న 

25 Jan, 2019 20:37 IST|Sakshi

నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్‌ హజారికాలకు మరణానంతరం అత్యున్నత పౌర పురస్కారం

ప్రతిష్టాత్మక అవార్డు  ప్రకటించిన కేంద్రం

వారి సేవల్ని శ్లాఘించిన ప్రధాని మోదీ, రాహుల్

 విధేయతతో స్వీకరిస్తున్నా: ప్రణబ్‌ 

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. జనసంఘ్‌ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ వాగ్గేయకారుడు భూపేన్‌ హజారికా కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సుమారు నాలుగేళ్ల తరువాత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది. ఈ ముగ్గురితో కలిపి ఇప్పటిదాకా భారతరత్న పొందిన ప్రముఖుల సంఖ్య 48కి చేరింది. ప్రణబ్‌ ముఖర్జీ 2012–17 మధ్య కాలంలో భారత 13వ రాష్ట్రపతిగా పనిచేయగా, దేశ్‌ముఖ్, హజారికాలు మరణానంతరం ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గతేడాది ఆరెస్సెస్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రణబ్‌ ముఖర్జీ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

బీజేపీ మాతృసంస్థ జనసంఘ్‌ వ్యవస్థాపకుల్లో దేశ్‌ముఖ్‌ ఒకరు కాగా, ఈశాన్య భారత్‌ నుంచి సినీరంగానికి విశిష్ట సేవలందించిన ప్రముఖుల్లో హజారికా ఒకరు. దేశ ప్రజలకు తాను చేసిన దానికన్నా ప్రజలే తనకు ఎక్కువిచ్చారని ప్రణబ్‌ ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. ‘ నాకిచ్చిన ఈ గొప్ప గౌరవాన్ని  దేశ ప్రజల పట్ల పూర్తి కృతజ్ఞతా భావం, విధేయతతో స్వీకరిస్తున్నా. నేను ఎప్పటికీ చెప్పేదాన్నే మళ్లీ చెబుతున్నా. ఈ గొప్ప దేశ ప్రజలకు నేను చేసిన దానికన్నా నాకే వారు ఎక్కువిచ్చారు’ అని ట్వీట్‌ చేశారు. చివరగా 2015లో  మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు మదన్‌ మోహన్‌ మాలవీయకు భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రణబ్, దేశ్‌ముఖ్, హజారికాలకు ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా శుభాకాంక్షలు తెలిపారు.

అభివృద్ధి మార్గంపై చెరగని ముద్ర: మోదీ
ప్రణబ్‌ ముఖర్జీ, దేశ్‌ముఖ్, హజారికాల సేవల్ని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్లు చేశారు. దశాబ్దాల పాటు నిస్వార్థంగా ప్రజాసేవచేసిన ప్రణబ్‌ ముఖర్జీ సమకాలీన రాజనీతిజ్ఞుల్లో గొప్పవారని, దేశ అభివృద్ధి మార్గంపై ఆయన చెరగని ముద్ర వేశారని ప్రశంసించారు. ‘ప్రణబ్‌దాకు భారతరత్న రావడం పట్ల సంతోషంగా ఉంది. ఆయన తెలివి, ప్రజ్ఞకు సాటిగా నిలిచేవారు కొందరే ఉన్నారు’ అని అన్నారు. గ్రామీణాభివృద్ధిలో విశేష కృషిచేసిన దేశ్‌ముఖ్‌..గ్రామీణుల సాధికారతా విషయంలో గొప్ప మార్పులకు నాందిపలికారని కొనియాడారు. ‘అణగారిన, వెనకబడిన వర్గాల పట్ల కరుణ, విధేయత కనబరచిన దేశ్‌ముఖ్‌ నిజమైన భారతరత్న’ అని పేర్కొన్నారు. ఇక హజారికా సేవల్ని ప్రశంసిస్తూ ఆయన గేయాలు తరాలకు అతీతంగా గౌరవం పొందాయని అన్నారు. ‘హజారికా పాటలు న్యాయం, సమైక్యత, సోదరభావం అనే సందేశాలిస్తాయి. భారత సంగీత సంప్రదాయాల్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారు. భూపేన్‌ హజారికాకు భారతరత్న దక్కడం ఆనందంగా ఉంది’ అని మోదీ అన్నారు. ప్రజాసేవ చేసిన తమలో ఒకరికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం రావడం పట్ల కాంగ్రెస్‌ గర్విస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. హజారికా, దేశ్‌ముఖ్‌లకు కూడా ఈ అవార్డు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
 
రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి సరసన ప్రణబ్‌..
కాంగ్రెస్‌ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక, విదేశాంగ, రక్షణ శాఖ మంత్రిగా సేవలందించారు. 1982లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి, ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్‌ హుస్సేన్, వీవీ గిరి సరసన తాజాగా ప్రణబ్‌ చేరారు. 2010లో మరణించే వరకు దేశ్‌ముఖ్‌ ఆరెస్సెస్‌తో సంబంధాలు కొనసాగించారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమ రూపకల్పనలో, 1977లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. రుద్రాలీ, దార్మియాన్, గాజాగామిని, డామన్‌ లాంటి బాలీవుడ్‌ చిత్రాలతో పాటు పలు అస్సాం సినిమాలకు హజారికా సంగీతం సమకూర్చారు.

బెంగాల్‌ నుంచి ప్రణబ్‌కు వెల్లువెత్తిన శుభాకాంక్షలు..
భారతరత్న పొందిన ప్రణబ్‌ ముఖర్జీకి సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌ నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరిగా నిలిచిన ప్రణబ్‌ భారతరత్నకు ఎంపికవడం బెంగాల్‌ ప్రజలకు గర్వకారణమని కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌధరి అన్నారు. అధికార తృణమూల్, ప్రతిపక్ష సీపీఎంలు కూడా ప్రణబ్‌కు శుభాకాంక్షలు తెలిపాయి. ఆయన ఈ దేశానికి గొప్ప పుత్రుడు మాత్రమే కాదని, గొప్ప మానవతావాది కూడా అని తృణమూల్‌ ప్రధాన కార్యదర్శి పార్థా ఛటర్జీ పేర్కొన్నారు.

సమాజ సేవకుడిగా.. 
నానాజీ దేశ్‌ముఖ్‌.. సమాజ సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సేవలు ప్రశంసనీయం. బయటి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వెనుకబడిన, బలహీన వర్గాల ఉద్ధరణకు నడుంబిగించి.. ఆ దిశగా గణనీయమైన మార్పును తీసుకొచ్చారు. గ్రామీణ స్వరాజ్యంతోపాటు దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో మార్పులకోసం తీవ్రంగా శ్రమించారు. 1916లో మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో నానాజీ జన్మించారు. ఆయన అసలు పేరు చండికాదాస్‌ అమృత్‌రావ్‌ దేశ్‌ముఖ్‌. 12 ఏళ్ల వయసులోనే స్వయం సేవక్‌గా జీవితాన్ని ప్రారంభించారు. చదువుకోవాలనే తన ఆశకు ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకిగా మారడంతో కూరగాయలు విక్రయించి వచ్చే డబ్బులతో చదువుకున్నారు. బాలా గంగాధర్‌ తిలక్‌ స్ఫూర్తిగా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. బిర్లా కాలేజీ (నేటి బిట్స్‌)లో విద్యాభ్యాసం చేశారు. భారతీయ జన్‌సంఘ్‌ క్రియాశీల కార్యకర్తగా మారారు.

ఆ తర్వాత బీజేపీలోనూ కీలక నేతగా బాధ్యతలు నిర్వహించారు. తను ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో ఎవరికీ రావొద్దని భావించి.. పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందేలా తనవంతు కృషిచేశారు. దేశవ్యాప్తంగా సరస్వతీ విద్యామందిరాలను ఆయన ప్రారంభించారు. మంథన్‌ అనే పత్రికను స్థాపించి.. చాలా ఏళ్లపాటు తనే సొంతగా నిర్వహించారు. పుట్టింది మహారాష్ట్రలోనైనా.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలోనే నానాజీ విస్తారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 500 గ్రామాల్లో సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. 1977లో లోక్‌సభ ఎంపీగా గెలిచారు. 1999లో ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభకు నామినేట్‌చేసింది. దేశంలోనే తొలి గ్రామీణ యూనివర్సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్‌లోని ‘చిత్రకూట్‌ గ్రామోదయ విశ్వవిద్యాలయ’నానాజీ ఆలోచనల ఫలితమే. 1974నాటి జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమ రూపకర్తల్లో నానాజీ కూడా ఒకరు. 94 ఏళ్ల వయసులో 2010 ఆయన కన్నుమూశారు. 

బ్రహ్మపుత్ర కవి.. సుధాకాంత భూపేన్‌ హజారికా నేపథ్యమిదీ..
ఈశాన్య ప్రాంత సంస్కృతి, జానపద సంగీతాన్ని హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసిన భూపేన్‌ హజారికా..బ్రహ్మపుత్ర కవి, సుధాకాంత పేరుతో సుప్రసిద్ధులు. మానవత్వం, సోదరభావం, సార్వత్రిక న్యాయం ఉట్టిపడేలా ఆయన అస్సామీ భాషలో రాసిన గేయాలు, పాటలు ఇతర భాషలు ముఖ్యంగా బెంగాలీ, హిందీలోకి తర్జుమా అయ్యాయి. అసోం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లో ఆయన పాటలకు విపరీత ఆదరణ లభించింది. తన గాత్రంతో కొన్ని తరాలను ఉర్రూతలూగించారు. నేపథ్య గాయకుడు, సంగీతకారుడు, రచయిత, సినీ దర్శకుడిగా భారతీయ సినీరంగంపై తనదైన ముద్ర వేసిన హజారికాను జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు వరించాయి. 1926 సెప్టెంబర్‌ 8న అస్సాంలోని సాదియాలో హజారికా జన్మించారు. పది మంది సంతానంలో పెద్దవాడైన హజారికా బాల్యం నుంచే తల్లి నుంచి అస్సామీ సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. పదేళ్ల వయసులో ఓ కార్యక్రమంలో అస్సామీ భక్తి గీతాలు ఆలపిస్తుండగా ప్రముఖ రచయిత జ్యోతిప్రసాద్‌ అగర్వాలా, సినీ దర్శకుడు విష్ణుప్రసాద్‌ రాభా దృష్టిలో పడ్డారు. తరువాత 1939లో అగర్వాలా సినిమాలో రెండు పాటలు పాడారు.

13 ఏళ్ల వయసులో సొంతంగా పాట రాశారు. 1946లో బెనారస్‌ హిందూ వర్సిటీలో ఎంఏ పూర్తిచేసిన హజారికా కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు. ఆ తరువాత కొలంబియా యూనివర్సిటీలో చదువుకునేందుకు ఉపకారవేతనం లభించడంతో 1949లో న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ ప్రముఖ హక్కుల కార్యకర్త పాల్‌ రాబ్సన్‌తో ఏర్పడిన పరిచయం ఆయన జీవితంపై చాలా ప్రభావం చూపింది. కొలంబియా యూనివర్సిటీలోనే తనకు పరిచయమైన ప్రియంవదా పటేల్‌ను 1950లో వివాహమాడారు. 1953లో స్వదేశం తిరిగొచ్చారు. 1967–72 మధ్యలో అసోం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో బీజేపీ తరఫున గువాహటి నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1998–2003 వరకు సంగీత నాటక అకాడమీకి చైర్మన్‌గా వ్యవహరించారు. 2011 నవంబర్‌ 5న ముంబైలో కన్నుమూశారు. బ్రహ్మపుత్ర తీరంలో జరిగిన ఆయన అంత్యక్రియలకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు