హవ్వా.. ఇదే మి చోద్యం!

5 Aug, 2014 02:40 IST|Sakshi

వేటపాలెం : సామాజిక ఆర్థిక కులగణన ముసాయిదా జాబితా తప్పులు తడకగా ఉంది. ఇంటింటికీ తిరిగి సర్వే చేయాల్సిన ఎన్యుమరేటర్స్ ఒక చోట కూర్చొని ఇష్టం వచ్చింది రాసుకుని చేతులు దులుపుకున్నారు. ఫలితంగా సర్వేలో అవాక్కయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2011-12 సంవత్సరంలో గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల గణన చేశారు. దాని తాలూకా ముసాయిదా జాబితాను ప్రజల పరిశీలనకు ఈ నెల ఒకటో తేదీన మండలంలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో ఉంచారు.

 జాబితాల్లో పొందు పరిచిన కుటుంబ వివరాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. ముసాయిదా జాబితాలో తప్పులు సరి చేసేందుకు 30 రోజుల గడువు విధించారు. సర్వే జాబితాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెల సరి వేతనం రూ.5 వేలలోపేనని నమోదు చేసి పలువురిని ఆశ్చర్యపరిచారు. ప్రతి ఇంటికి రెండు గదులే ఉన్నట్లు రికార్డు చేశారు. ఉద్యోగులను వ్యసాయ కూలీలుగా నమోదు చేశారు.

దాదాపు ఊరంతా వ్యవసాయ కులీలుగా జాబితాల్లో రూపొందించారు. ఉద్యోగులు ప్రాథమిక విద్య మాత్రమే చదివినట్లు ఎన్యుమరేటర్లు తమ సర్వేలో పొందుపరిచి తమ నిర్లక్ష్యాన్ని బహిరంగ పరిచారు. మండలంలోని రామచంద్రాపురంలో మహిళలంతా వితంతువులుగా నమోదు చేశారు. వేటపాలెం 7,8,9 వార్డుల్లోని కుటుంబాల నెలసరి ఆదాయం రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపుగా నమోదు చేశారు. దాదాపు 40 ఎకరాల రైతులకు అసలు సాగుభూమీలేదన్నారు. రూ. లక్షల్లో వ్యాపారం నిర్వహిస్తువారు వ్యవసాయ కులీలుగా మారారు. కోటి రూపాయల విలువైన ఇళ్లు ఉన్న వారికి కేవలం రెండు గదుల ఇళ్లు ఉన్నట్లు చూపారు.

 ఆధారాలు ఇవిగో..
వేటపాలెం 8వ వార్డుకు చెందిన పి.మోహన్‌రావు టెలిఫోన్‌శాఖలో లైన్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. సర్వే జాబితాల్లో ఆయనకు రెండు గదుల ఇల్లు, నెలకు రూ.5 నుంచిరూ.10 వేలలోపు ఆదాయమని, వ్యవసాయ పనులు చేస్తున్నట్లు నమోదు చేశారు.

వేటపాలేనికి చెందిన టి.కోటేశ్వరరావు పోస్టుమాస్టర్. ఇతనికి నెల సరి ఆదాయం రూ.5 వేలులోపుగా జాబితాలో నమోదు చేశారు. ఈయనా వ్యవసాయ కులేనట, రెండు గదుల ఇంట్లో ఉంటున్నట్లు చూపారు.

డీవీఆర్ నాగరాజు ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయుడు. ఈయనకు రెండు గదుల ఇల్లు ఉన్నట్లు రాశారు. వ్యవసాయ కూలి పనులతో జీవనం గడుపుతున్నట్లు నమోదు చేశారు. ఈయన ఆదాయం కూడా రూ.5 వేల లోపేనట. రిఫ్రిజరేటర్ లేదని, సెల్‌ఫోన్ వాడరని చెప్పారు.

పుల్లరిపాలెం పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో మహిళలంతా వితంతువులుగా నమోదు చేశారు.
 ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సర్వే రికార్డులో 80 శాతం తప్పుల తడకలుగా నమోదు చేశారు. ఈ వివరాలతో ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి కైనా సంబంధిత అధికారులు స్పందించి రీసర్వే నిర్వహించి వాస్తవ వివరాలు తెలియజేయాల్సి ఉందని పలువురు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు