ఆస్తి కోసం ఇబ్బంది పెడుతున్నారు

10 Jul, 2018 12:04 IST|Sakshi
ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి తమ సమస్య చెప్పుకుంటున్న వృద్ధ దంపతులు

న్యాయం చేయండి

ఎస్పీని ఆశ్రయించిన వృద్ధ దంపతులు  

కర్నూలు: కష్టపడి సంపాదించిన ఆస్తులన్నింటినీ ఇద్దరు కుమారులకు సమానంగా పంచి ఇచ్చాం. ఉన్న ఇంటిని కూడా పంచాలని పెద్ద కుమారుడు రామలింగం తీవ్రంగా కొట్టాడని గోనెగండ్ల మండలం హెచ్‌.కైరవాడి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఈరమ్మ, చిన్న ఈరన్న ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో ఎస్పీ  ప్రజాదర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9121101200 సెల్‌ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. నేరుగా వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రామలింగం తీవ్రంగా కొట్టడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వారు వాపోయారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 56 ఫిర్యాదులు వచ్చాయి.

ఫిర్యాదుల్లో కొన్ని...  
పుసులూరు గ్రామానికి చెందిన ఎర్రగొండ సుబ్బరామయ్య తన రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని కౌలు సొమ్ము ఇవ్వకుండా ఇబ్బంది పెడున్నాడని నంద్యాల మండలం బాపనపల్లెకు చెందిన వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. కౌలు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.  
ఎన్‌ఐసీటీ కంపెనీ మెయిన్‌ బ్రాంచ్‌ బెంగుళూరులో ఉందని, సీఎస్పీ ఏజెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.75 వేలు వారి ఖాతాలో కట్టించుకుని మొబైల్‌ స్విచాఫ్‌ చేసి మోసగించారని గోనెగండ్లకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.  
భర్త కృష్ణమూర్తి రెండు నెలల నుంచి కనిపించడం లేదని, ఆయన ఆచూకీ తెలిపి కాపురాన్ని చక్కదిద్దాలని దేవనకొండ మండలం సింగపురం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మ వేడుకున్నారు. నాలుగేళ్ల క్రితం పెళ్లి అయ్యిందని, నాటి అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాదర్బార్, డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులన్నింటిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్‌ ఎస్పీ షేక్షావలి, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటాద్రి, హుసేన్‌పీరా, సీఐ ములకన్న తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు