నిరుప్రయోగం

2 Jul, 2014 04:47 IST|Sakshi

కర్నూలు(విద్య): జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రాథమికోన్నత, 25 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మున్సిపాలిటీలో 11 ప్రాథమికోన్నత, 16 ఉన్నత పాఠశాలలున్నాయి. అలాగే 335 జిల్లా పరిషత్ , 25 ఎయిడెడ్ ప్రాథమికోన్నత, 45 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇవిగాక 32 మోడల్ స్కూళ్లు, 54 కస్తూరిబాగాంధీ పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను అందించేందుకు విధిగా ప్రయోగశాలలు నిర్వహించాలి.

పాఠశాల నిర్వహణకు విడుదలయ్యే స్కూల్‌గ్రాంట్ నిధుల నుంచి వీటికి అవసరమైన పరికరాలను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే అధిక శాతం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. వారానికి నాలుగుసార్లు చొప్పున 8, 9, 10వ తరగతి విద్యార్థులకు రసాయన, జీవశాస్త్రాల్లో ప్రయోగ పాఠాలు చెప్పాలి. అయితే జిల్లాలో 450 పాఠశాలల్లో ప్రయోగశాలలకు గదుల్లేవు. ఈ కారణంగా ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా కొనుగోలు చేసిన పరికరాలను వారు బీరువాల్లోనే ఉంచేశారు. గత యేడాది 150 పాఠశాలల్లో గదులు నిర్మించినా వాటిని విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు ఉపయోగించుకుంటున్నారు. రెగ్యులర్‌గా ప్రయోగశాలల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం, మరోవైపు ఉపాధ్యాయుల నిరాసక్తత కారణంగా విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య దూరమవుతోంది.

అధిక శాతం పాఠశాలల్లో ఉపాధ్యాయులు చార్ట్‌లలో చిత్రాలు గీసి పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. చాలా పాఠశాలల్లో మైక్రోస్కోప్‌లు, స్ప్రింగ్ త్రాసులు పనిచేయడం లేదు. ఇప్పటికీ జిల్లాలోని 95 శాతం పాఠశాలల్లో ప్రయోగశాలల దుమ్ముకూడా దులపడం లేదు. ఎక్కడికక్కడ పరికరాలు బీరువాల్లో మూలుగుతున్నాయి. బట్టీకొట్టే చదువుకంటే స్వతహాగా ప్రయోగాల ద్వారా నేర్చుకునే అంశంపై బాగా గుర్తుంటుందన్న విషయాన్ని ఉపాధ్యాయులు మరుస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.


 పరిశీలన నైపుణ్యం పెరుగుతుంది
 ప్రయోగాలు చేయడం ద్వారా విద్యార్థుల పరిశీలన నైపుణ్యం పెరుగుతుంది. ఒక విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవడానికి, నిర్ధారణకు రావడానికి ప్రయోగాలు ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో సర్దుబాటు గుణం, అవగాహన సామర్ధ్యం పెరుగుతుంది. ఉపాధ్యాయులు చేయడమే గాక విద్యార్థులతో ప్రయోగాలు చేయించినట్లయితే భవిష్యత్‌లో వారు మంచి పరిశోధకులుగా మారే అవకాశం ఉంది.
 - విజయకుమార్, సైన్స్ ఉపాధ్యాయుడు


 ప్రత్యేక గదులుండాలి
 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయోగశాలలు ఉన్నప్పటికీ చాలా చోట్ల నిరుపయోగంగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం సరఫరా చేసిన ల్యాబ్ పరికరాలు చెడిపోయాయి. దీనికితోడు తరగతి గదిలోనే ప్రయోగశాలలు నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా ప్రయోగశాలకు అవసరమైన గదిని నిర్మించాలి. దాని నిర్వహణకు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టును క్రియేట్ చేయాలి. - ఇస్మాయిల్, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి


 ఇకపై ప్రయోగశాలలపై దృష్టిసారిస్తాం
 ఈ ఏడాది నుంచి ప్రయోగశాలల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నాం. ప్రయోగశాల నిర్వహణకు ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా ఒక్కో పాఠశాలకు సైన్స్‌ఫేర్, ల్యాబ్ కెమికల్స్, పరికరాల కొనుగోలుకు రూ.20 వేలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ప్రయోగశాలలు బలోపేతం చేయనున్నాం. మూడో విడతలో భాగంగా ఈ యేడాది మరో 150 పాఠశాలల్లో ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల ద్వారా ప్రయోగశాలలకు ప్రత్యేక గదులు నిర్మించనున్నాం. ఇప్పటికే పూర్తయిన 150 పాఠశాలల్లోని గదుల్లో ప్రయోగశాలలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం.
 - కె. నాగేశ్వరరావు, డీఈవో
 

మరిన్ని వార్తలు