ఏనుగుల విధ్వంసకాండ

13 Feb, 2020 11:46 IST|Sakshi
స్టార్టర్‌ను ధ్వంసం చేసిన ఏనుగులు

గుడిసెలు ధ్వంసం, రైతులపై దాడి ప్రాణభయంతో పరుగులు

బంగారుపాళెం/చంద్రగిరి/గుడిపాల : జిల్లాలో ఏనుగులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. పంట పొలాలపై వరుస దాడులు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. బంగారుపాళెం మండలం కీరమంద గ్రామంలో మంగళవారం రాత్రి పంట పొలాలపై ఏనుగులు విధ్వంసకాండ సృష్టించాయి. పూలదడి వంక సమీపంలో గల అటవీ ప్రాంతం నుంచి రెండు ఏనుగులు మహిళా రైతు కొండమ్మ పొలంలోకి ప్రవేశించి, బోరుపైపు, స్టార్టర్‌ను ధ్వంసం చేశా యి. విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు నరేష్, గ్రామానికి చెందిన రైతులు బాల, మునిరత్నం రాత్రి 3 గంటలకు మోటారు బైక్‌పై అక్కడికి వెళ్లారు. మనుషుల రాకను గుర్తించిన ఏనుగులు వారిపై దాడికి దిగాయి. భయాందోళనకు గురైన నరేష్, బాల మునిరత్నం గ్రామంలోకి పరుగులు తీశారు.

ఈ క్రమంలో నరేష్‌ కిందపడడంతో దెబ్బలు తగిలాయి. మోటారు సైకిల్‌ను ఏనుగులు తొండంతో విసిరివేయడంతో పక్కనే ఉన్న నీళ్లు లేని బావిలో పడింది. అక్కడి నుంచి దేవరగుట్టకు వెళ్లిన ఏనుగులు శ్రీనివాసులుకు చెందిన గుడిసెను ధ్వంసం చేశాయి.  ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. తర్వాత నాగరాజ గుడిసె వైపునకు వెళ్లి పాడి ఆవులపై దాడి చేశాయి. ఆవుల అరుపులు విని నాగరాజ భార్య దేవమ్మ బయటకు వచ్చింది. ఏనుగులు చేసి ఆమె భయంతో వణికిపోయింది. పశువులు కట్లు తెంపుకుని పొలాల వైపు పరుగులు తీయ డంతో వాటి వెనుకే ఏనుగులు వెళ్లిపోయాయని దేవమ్మ పేర్కొంది. వారం రోజులుగా ఏనుగులు మండలంలోని పాలమాకులపల్లె, శేషాపురం గ్రామాల్లో పంటలను ధ్వంసం చేస్తున్నట్లు రైతులు తెలిపారు.

గుడిపాలలో 10 ఎకరాల్లో పంట నష్టం
గుడిపాల మండలంలో మంగళవారం రాత్రి ఏనుగులు పంట పొలాలపై దాడి చేశాయి. అరటి తోట మూడు ఎకరాలు, చెరుకు పంట ఎకరా, పచ్చిగడ్డి ఎకరా, వరి పంట రెండు ఎకరాలు, మామిడి చెట్లు 40 దాకా దెబ్బతిన్నా యి. ఉలవపంటనూ నాశనం చేశాయి. ముత్తువాళ్లూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌నాయుడు అరటితోటలో 300 చెట్లను ధ్వంసం చేశాయి. వీసీ ఖండిగ గ్రామానికి చెందిన కోకిల అనే మహిళా రైతుకు చెందిన 50 సెంట్ల భూమిలో చెరుకు పంట ధ్వంసమైంది. బట్టువాళ్లూరు గ్రామంలో కమలాకర్‌ అనే రైతుకు చెందిన రెండు ఎకరాల వరిపంటను పూర్తిగా ధ్వంసం చేశాయి.

రెండు గుంపులుగా విడిపోయిన ఏనుగులు
గుడిపాల మండలంలోని వెప్పాలమానుచేను, చిత్తపార అటవీ ప్రాంతంలో 14 ఏను గులు సంచరిస్తున్నాయని, మంగళవారం రాత్రి రెండుగా విడిపోవడంతో పంటలన్నింటినీ చాలావరకు ధ్వంసం చేశాయని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి పంటలను కాపాడాలని కోరుతున్నారు.  

కట్టడి చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం
నమస్కారం సార్‌... మాది శ్రీనివాసమంగాపురం. నేను ఏ.రంగంపేట సమీపంలో రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాను. రూ.60వేలు ఖర్చుపెట్టి ఎకరాలో వరి పంట వేశాను. ఏనుగులు వచ్చి పంటను నాశనం చేశాయి. రేయి కావిలి కాస్తా ఉంటే కూడా ఏనుగులు వస్తా ఉండాయి. అదే పనిగా ఫారెస్టు ఆఫీసు కాడికి పోయి వాళ్లకు చెప్పినా వాళ్లు తిరిగి మళ్లి కూడా చూడలేదు సార్‌. దయచేసి మాకు ఏదైనా నష్ట పరిహారం ఇవ్వండి సార్‌.. నేనేదో కూలి చేసుకునే వాడిని.. దయచేసి జీవాలను కట్టడి చేయండి సార్‌.. లేకుంటే నేను సచ్చిపోతా..మడికాడే ఉరేసుకుని సచ్చిపోతాను సార్‌.. అంటూ ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన కౌలు రైతు కన్నయ్య తన ఆవేదనను సోషల్‌ మీడియా ద్వారా వెళ్లగక్కాడు. 

మరిన్ని వార్తలు