204 పాఠశాలల్లో ఎర్నెట్‌ డిజిటల్‌ తరగతులు

19 Mar, 2017 17:44 IST|Sakshi

శ్రీకాకుళం : జిల్లాలోని 204 ఉన్నత పాఠశాలల్లో ఎర్నెట్‌ డిజిటల్‌ తరగతులు జరుగుతున్నాయని సర్వశిక్షా అభియాన్‌ పీఓ ఎస్‌.త్రినాథరావు తెలిపారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ 204 పాఠశాలల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, గిరిజనాభివృద్ధితోపాటు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పైలట్‌ ప్రాజెక్టుగా డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాలకొండ డివిజన్‌లో 72, శ్రీకాకుళం డివిజన్‌లో 55, టెక్కలి డివిజన్‌లో మిగిలిన పాఠశాలలు ఉన్నాయని వివరించారు. ప్రతి పాఠశాలకు 10 కంప్యూటర్లు, ప్రింటర్, యూపీఎస్, ప్రొజెక్టర్, కుర్చీలు సరఫరా చేశామని తెలిపారు. 146 ప్రాథమికోన్నత పాఠశాలలను గుర్తించి సర్వశిక్షా అభియాన్‌ ద్వారా కంప్యూటర్‌ ఎయిడెడ్‌ లెర్నింగ్‌ కోసం అవసరమైన సామగ్రిని సమకూర్చినట్లు చెప్పారు. ఫైబర్‌ గ్రిడ్‌ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన వెంటనే దశల వారీగా పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గతంలో బోధనోపకరణాలు, ప్రయోగశాలలు ఉపయోగించి బోధించేవారని, ప్రస్తుత సీసీఈ విధానంలో పై రెండింటితోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.  ఉపాధ్యాయులు లేకపోయినా డిజిటల్‌ తరగతుల ద్వారా విద్యార్థులు అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నారని, సైన్స్‌ ప్రయోగాలను,క్విజ్‌ పోటీలను, పోటీ పరీక్షలను సమర్థంగా ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు