పరీక్ష చేయించుకో.. బహుమతి తీసుకో..! 

12 Apr, 2020 04:02 IST|Sakshi
లక్కీడిప్‌ తీస్తున్న కరోనా నియంత్రణ ప్రత్యేకాధికారి కాంతిలాల్‌ దండే. చిత్రంలో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

కరోనా కట్టడికి తూ.గో. కలెక్టర్‌ వినూత్న కార్యక్రమం  

సాక్షి, కాకినాడ: కోవిడ్‌–19 వ్యాధి నివారణ దిశగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. పొడి దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు చేయించుకుంటే ఆకర్షణీయమైన గిఫ్ట్‌తోపాటు నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. ఈ లక్షణాలున్నవారు అధికారులకు సమాచారం అందిస్తే ఇంటి వద్దకే వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

ఒకవేళ పాజిటివ్‌గా తేలితే పేరు గోప్యంగా ఉంచి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. పరీక్షలు చేయించుకున్న వారిలో ప్రతి వారం ఐదుగురు చొప్పున లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేసి మిక్సీ, గ్రైండర్, గ్యాస్‌ స్టౌ, కుక్కర్‌ తదితర బహుమతులతోపాటు ఒక్కొక్కరికి రూ.5,500 అందజేస్తామని వివరించారు. ఈ వారం రోజుల్లో వైద్య పరీక్షలకు ముందుకు వచ్చిన వారిలో లక్కీడిప్‌ ద్వారా ఎంపికైన ఐదుగురు విజేతలకు శనివారం కలెక్టరేట్‌లో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం కోవిడ్‌–19 నియంత్రణ, పర్యవేక్షణకు నియమించిన ప్రత్యేకాధికారి కాంతిలాల్‌ దండే ఆధ్వర్యంలో జరిగింది.
 

>
మరిన్ని వార్తలు