భారమైపోయానని బాధిస్తున్నారు..!

25 Apr, 2017 12:03 IST|Sakshi
భారమైపోయానని బాధిస్తున్నారు..!

► కొడుకు, కోడలు హింసకు గురి చేస్తున్నారంటూ వృద్ధురాలి ఆవేదన
► న్యాయం కోసం ఆర్డీఓ కార్యాలయం వద్ద పడిగాపులు

టెక్కలి : ఇంట్లో భారంగా ఉన్నానని కొడుకు, కోడలు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తన పేరుపై ఉన్న పంట పొలాల్ని కాజేసేందుకు నిత్యం హింసిస్తున్నారని సంతబొమ్మాళి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఇచ్ఛాపురం ఆదిలక్ష్మి అనే వృద్ధురాలు భోరున విలపించింది. తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయం అధికారులను ఆశ్రయించింది. నలుగురు కుమార్తెలకు వివాహాలు చేశానని, చివరగా ఒక్కగానొక్క కుమారుడు కుర్మయ్య తనను చేరదీస్తాడనుకుంటే భార్య కృష్ణమ్మతో కలిసి తనను నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నాడని వాపోయింది.

తన పేరు మీద సుమారు 2 ఎకరాల పంట పొలం ఉందని, అది ఇవ్వాలంటూ వేధిస్తూ కనీసం తిండి కూడా పెట్టడం లేదని కన్నీరుమున్నీరుగా విలపించింది. గ్రామంలో చేరదీసిన వారి వద్ద తలదాచుకుంటూ కాలం గడుపుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అధికారులు న్యాయం చేయాలని విన్నవించింది.

మరిన్ని వార్తలు