అంతా డిజిటల్ పాలనే..!

28 Jul, 2015 01:28 IST|Sakshi

 పత్రాల పాలన కనుమరుగు కానుంది. వివిధ రకాల ధ్రువపత్రాల కోసం కార్యాలయాల చుట్టూ  తిరిగే  ప్రజలు కష్టాలకు ఇక చెక్ పడనుంది. ఏ ధ్రువపత్రం అవసరమైనా ఆధార్ నంబరే ప్రధానం. దానితో ఖాతా తెరిచి కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లెసైన్‌‌స, ఆదాయపన్ను ఖాతా వివరాలు, రేషన్‌కార్డు, ఓటరు కార్డు, పాస్‌పోర్టులతో పాటు భూములకు సంబంధించి సమస్త వివరాలను భద్రపరచుకోవచ్చు. అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు. ధ్రువపత్రాల నంబర్‌ను నమోదు చేసి నేరుగా పొందవచ్చు. డిజిటల్ పాలనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1న శ్రీకారం చుట్టగా, ఏపీ ప్రభుత్వం ఈ నెల 5న ప్రారంభించింది.
 -వీరఘట్టం
 
 డిజిటల్ లాకర్ సదుపాయం
 వ్యక్తిగత నివాస, విద్యార్హత, ఆదాయ పన్ను ఖాతా, రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, కుల, నివాస, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్సు వంటివి తమ అవసరాల కోసం ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాల్సి వస్తోంది. ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఏ ధ్రువీకరణ పత్రాలు అడుగుతారో తెలియక అన్నీ ఫైల్‌లో ఉంచుకొని తిరగాల్సి వస్తోంది. వీటిని పోగొట్టుకుంటే అంతే సంగతులు. మళ్లీ పొందాలంటే కార్యాలయాల చుట్టూ నెలలు తరబడి ప్రదక్షణలు చేయాలి. డిజిటల్ ఇండియా పాలనలో ఈ కష్టాలు ఉండవు. ఈ ధ్రువీకరణ పత్రాలన్నీ ఆన్‌లైన్ లాకర్‌లో భద్రపరుచుకోవచ్చు. కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లాకర్  సదుపాయా న్ని ప్రజల ముగింటల్లోకి తెచ్చాయి. నెట్ సెంటర్లు, మొబైల్ నెట్‌వర్క్‌తో కూడా డిజిటల్ లాకర్‌లో ధ్రువపత్రాలను భద్రంగా దాచుకొని అవసరమైన సమయాల్లో ఆన్‌లైన్‌లో అవసరమైన సంస్థలు, కార్యాలయాలకు పంపుకొనే అవకాశం ఉంటుంది. డిజిటల్ ఇండియాలో దేశంలో 8,73,079 మంది భాగస్వాములు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 62,462 మంది డిజిటల్ లాకర్ సదుపాయం కలిగి ఉన్నారు.
 
 లాకర్ ప్రవేశం ఇలా.....
 ఆధార్‌సంఖ్య, మొబైల్ నంబరు, ఈ-మెయిల్ ఉండాలి. డిజిటల్ లాకర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సైన్ అప్ క్లిక్ చేసి ఆధార్ సంఖ్య నమోదు చేయగానే ఆధార్‌లో ఉన్న మొబైల్, ఈ-మెయిల్‌కు ఒన్‌టైం పాస్ వర్డు (ఓటీపి) వస్తుంది. వ్యాలిడేట్ ఓటీపీ వద్ద సంఖ్యను నమోదు చేసి వెబ్‌సైట్‌లోకి ప్రవేశించవచ్చు. మన దగ్గర ఉన్న ధ్రువపత్రాలను స్కాన్‌చేసి అప్‌లోడ్ చేసుకోవడంతో పాటు డిజిటల్ సంతకం తో ఉన్న ఈ ధ్రువీకరణలు ఇందులో భద్రపరుచుకోవచ్చు. అన్ని ధ్రువీకరణ పత్రాలకు ఆధార్ సంఖ్య జతచేస్తే డిజిటల్  ధ్రువీకరణ జారీ ప్రభుత్వ సంస్థలకు అవకాశం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, ఉపాధికి సంబంధించిన వాటిని దరఖాస్తులు చేసుకొనే సమయంలో కేవలం ఆధార్ నంబరును సంబంధిత సంస్థలకు తెలిపితే వారే నేరుగా ధ్రువపత్రాలను డిజిటల్ లాకర్ ద్వారా ప్రింటు తీసుకుంటారు. దీంతో పత్రాల జిరాక్సు ఖర్చులు మిగులుతాయి. దరఖాస్తు చేసుకునే సమయం మిగులుతుంది.

 19 రకాల పౌరసేవలు
  డిజిటల్ ఇండియాలో భాగంగా 19 రకాల పౌర సేవలతో మీసేవ యాప్‌ను ప్రారంభించారు. మీసేవా కేం ద్రాల్లో లభించే ఆదాయ, కుల, నివాస, నగదు చెల్లింపులు వ్యవసాయ శాఖకు సంబంధించిన అడంగల్, పుట్టిన తేదీ వంటి ధ్రువపత్రాలు పొందవచ్చు.
 
  రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్న విద్యార్థుల ఆధార్ సంఖ్యను కంప్యూటర్‌లో పొందుపరిచేలా కళాశాలల యాజ మాన్యం చర్యలు తీసుకొంది. తరుచూ ధ్రువపత్రాల సమర్పణ అవసరం లేకుండా డిజిటల్ లాకర్ సదుపాయం అందుబాటులోకి తెచ్చేలా కళాశాలల్లో  ఏర్పాట్లు  చేశారు.
 
  పోలీస్ శాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు మొబైల్‌యాప్‌లు, ఫిర్యాదుల యంత్రాలు,తదితర సాంకేతిక సేవల వినియోగాన్ని పెంచనున్నారు. విధి విధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర స్థాయి లో సాంకేతిక కమిటీని నియమించారు. ఇప్పటికే విశాఖపట్టణం రేంజ్ పరిధిలో ఐ క్లిక్, అభయం యాప్‌లను ప్రవేశపెట్టారు. మరోవైపు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాద్యమాల ద్వారా కొన్ని జిల్లాల్లో  ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలను పోలీసులు ఆరంభించారు. డిజిటల్ ఇండియాలో భాగంగా రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ శ్రీకాకుళం జిల్లాకు సుమారు 1000 ట్యాబ్‌లు సరఫరా చేశారు. వీటిని జిల్లాలోని తహశీల్దార్లు, వీఆర్‌వోలకు, ఆర్‌ఐఓలకు వారం రోజుల్లో పంపిణీ చేయనున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు, ఇందిరాకాంత్రి పథకం మహిళలకు కూడా ట్యాబ్‌లు అందజేయనున్నారు.
 
 డిజిటల్ ఇండియాతో సాంకేతిక అభివృద్ధి
 యువతీ, యువకుల్లో కంప్యూటర్ వినియోగం పెరిగింది. ఆన్‌లైన్ సేవలు పెరిగిపోవడంతో ధ్రువపత్రాల అవసరం లేకుండా పోయింది. ప్రజలు సామాజిక మాద్యమాలను వినియోగించుకుంటున్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంతో సాంకేతిక రంగం మరింత అభివృద్ధి చెందుతుంది.పనుల్లో జాప్యం లేకుండా క్షణాల్లో జరిగిపోతాయి.
 -కె.సాల్మన్‌రాజ్, ఆర్డీవో, పాలకొండ  
 

మరిన్ని వార్తలు