‘ఇంటికెళ్తే కోడలు చంపేస్తుంది’

7 Aug, 2018 13:19 IST|Sakshi
తెలిసిన మహిళ సాయంతో ‘మీకోసం’కు వస్తున్న నల్లమోతు ధనలక్ష్మి

ఆర్డీవోతో మొరపెట్టుకున్న వృద్ధురాలు

బిడ్డల ఘాతుకాలపై మరో ముగ్గురి ఫిర్యాదు

ఆస్తి కోసం నా కోడలు వేధిస్తోంది. ఇప్పటికి ఐదుసార్లు కొట్టింది. ఇంటికెళ్తే చంపేస్తుందన్న భయంతో పొరుగింటిలో తలదాచుకున్నా. కోడలు, మనవడి దాడిలో గాయపడి తెనాలి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందిన వృద్ధురాలు ధనలక్ష్మి సోమవారం జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఆర్డీఓ ఎం.శ్రీనివాసరావు ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నారు.

గుంటూరు, తెనాలి:‘‘ఆస్తికోసం కోడలి అఘాయిత్యాన్ని భరించలేకపోతున్నా...ఇప్పటికి అయిదుసార్లు కొట్టింది...ఇంటికెళితే చంపేస్తుందని భయపడి, పొరుగింటిలో తలదాచుకున్నా...నా ఇంటినుంచి అందరినీ పంపించేస్తే, నా బతుకు నేను బతుకుతాను’’...అంటూ రూరల్‌ తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామానికి చెందిన నాగమోతు ధనలక్ష్మి తెనాలి ఆర్డీవో ఎం.శ్రీనివాసరావును కలిసి మొరపెట్టుకుంది. తెలిసిన మహిళల సాయంతో సోమవారం ఆర్డీవో కార్యాలయానికి వచ్చిన ఆమె ‘మీకోసం’ సమావేశంలో ఆర్డీవోను కలిసింది. కోడలు, మనుమడు కొట్టటంతో గాయపడి, తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందిన ఆమె అక్కడ్నుంచే ఆర్డీవోకు అర్జీని పంపారు.

స్వయంగా తన గోడును వినిపించేందుకు ‘మీకోసం’కు వచ్చారు. కోడలు తనపై ఇప్పటికి అయిదుసార్లు చేయిచేసుకుందని ఆర్డీవోకు చెప్పారు. తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందినట్టు చెప్పారు. ఇంటికి వెళితే కోడలు తనను చంపేస్తుందని భయంగా ఉందని ధనలక్ష్మి వాపోయింది. తన ఇంటినుంచి వారిని బయటకు పంపితే, పనిమనిషిని పెట్టుకుని తన బతుకు తాను బతకగలనని, విచారించి న్యాయం చేయాలని కోరారు. ఆర్డీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆమె కుటుంబసభ్యులకు నోటీసులు పంపి, తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

కొడుకులు వెళ్లగొట్టారు
తనను ఇంటినుంచి వెళ్లగొట్టి, కొడుకులు ఇల్లు ఆక్రమించుకున్నారని వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన తాడిబోయిన రామయ్య (71) ‘మీకోసం’లో ఇచ్చిన అర్జీలో ఆరోపించారు.
కూతురు మోసంతో ఆస్తి రాయించుకుందిపొన్నూరుకు చెందిన ఇంటూరి సత్యనారాయణరావు ఇచ్చిన అర్జీలో తన కుమార్తె మోసపూరితంగా తనతో ఆస్తిని రాయించుకుందని ఆరోపించారు. తెనాలి పట్టణానికి చెందిన గుంటూరు జకరయ్య కూడా తనను బిడ్డలు ఇంటినుంచి గెంటేశారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు