విద్యాసంస్థలపై పీటముడి

3 Nov, 2014 03:24 IST|Sakshi
  • ఐఐటీ, ఐఐఎస్‌ఈఆఆర్‌లకు భూకేటాయింపుల వ్యవహారం కొలిక్కిరాని వైనం!
  •  తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే భూమి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం షరతు
  •  ఏర్పేడు మండల పరిధిలోనే వీటిని ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రం ఒత్తిడి
  •  వచ్చే విద్యాసంవత్సరంలో ఐఐటీ తరగతులు ప్రారంభించాలంటూ ప్రతిపాదన
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: వచ్చే విద్యా సంవత్సరంలో ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) తరగతులను ప్రారంభించాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గానీ.. చిత్తూరుకు సమీపంలో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలోగానీ ఖాళీగా ఉన్న భవనాల్లో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించాలని ప్రతిపాదించింది.

    శాశ్వత భవనాల నిర్మాణానికి భూకేటాయింపులపై స్పష్టత వస్తేనే తరగతుల ప్రారంభంపై హామీ ఇస్తామని కేంద్ర మానవ వనరులశాఖ స్పష్టీకరించినట్లు అధికారవర్గాలు వెల్లడించడం గమనార్హం. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి కేంద్రం అంగీకరించిన 11 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్)లను తిరుపతిలో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఆ సంస్థల బూచి చూపి, తమ భూములను అధిక ధరలకు అమ్మి, సొమ్ముచేసుకోవడానికి ఓ మంత్రి, మరో టీడీపీ ఎంపీ ఎత్తు వేశారు. ఏర్పేడు మండలం మేర్లపాక, పంగూరు సమీపంలో వివాదాస్పద భూములు 178 ఎకరాలను టీడీపీ ఎంపీ అత్తెసరు ధరలకే కొనుగోలు చేశారు. మేర్లపాకలో ఓ మంత్రి కూడా బినామీ పేర్లతో 92 ఎకరాల భూములను కొనుగోలు చేసినట్లు టీడీపీ వర్గాలే బాహాటంగా అంగీకరిస్తున్నాయి.

    తాము కొనుగోలు చేసిన భూముల సమీపంలోనే ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను ఏర్పాటుచేసేలా భూసేకరణ చేయాలని సదరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ద్వారా జిల్లా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా అధికారులు ఐఐటీ ఏర్పాటుకు మేర్లపాకలో 440 ఎకరాలు, ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుకు పంగూరులో 398 ఎకరాల భూమిని గుర్తించి.. కేంద్ర మానవ వనరులశాఖకు ప్రతిపాదనలు పంపారు.

    ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ యాజమాన్య బృందం మేర్లపాక, పంగూరుల్లో సెప్టెంబరు 15న పర్యటించి.. ఆ భూములను పరిశీలించిన విషయం విదితమే. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోనే ఉన్నా.. స్పాంజ్ ఐరన్ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం, సరైన రహదారి లేకపోవడం, అటవీ ప్రాంతం కావడం వల్ల ఆ భూముల్లో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను ఏర్పాటుచేయలేమని అధికారులకు ఆ బృం దం తెగేసిచెప్పింది. తిరుపతి సమీపంలోనే భూములు కేటాయించాలని కోరింది.

    ఇదే అంశాన్ని జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అరుుతే ఆ భూముల్లోనే విద్యా సంస్థలను ఏర్పాటుచేయాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. భూకేటాయింపుల వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే విద్యా సంవత్సరంలో ఐఐటీ తరగతులను తాత్కాలిక భవనాల్లో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కోరింది.

    తిరుపతిలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలోనూ.. చిత్తూరు సమీపంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలోనూ ఖాళీగా ఉన్న భవనాల్లో తరగతులు నిర్వహించాలని ప్రతిపాదించింది. తరగతుల ప్రారంభంపై స్పష్టత ఇవ్వని కేంద్రం.. ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ల ఏర్పాటుకు శాశ్వత భవనాల నిర్మాణానికి భూకేటాయింపులు సంతృప్తికరంగా ఉండేలా చూడాలని మరోసారి కోరింది. ఐఐటీ ఏర్పాటుకు 2014-15 బడ్జెట్లో రూ.వంద కోట్లు కేటాయించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

    ఓ మంత్రి, టీడీపీ ఎంపీల రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊతం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం  జాతీయ విద్యాసంస్థల ఏర్పాటును జాప్యం చేస్తోందని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మానవవనరులశాఖ ప్రతిపాదన మేరకు రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపులు చేస్తే.. వచ్చే విద్యా సంవత్సరంలో తిరుపతిలో ఎస్వీ వర్సిటీలో ఖాళీగా ఉన్న భవనాల్లో తాత్కాలికంగా ఐఐటీ తరగతులు ప్రారంభించే అవకాశం ఉంటుందని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి.
     

మరిన్ని వార్తలు