Telangana: రాష్ట్ర ఓటర్లు  3,17,17,389

5 Oct, 2023 03:38 IST|Sakshi

కొత్త ఓటర్లు17,01,087మంది

6,10,694 మంది ఓటర్ల తొలగింపు

18–19 ఏళ్ల యువఓటర్లు 8,11,640 మంది

119 అసెంబ్లీ నియోజకవర్గాల తుదిఓటర్ల జాబితా విడుదల..  పూర్తి వివరాలు వెల్లడించిన సీఈఓ వికాస్‌రాజ్‌

పురుషులు 1,58,71,493 మంది 

మహిళలు 1,58,43,339 మంది

ట్రాన్స్‌జెండర్లు  2557 మంది

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389 కాగా, ఇందులో 1,58,71,493మంది పురుషులు, 1,58,43,339మంది మహిళలు, 2557 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలతుదిఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌ బుధవారం ప్రకటించారు.

2023 జనవరితో పోల్చితే తుది ఓటర్ల జాబితాలో మొత్తం 5.8 శాతం ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలో 15,338 మంది సర్వీసు ఓటర్లు, 2780 మంది ప్రవాస ఓటర్లున్నారు. 18–19 ఏళ్ల వయసు గల 5,32,990 మంది యువఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. దీంతో 18–19 ఏళ్ల వయస్సు గల ఓటర్ల సంఖ్య 8,11,640కి చేరింది. దీంతో జాబితాలో యువ ఓటర్ల శాతం 2.56 శాతానికి పెరిగింది. 

కొత్త ఓటర్లు 17,01,087 మంది
ఓటర్ల జాబితా రెండో సవరణలో చివరి గడువు సెప్టెంబర్‌ 19 నాటికి  57,617 దరఖాస్తులను పరిష్కరించామని, త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించామని సీఈఓ వికాస్‌రాజ్‌ ప్రకటించారు. కొత్తగా 17,01,087 మంది ఓటర్లు జాబితాలో చోటు పొందగా, 6,10,694 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. 5,80,208 మంది ఓటర్లు పేరు, ఇతర వివరాలు సరిదిద్దుకోవడం లేదా కొత్త చిరునామాకు ఓటు బదిలీ చేసుకున్నారు.

స్త్రీ, పురుష ఓటర్ల మధ్య లింగ నిష్పత్తి 992 నుంచి 998కి మెరుగు పడిందని సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు. 18–19 ఏళ్ల వయసు గల ఓటర్ల మధ్య లింగ నిష్పత్తి 707 నుంచి 743కి మెరుగైందన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 43,943కి, దివ్యాంగ ఓటర్ల సంఖ్య 5,06,493కి, థర్డ్‌జెండర్‌ ఓటర్ల సంఖ్య 2557కి పెరిగిందన్నారు.  

ఓటర్ల నమోదుకుఇంకా అవకాశం 
కొత్త ఓటర్ల నమోదు నిరంతరంగా కొనసాగుతుందని, 2023 అక్టోబర్‌ 1తో 18 ఏళ్లు నిండిన వారు, గతంలో దరఖాస్తు చేసుకోనివారు దరఖాస్తు చేసుకోవచ్చని సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకుంటే, అర్హులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పిస్తామన్నారు.

https://voters.eci.gov.in/  వెబ్‌సైట్‌/ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌/బీఎల్‌ఓ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, తమ పోలింగ్‌స్టేషన్, పేరు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉంటే ఫారం–8 దరఖాస్తు ఆన్‌లైన్‌/ యాప్‌/బీఎల్‌ఓ ద్వారా సమర్పించాలని సూచించారు. ఏమైనా ఫిర్యాదులుంటే ఓటరు హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1950కి సంప్రదించాలన్నారు. 

4లక్షల ఓటర్ల చిరునామాలు మార్పు 
ఒకే ఇంట్లో 6 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే స్వయంగా ఇళ్లకు వెళ్లి ఓటర్లను ధ్రువీకరించే కసరత్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4,15,824 మంది ఓటర్ల చిరునామాలు సవరించారు. 3,94,968 మంది ఓటర్లను ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్‌ కేంద్రం నుంచి మరో కేంద్రానికి, 64,661 మంది ఓటర్లను ఒక అసెంబ్లీ స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ చేశారు. ఈఆర్వో నెట్‌ ద్వారా 73,364 మంది ఓటర్ల చిరునామాలు, ఇళ్ల నంబర్లు సవరించారు. 4605 బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో 757 బృందాలు తనిఖీ చేసి కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణకు  50,907 దరఖాస్తులు స్వీకరించి వారికి ఓటుహక్కు కల్పించాయి. 

రెండేళ్లలో 22 లక్షల ఓటర్ల తొలగింపు
ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా గత రెండేళ్లలో 22,02,168 మంది చనిపోయిన, డూప్లికేట్, వలస పోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఇందులో 4,89,574 మంది ఓటర్లు జీహె< చ్‌ఎంసీ పరిధిలోని వారే. ఈ ఏడాది 2,47,756 మంది చనిపోయిన ఓటర్లను తొలగించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు తీవ్రంగా శ్రమించామని, 14,24,694 ఓటర్ల వివరాలను సవరించామని సీఈఓ తెలిపారు. 

అప్పుడు ఓటర్లు ఇలా...
 గత ఆగస్టు 21న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్‌ జెండర్లు మొత్తం కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,06,42,333 ఓటర్లు ఉన్నారు. మరో 2,742 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు, 15,337 మంది సర్వీసు ఓటర్లు ముసాయిదాలో ఉన్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. 

ఓటర్ల జాబితా తొలి ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, రెండో సవరణ నాటికి 3,17,32,727 మందికి పెరిగారు.  

మరిన్ని వార్తలు