పట్టాలివ్వని హామీలు | Sakshi
Sakshi News home page

పట్టాలివ్వని హామీలు

Published Tue, Mar 4 2014 12:15 AM

Assurances to lands

 అటవీ భూముల డీనోటిఫై మాటే మరచిన ఎమ్మెల్యే కాండ్రు కమల
 గుర్రుమంటున్న తాడేపల్లి కృష్ణనగర్ కాలనీ వాసులు
 ప్రకాశం బ్యారేజి పటిష్టత విషయంలోనూ ఉదాశీనత
 
 గత ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాండ్రు కమల వాటిని నెరవేర్చకపోవడంతో అవే శాపంగా మారాయి. అటవీ భూముల్లో నివాసముంటున్న పేదలకు ఆ భూమిని డీనోటిఫై చేయించి పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్ల కాలంలో పట్టాలు ఇవ్వలేకపోవడంతో కృష్ణనగర్ కాలనీ వాసులు ఆమెపై గుర్రుగా ఉన్నారు.
 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు
 మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల... తొలిసారిగా శాసన సభకు గెలుపొంది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు మెంబరుగా కూడా నియమితులయ్యారు. ఇసుక రీచ్‌ల టెండర్లు, ఇసుక అమ్మకాలు అన్నీ ఆమె కనుసన్నల్లోనే జరిగాయనే విమర్శలు లేకపోలేదు.
 
  పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులకు సాగునీటిని అందిస్తున్న ప్రకాశం బ్యారేజి పటిష్టతకు ముప్పు కలిగించే విధంగా ఇసుక తవ్వకాలు జరిగినా ఉదాశీనంగా వ్యవహరించారు. శాసస సభ్యురాలిగా ప్రజా సమస్యల పరిష్కారంతోపాటు ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఉన్నప్పటికీ ఆమె మిన్నకుండి పోయారు. లీజుల పేరుతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో వందలాది ఎకరాల్లో అక్రమ సాగు జరుగుతున్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లలేదు. శిధిలావస్థకు చేరిన ఇరిగేషన్ వంతెనలపై నిబంధనలకు విరుద్ధంగా పది టైర్ల లారీలు ఇసుకను తరలించినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆమె ఎప్పుడూ ప్రశ్నించలేదు. వీటిన్నిటి కంటే తన ఐదేళ్ల  పదవీ కాలంలో మునిసిపాల్టీలోని చిన్న చిన్న పనులు, పోలీసు శాఖ అధికారుల బదిలీలు ఆమె సూచన మేరకు జరిగాయనే ఆరోపణలు లేకపోలేదు. అయితే ఎమ్మెల్యేగా కృష్ణనగర్ ప్రజలకు ఏమీ చేయలేకపోయారు. హామీలు మాత్రం ఘనంగా ఇచ్చి వారిని మభ్యపెట్టే యత్నం చేశారు.
 
 అటవీ భూముల్లో నివాసం
     తాడేపల్లి మునిసిపల్ పరిధిలోని కృష్ణనగర్ ప్రాంతంలో అటవీ భూములను ఆక్రమించు కుని సుమారు రెండు వేల కుటుంబాలు నివాసం వుంటున్నాయి.
 
     వీరిని అటవీ శాఖ సిబ్బంది వేధిస్తుండేవారు.
     వీరంతా రెక్కాడితేగాని, డొక్కాడని కూలీలు.
     అటవీ శాఖ అధికారులు గతంలో రెండు సార్లు దాడులు చేసి ఇళ్లను నేలమట్టం చేశారు. - దాంతో పేదలంతా ఒక్కటై ఉద్యమించారు.
 
     ఈ క్రమంలో అప్పటి కలెక్టర్ రామాంజనేయులు చొరవ తీసుకుని అటవీ భూముల్లో నివసిస్తున్న వారి వివరాలు రెవెన్యూ శాఖ వారిచే సర్వే చేయించారు. ఆ సర్వే ప్రకారం 1870 ఇళ్లను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఇకపై కొత్తగా ఆక్రమణలకు పాల్పడితే సహించబోమని, సర్వే ప్రకారం అప్పటికి గుర్తించిన వారికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపుతామని వాగ్దానం చేశారు.
 
     అటవీ భూమి ఆక్రమించుకున్నవారికి డీఫారెస్టు భూములుగా నోటిఫై చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆమె పదవీ కాలం పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీ నెరవేరలేదు.
 
     ఆ తరువాత వచ్చిన కలెక్టర్ కూడా పట్టించుకోలేదు.
     ఆ రెండు వేల కుటుంబాల్లో బ్రహ్మానందపురంలోనే 500 కుటుంబాలు 30 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మిగిలిన వారు 15 సంవత్సరాలకు పైబడి ఉంటున్నారు.
 
     పట్టాల సంగతి అటుంచితే ఆ రెండు వేల కుంటుంబాలకు మౌలిక వసతులు కల్పించలేదు.  దీంతో మునిసిపల్ అధికారుల అంగీకారంతో పేదలు చందాలు వేసుకుని నాలుగు తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసుకుంటే ఎమ్మెల్యే తొలగించమన్నారంటూ మునిసిపల్ సిబ్బంది తాగునీటి పైపులను డమ్మీలు చేయడం ఓ సారి వివాదాస్పదమైంది.
 
     {పత్యామ్నాయం చూపకపోవడం మౌలిక వసతులు కల్పించలేకపోవడంతో ఎమ్మెల్యేపైనా, కాంగ్రెస్ పార్టీ పైనా అక్కడి ప్రజలు గుర్రుగా ఉన్నారు.
 
 తహశీల్దారు వివరణ...
 ఈ విషయమై తాడేపల్లి తహశీల్దారు డి.రామకృష్ణను ‘సాక్షి ప్రతినిధి’ వివరణ కోరగా, కృష్ణనగర్ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వలేదని చెప్పారు. అటవీభూమిని డీనోటిఫై చేశారా అని ప్రశ్నించగా, తాను ఇటీవలనే ఇక్కడకు బదిలీపై వచ్చానని, సర్వేయరు అందుబాటులో లేకపోవడం వల్ల ఆ వివరాలు చెప్పలేకపోతున్నానన్నారు. అయితే కృష్ణనగర్ కాలనీ వాసులకు పట్టాలు మాత్రం ఇవ్వలేదని స్పష్టం చేశారు.
 
 

Advertisement
Advertisement