మళ్లీ ఉల్లి లొల్లి

2 Jul, 2014 04:43 IST|Sakshi
మళ్లీ ఉల్లి లొల్లి

- రోజు రోజుకూ ఎగబాకుతున్న ధర
- కేజీ రూ.26 నుంచి రూ.30!

నూజివీడు : ఉల్లిధర ఎగబాకుతోంది.  15రోజుల క్రితం  స్థిరంగా ఉన్న  ఉల్లిధరలు రోజురోజుకు పెరుగుతూపోతున్నాయి. రైతుబజారులో ఉల్లిపాయల ధర సోమవారం రూ.25 నమోదు చేయగా, బహిరంగ మార్కెట్‌లో సైజును బట్టి కిలో రూ.26నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. తోపుడు బండ్ల వారు డిమాండ్‌ను బట్టి అధిక ధరలకు సొమ్ము చేసుకుంటున్నారు.  పదిహేను రోజులుగా కూరగాయల ధరలూ ఆకాశాన్నంటుతుండటంతో వాటినే కొనలేక అవస్థలు పడుతుంటే... ఇప్పుడు ఉల్లిధర పెరగడం ప్రజలను  కలవర పెడుతోంది. ఉల్లిపాయలు మూడు గ్రేడ్‌లలో లభ్యమవుతుండగా, గ్రేడ్-3రకాన్ని తక్కువగా విక్రయించాల్సిన వ్యాపారులు గ్రేడ్-1రకం ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

ఉల్లిపాయలకు ఎక్కువగా కర్నూలు, మహారాష్ట్ర నుంచి ఎగుమతి అవుతాయి. అయితే కర్నూలు ఉల్లిపాయలు ఇంకా రాకపోవడంతో మహారాష్ట్ర దిగుమతులపైనే అందరూ ఆధారపడాల్సి వచ్చింది. జిల్లాలోని 14 రైతుబజారులలో కలిపి రోజుకు 350నుంచి 450క్వింటాళ్ల ఉల్లిపాయలు విక్రయిస్తారు. అలాగే బహిరంగా మార్కెట్‌లో హోల్‌సేల్ వ్యాపారుల నుంచి 2వేల క్వింటాళ్ల వరకు రిటైల్ వ్యాపారులు ఉల్లిని కొనుగోలు చేస్తారు.  

వాడకానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు దిగుమతి కాకపోవడంతో    డిమాండ్- సరఫరా మధ్య అంతరం పెరిగి ఆప్రభావం ఉల్లి ధరలపై పడినట్లు చెబుతున్నారు. సెప్టెంబరు నెల నాటికి ఉల్లికి మంచి ధర లభిస్తుందనే ఉద్దేశంతో అక్కడి ఉల్లిరైతులు గోదాముల్లో నిల్వ ఉంచుతున్నట్లు హోల్‌సేల్ వ్యాపారస్త్తులు పేర్కొంటున్నారు. దీనికి తోడు  ఉల్లికొరతను సొమ్ము చేసుకునేందుకు స్థానిక రిటైల్ వ్యాపారులు   కృత్రిమ కొరత  సృష్టిస్తున్నట్లు  తెలుస్తుంది.   
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా