‘కంటి వెలుగు’లో... రాష్ట్రంలోనే నెం.1 

26 Oct, 2019 08:52 IST|Sakshi

దృష్టిలోపంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పేరుతో దశలవారీ కంటి పరీక్షలకు శ్రీకారం 

తొలి దశలో 7,04,570 మంది విద్యార్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ పూర్తి

33,391 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ 

నవంబరు 1వ తేదీ నుంచి రెండో దశ కంటి పరీక్షలు..కళ్లద్దాలు అందజేత

పౌష్టికాహార లేమి, వంశపారంపర్యం, జీవనశైలిలో మార్పులే ప్రధాన కారణాలు

దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఓ చిన్నారి అంధత్వం బారిన పడుతోందని పలు సర్వేలు వెల్లడించాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో ఈ సమస్యలు తీవ్రంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. పదో తరగతి గదిలో నల్లబల్లలపై రాసిన అక్షరాలు కనిపించక..దృష్టి లోపమని ఎవరికీ చెప్పుకోలేక విద్యార్థులు సతమతమతమయ్యేవారు. ఈ దుర్భర స్థితిని దూరం చేసి దృష్టిలోపాన్ని నివారించాలనే ఉన్నత ఆశయంతో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకం ప్రవేశ పెట్టి చిన్నారులకు చూపును ప్రసాదిస్తోంది. 

సాక్షి, కాకినాడ: విద్యార్థులకు దశల వారీగా కంటి పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలు చేసి, కళ్లద్దాలు అందజేసే లక్ష్యంతో వైఎస్సార్‌ సీపీ సర్కారు  కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు తొలి విడత కంటి పరీక్షలు పూర్తి చేశారు. ఈ పరీక్షల్లో 33,391 మంది విద్యార్థులకు కంటి సంబంధిత సమస్యలున్నట్లు గుర్తించారు.
జిల్లాలో ఇదీ పరిస్థితి
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని మొత్తం 5,998 పాఠశాలల్లో 7,27,609 మంది విద్యార్థులకు స్క్రీనింగ్‌ (కంటి పరీక్షలు) టెస్ట్‌ చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా..5,996 పాఠశాలల్లో 7,04,570 మందికి పరీక్షలు నిర్వహించారు. మిగిలిన కొన్ని పాఠశాలలకు సెలవులు కావడం, గతంలో పరీక్షలకు రాని 23,039 మంది విద్యార్థులకు ఇంకా పరీక్షలు చేయాల్సి ఉంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌లో  97 శాతం పూర్తి చేసి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సంపాదించింది.

బృందాల వారీగా.. 
ఈ పథకం తొలి విడత అమలు ప్రక్రియ కోసం జిల్లా వ్యాప్తంగా 4,550 బృందాలను నియమించారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 5,000 కంటి వెలుగు కిట్‌లు అందజేశారు. ఒక ఉపాధ్యాయుడు, ఏఎన్‌ఎం, ఆశ, కార్యకర్తలను బృందంలో సభ్యులుగా నియమించారు. విద్యార్థుల దృష్టి లోపాలను ఎలా గుర్తించాలనే విషయంపై ఈ బృందాల్లోని సభ్యులకు ముందుగానే శిక్షణ ఇచ్చారు. నేత్ర సమస్యలను గుర్తించేందుకు వీలుగా అందజేసిన కిట్‌లో టార్చిలైట్లు, టేపు, నాలుగు గుర్తులతో కూడిన చార్టులను ఉంచారు. విద్యార్థికి 6 నుంచి 10 అడుగుల దూరంలో చార్ట్‌ను ఉంచి గుర్తులను పోల్చి చెప్పాలని పరీక్ష పెడుతూ దృష్టిలోపం ఉందో లేదో గుర్తించారు. కనుపాప పైపొరలు, దృష్టిలోపం ఉన్న  33,391 మందిని కంటి వెలుగు పథకంలో తొలి విడతలో గుర్తించారు.

33,391 మందికి దృష్టిలోపం 
స్క్రీనింగ్‌ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో 33,391 మందికి దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించారు. అయితే వీళ్లలో కళ్లజోళ్లతోనే ఎక్కువ మందిలో సమస్య తీరిపోతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కొద్ది మందికి శస్త్రచికిత్సలు, ఉన్నత వైద్యం అవసరం కానుంది.
కారణాలు ఏమిటంటే..
పిల్లల్లో దృష్టి లోపానికి మేనరిక వివాహాలు, పౌష్టికాహార లేమి, విటమిన్‌–ఎ లోపం, ఎలక్ట్రానిక్‌ రేడియేషన్, వంశపారంపర్యం ప్రధాన కారణాలని వైద్యులు ధ్రువీకరించారు. జంక్‌ఫుడ్‌ అధికంగా తీసుకోవడం, తగిన వ్యాయామం లేకపోవడం, తరగతి గదుల్లో సరైన వెలుతురు లేకపోవడం, బోర్డు నుంచి వచ్చే చాక్‌పీస్‌ పొడి కళ్లలో పడటం లాంటివి కూడా సమస్యకు దారి తీస్తాయంటున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలకు ఆటలు, వ్యాయామానికి తగిన సమయం ఇవ్వడం లేదు. ఇరుకు గదుల్లో తగినంత దూరంలో బ్లాక్‌ బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. తరగతి గదిలో కనీసం దూరంలో బోర్డు ఉండాలి అప్పుడే పిల్లల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది. సరైన వెలుతురు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో బోర్డు, వెలుతురు సమస్య అంతగాలేదు. చిన్న వయసు నుంచే ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లకు అలవాటుపడి..గంటల తరబడి చూడటం కూడా దృష్టి లోపాలకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. 

కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
నవంబర్‌ 1వ తేదీ నుంచి రెండో దశ
ప్రాథమిక దశలో నిర్వహించిన పరీక్షల్లో నేత్ర సమస్యలున్నట్లు గుర్తించిన వారికి రెండో దశలో ప్రత్యేక పరీక్షలు చేయనున్నారు. నవంబరు 1వ తేదీ నుంచి రెండో విడత ప్రారంభం కానుండగా కంటి వైద్యుల పర్యవేక్షణలో మరోసారి పరీక్షలు చేస్తారు. పరీక్షించిన వారిలో ఇప్పటికే 7,877 మందికి కళ్లద్దాలు ఉన్నాయి. వారికి అవసరం మేరకు అద్దాలను మార్చడం, అద్దాలు లేని వారికి కొత్తగా కళ్లద్దాలు అందజేస్తారు.  శస్త్ర చికిత్సలు అవసరమైతే నేత్ర వైద్యశాలకు తీసుకెళ్లి చేయించనున్నారు. చిన్నారుల్లో కార్నియా సమస్యలే అధికంగా ఉంటున్నాయని, పోషకాహార లోపం జన్యుపరమైన సమస్యలతో ఇబ్బంది పడేవారే ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

జాగ్రత్తలు పాటిస్తే మేలు 
కంటి సమస్యలను దూరం చేసేందుకు తగిన జాగ్రత్తలు పాటిస్తే ఉపయోగం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి రోజూ సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఆటలు అవసరం. విటమిన్‌–ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, క్యారెట్, గుడ్లు, చేపలు తీసుకోవాలి. పసుపు రంగు కలిగిన పండ్లు తినాలి. బొప్పాయి, అరటి, మామిడి, పైనాపిల్, పనస తదితర పండ్లు కళ్లు, మెదడుకు మంచిది.

100 శాతం అమలు చేస్తాం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకాన్ని వంద శాతం పూర్తి చేస్తాం. తొలి దశలో ప్రాథమిక పరీక్షల్లో ఆరు మీటర్ల దూరంలో నిర్ణీత పరిమాణం కలిగిన అక్షరాలను పూర్తిగా చెప్పలేపోయిన వారిని గుర్తించాం. విడివిడిగా రెండు కళ్లూ పరీక్షించాం. రెండో దశలో నవంబరు 1వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకు నిపుణులు పరీక్షిస్తారు. ఇందుకు గాను 30 మంది ఆప్తమాలజిస్టులు అవసరమని కోరాం. రెండో దశలో కంటి సమస్యలు గుర్తించిన వారికి అవసరాన్ని బట్టి మందులు, కళ్లజోళ్లు అందజేస్తాం. శుక్లాల సమస్య ఉన్న వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. ప్రస్తుతం నవోదయ లాంటి కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు అందుబాటులో లేరు. వారికి కూడా నేత్ర పరీక్షలు ఇదే తరహాలో నిర్వహిస్తాం. 
– డాక్టర్‌ పి.మల్లికార్జునరాజు, కంటి వెలుగు జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌   

మరిన్ని వార్తలు