కువైట్‌లో బోడసకుర్రు వాసి మృతి

22 Oct, 2019 08:56 IST|Sakshi
మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చుతున్న అమలాపురం ఎంపీ అనురాధ, జల్లి నరేంద్రబాబు (ఫైల్‌)  

సాక్షి, అల్లవరం (అమలాపురం): బోడసకుర్రు గౌతమీనగర్‌ గ్రామానికి చెందిన జల్లి నరేంద్రబాబు(25) కువైట్‌లో ఉద్యోగం చేస్తూ మృతి చెందాడు. బంధువుల కథనం ప్రకారం.. రెండేళ్ల క్రితం ఉద్యోగ రీత్యా కువైట్‌ వెళ్లిన నరేంద్రబాబు ఓ శేఠ్‌ వద్ద డ్రైవింగ్‌లో చేరాడు. ఏడాదిన్నర వరకు ప్రతిరోజు ఫోన్లో తల్లిదండ్రులు, సోదరులతో మాట్లాడుతూ ఉండేవాడు. నాలుగు నెలలుగా నరేంద్రబాబు నుంచి ఏలాంటి సమాచారం లేదు. అతడికి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌గా వస్తుండేదని కుటుంబీకులు తెలిపారు. దేశం కాని దేశంలో కుమారుడు ఏలా ఉన్నాడోనన్న దిగులు తల్లిదండ్రులకు గత నాలుగు నెలలుగా ఎక్కువైందన్నారు. ఈ వేళ కాకపోయినా రేపైనా కుమారుడు నుంచి ఫోన్‌ వస్తుందని ఆశగా ఎదురు చూడడం తప్ప ఏమి చేయలేని స్థితిలో నరేంద్ర తల్లిదండ్రులు ఉన్నారని కుటుంబీకులు తెలిపారు. వారం రోజుల క్రితం అల్లవరం ఎస్సై చిరంజీవికి నరేంద్రబాబు కువైట్‌లో మృతి చెందాడని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇండియన్‌ ఎంబసీ నుంచి సమాచారం వచ్చింది.

ఎస్సై చిరంజీవికి వచ్చిన సమాచారాన్ని గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. ఈ సమాచారం మేరకు నరేంద్రబాబు పాస్‌పోర్టు జెరాక్స్‌ కాపీల ఆధారంగా కువైట్‌లో పని చేస్తున్న నరేంద్రబాబు గురించి ఇండియన్‌ ఎంబసీ నుంచి ఆరా తీయగా  మృతి చెందాడని నిర్ధారణ అయ్యింది. అయితే నరేంద్రబాబు ఎలా మృతి చెందాడనేది తెలియలేదు. కువైట్‌లో మృతి చెందిన నరేంద్రబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించడానికి అమలాపురం ఎంపీ చింతా అనురాధ ప్రయత్నాలు ఫలించాయి. నరేంద్రబాబు మృతదేహాం సోమవారం స్వగ్రామం గౌతమినగర్‌కు చేరుకుంది. కుమారుడు మరణ వార్త విన్న తండ్రి జల్లి రాధాకృష్ణ కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడు తల్లిదండ్రులను ఎంపీ చింతా అనురాధ పరామర్శించారు. నరేంద్రబాబు మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి తల్లి, తండ్రి, ముగ్గురు సోదరులు ఉన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా