‘మున్సిపల్’ నగారా

4 Mar, 2014 00:17 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మున్సిపాలిటీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడంతో పట్టణాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలున్నాయి. షెడ్యుల్డ్ ప్రాంతంలో ఉన్న మందమర్రి మున్సిపాలిటీ మినహా మిగిలిన ఆరు మున్సిపాలిటీ లు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, భైంసాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎలక్షన్ కమిషన్  ఏర్పాట్లు చేస్తోంది. స్థానాల రిజర్వేషన్లను శనివారం ప్రకటించడంతో ఈనెలాఖరులోపే ఎన్నికల తంతు ముగించేందుకు చర్యలు చేపట్టింది.

 ఇందులో భాగంగానే వార్డులవారీగా ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. ఈనెల14లోపు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. నామినేషన్లు ముగుస్తుండటంతో ఆయా పార్టీలో ఒక్కసారిగా టిక్కెట్ల గోల మొదలైంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 18లోపు గడువు ముగుస్తుంది. దీంతో పక్షం రోజుల్లో బరిలో నిలిచేవారెవరో స్పష్టంగా తేలిపోనుంది. మార్చి 30న పోలింగ్ ఉండటంతో అభ్యర్థుల ప్రచారానికి కేవలం పది రోజులే మిగులుతుంది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగిన పక్షంలో ఏప్రిల్ 1న రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఫిబ్రవరి 2న కౌటింగ్ నిర్వహించాలని నిర్ణయించడంతో ఆ రోజే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

ఈ ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు ఆ తర్వాత చైర్మన్లను, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో ఆరు మున్సిపాలిటీల పరిధిలో 3.56 లక్షల మంది పట్టణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 95,372 మంది ఓటర్లున్నారు.

 మంచిర్యాలలో 73,985, నిర్మల్‌లో 67,576, కాగజ్‌నగర్‌లో 44,104, బెల్లంపల్లిలో 41,258, భైంసాలో 34,048 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికలు జరిగే మున్సిపల్ పట్టణాల్లో మాత్రమే కోడ్ అమలులో ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

 నాలుగేళ్ల  తర్వాత పాలకవర్గం
 ఆయా మున్సిపాలిటీల గత పాలక వర్గం పదవీకాలం 2010 సెప్టెంబర్‌తో ముగిసింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సాహసించలేదు. దాదాపు నాలుగేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనతో నెట్టుకొచ్చింది. ఎట్టకేలకు కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ లభించడంతో బల్దియాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం మీద మార్చి మొదటి వారంలో ఈ మున్సిపాలిటీలకు కొత్త పాలకవర్గం కొలువుదీరనుంది.

మరిన్ని వార్తలు