ఏనుగుల బీభత్సం

17 Jul, 2018 08:17 IST|Sakshi
ధ్వంసమైన మోటారు, స్టార్టర్, డ్రిప్‌ పరికరాలు, చెరుకు తోట, నారుమడి

బోరు మోటార్లు, పంటలపై దాడులు

రైతులకు లక్షలాది రూపాయల నష్టం

పలమనేరు : గంగవరం మండలంలోని కీలపట్ల, కొత్తపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతుల వ్యవసాయ బోర్లు, స్టార్టర్లు, డ్రిప్‌ పరికరాలు, పంటలను ఆదివారం రాత్రి ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. కీలపట్ల, కొత్తపల్లి గ్రామాల సమీపంలోని అడవిలోంచి మూడు ఏనుగులు పంటలపై పడ్డాయి. గోవిందప్ప, రాధమ్మ, రాజేంద్రకు చెందిన బోరు మోటారు, పైపులు, స్టార్టర్లను ధ్వంసం చేశాయి. రాజేంద్ర, వెంకటరమణారెడ్డికి చెందిన చెరుకు, టమాట, బీన్సు, వరినారు తొక్కేశాయి. ఏనుగుల దాడులతో మూడు లక్షలు రూపాయల దాకా నష్టం జరిగిందని బాధిత రైతులు చెబుతున్నారు.

ట్రెంచ్‌ లేని దారిలోనే ....
ఏనుగులు అడవిని దాటకుండా అధికారులు ట్రెంచ్‌లను తవ్వించారు. కానీ కేసీపెంట వద్ద కొందరు రైతులు ట్రెంచ్‌ నిర్మాణాలను అడ్డుకున్నారు. ఫలితంగా కొంతమేర ఈ పనులు ఆగాయి. అదే చోటు నుంచి మూడు రోజులుగా ఏనుగులు పొలాల్లోకి వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది, వీఆర్వోలు పంటలను పరిశీలించి నష్టం అంచనాలను తయారు చేశారు. త్వరగా ట్రెంచ్‌ పనులను పూర్తిచేసి ఏనుగుల బెడద నుంచి పంటలు కాపాడాలని బాధిత రైతులు కోరుతున్నారు.

ఒంటరి ఏనుగు దాడి
పెద్దపంజాణి: మండలంలోని కొలత్తూరు పం చాయతీ మద్దలకుంట గ్రామ సమీపంలోని పంట పొలాలపై ఒంటరి ఏనుగు ఆదివారం రాత్రి దాడి చేసింది. రాయలపేటకు చెందిన రెడ్డెప్ప మామిడి, టమాట పంటలకు స్వల్పంగా నష్టం చేకూర్చింది. మద్దలకుంట గ్రామానికి చెందిన గంగులప్పకు సంబంధించిన నారుమడిని తొక్కి నాశనం చేసింది. బాధిత రైతుల సమాచారంతో ఫారెస్టు బీట్‌ ఆఫీసర్‌ దొరస్వామి, వీఆర్‌ఓ సుబ్రమణ్యం ఆచారి సోమవారం పొలాలను పరిశీలీంచారు. ఏనుగు కోగిలేరు అటవీ ప్రాంతం నుంచి వచ్చి మద్దలకుంట, నాగిరెడ్డిపల్లి మీదుగా తూర్పు అడవిలోకి వెళ్లిందని అటవీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు