ప్రతి పంచాయతీలో 10  మందికి ఉద్యోగాలు

22 Mar, 2019 12:49 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే ఉద్యోగ విప్లవం తెస్తామని జగన్‌ హామీ

గ్రామాల్లో సచివాలయం ఏర్పాటుతో యువతకు ఉద్యోగావకాశాలు

జగన్‌ భరోసాపై నిరుద్యోగుల హర్షం

సాక్షి, పర్చూరు: ఐదేళ్ల టీడీపీ పాలనలో తీవ్ర వర్షాభావం.. గ్రామాల్లో పంటల్లేవు.. పనులూ కరువు.. ఉన్న ఊళ్లో ఉపాధి లేక నిరుద్యోగం పెరిగిపోయింది. ఎన్నో కుటుంబాలకు పూట గడవడమే గగనమైంది. వ్యవసాయం చేయలేక రైతులు, ఉద్యోగాలు భర్తీ లేక నిరుద్యోగ యువత దిక్కుతోచని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా గమనించిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగ విప్లవానికి ప్రణాళిక రచించారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే ప్రతి పంచాయతీలో 10 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రతి పంచాయతీలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి అదే గ్రామానికి చెందిన 10 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. తద్వారా ప్రజా సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.


జిల్లాలోని 1,030 పంచాయతీల్లో 10,300 ఉద్యోగాలు...
జిల్లాలో 1,030 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి పంచాయతీలో 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మొత్తం 10,300 మంది నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుంది. వీరంతా గ్రామ సచివాలయంలో పనిచేయడం ద్వారా ప్రతి చిన్న పనికీ పట్టణాలు, నగరాల్లోని కార్యాలయాలకు స్థానికులు వెళ్లే అవసరం ఉండదు.

ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌...

ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌ను నియమించి వారికి రూ.5 వేలు జీతం ఇస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ఆ 50 ఇళ్లకు ఆ వలంటీర్‌ జవాబుదారీగా ఉంటూ గ్రామ సచివాలయంతో అనుసంధానమై పనిచేస్తారు. రేషన్‌కార్డు, సామాజిక భద్రత పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డు, తదితర పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 3 రోజుల్లోనే వాటిని మంజూరు చేస్తారని జగన్‌ భరోసా ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌ కేలండర్‌ను కూడా ప్రకటించి ఏటా ఆయా తేదీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశంలోనే చట్టం తెస్తామని జగన్‌ ఇచ్చిన హామీపై నిరుద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. 

జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఉన్న పంచాయతీలు, లభించే ఉద్యోగాలు ఇలా... 

నియోజకవర్గం    గ్రామ  పంచాయతీలు  ఉద్యోగ  అవకాశాలు
యర్రగొండపాలెం    84     840
దర్శి    94     940 
పర్చూరు    95    950
అద్దంకి      103    1,030
చీరాల     24    240
సంతనూతలపాడు       85  850
ఒంగోలు       28  280
కందుకూరు     93     930
కొండపి    112     1,120
మార్కాపురం   83     830
గిద్దలూరు      94  940
కనిగిరి     135    1,350

   
జగన్‌ వస్తే నిరుద్యోగ సమస్య తీరుతుంది 
చదువుకుని కూడా ఎలాంటి ఉపాధి లేకుండా ఉండాల్సి వస్తోంది. టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిందేమీలేదు. వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే నిరుద్యోగ సమస్య తీరుతుంది. 10 మంది స్థానికులకు సొంత ఊళ్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది.
ప్రత్తిపాటి మురళి, చినగంజాం

జగన్‌ ముఖ్యమంత్రి కావాలి 
ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా జగన్‌తోనే సాధ్యం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గౌరవంగా బతకవచ్చు. 
వలివేటి కిషోర్, చినగంజాం

నిరుద్యోగుల కల నెరవేరనుంది 
జగన్‌ ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగుల కల నెరవేరుతుంది. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, కూలీలు, చేనేతలు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల ప్రజల పట్ల ఆయనకు పూర్తి అవగాహన ఉంది. నిరుద్యోగులు పడుతున్న కష్టాలు పూర్తిగా ఆయనకు తెలుసు. అందుకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు.
ఆట్ల వంశీ, గ్రాడ్యుయేట్‌

జగనన్న భరోసాపై నమ్మకం ఉంది 
నిరుద్యోగులకు జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇవ్వడంతో ఉద్యోగం వస్తుందనే నమ్మకం నిరుద్యోగుల్లో కలుగుతోంది. నిరుద్యోగులకు టీడీపీ హయాంలో చేసిందేమీ లేదు. 
 కూర్మాల పవన్, బీటెక్‌  

మరిన్ని వార్తలు