సర్కారు బడుల్లో ఆంగ్ల సవ్వడి

26 Apr, 2018 11:14 IST|Sakshi

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం

మొదటి విడతలో 187 స్కూల్స్‌కు అనుమతి మంజూరు

తెలుగు మీడియంకు సమాంతరంగా ఆంగ్లమాధ్యమం

కడప ఎడ్యుకేషన్‌/బద్వేలు : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే మున్సిపల్‌ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియంలో విద్యాబోధన జరుగుతోంది. తాజాగా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం తీసుకురానుంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు  ప్రైవేటు పాఠశా ల వైపు  పరుగులు తీయడానికి ప్రధాన కారణం ఇంగ్లిష్‌ మీడియమే. దీన్ని దృష్టిలో ఉంచుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టనుంది.

జిల్లాలో మొదటి విడత కింద 187 పాఠశాలల్లో: జిల్లాలో 2542 ప్రాథమిక, 271 ప్రాథమి కోన్నత, 393 ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. ఇందులో 2018–19కి సంబంధించి మొదటి విడత కింద 187 పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమానికి ప్రభుత్వం అనుమతుల ను ఇచ్చింది. ఇందులో 184 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలతోపాటు మరో 3 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సం బంధిత పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్స రం నుంచి తెలుగుమీడియానికి సమాతంరంగా ఆంగ్ల మాధ్యమాన్ని బోధించనున్నారు. జిల్లాలోని 186 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు, 776 ప్రాథమిక పాఠశాలలు, 22 ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఆంగ్ల మాధ్య మం ప్రవేశ పెట్టాలని పాఠశాల విద్యాశాఖకు దరఖాస్తులు అందాయి. ఇందులో మొదటి విడత కింద 187 ప్రాథమిక పాఠశాలలకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

ఉపాధ్యాయులు ఎలా?
ఇప్పటికే జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమానికి ఎంపిక చేసిన పాఠశాలల్లో కూడా దాదాపు 100 వరకు ఖాళీలు ఉన్నాయి. ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధించడమే కష్టం. ప్రస్తుతం ఆంగ్లమాధ్యమంటే మరో తరగతి అదనంగా వచ్చినట్లే. ఉన్న ఉపాధ్యాయలు బోధిండచమంటే కష్టమే. ఉపాధ్యాయులను భర్తీ చేయకుండా ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడితే ఎలా అని విద్యావేత్తలు, పాఠశాలల హెచ్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆంగ్లమాధ్యమం ప్రారంభమవుతున్న కొన్ని పాఠశాలల్లో రెండు గదులు మాత్రమే ఉన్నాయి. అదనపు తరగతి గదులు కొన్ని చోట్ల నిర్మిస్తున్నా అవి నత్తనడకన సాగుతున్నాయి. ఈ సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది.

ఒకటో తరగతి నుంచే..
2018–19 విద్యా సంవత్సరం నుంచి అనుమతించిన 187 పాఠశాలల్లో తెలుగు మీడియంకు సమాంతరంగా ఒకటో తరగతి నుంచే ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఆంగ్లమాధ్యమంలో విద్యను అందించే దిశలో భాగంగా పుస్తకాల ముద్రణ కూడా జరుగుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి ఆంగ్లమాధ్యమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.   –  పొన్నతోట శైలజ, జిల్లావిద్యాశాఖాధికారి

మరిన్ని వార్తలు