మా రేషన్‌ కార్డు ఎప్పుడు వస్తది సారు..?!

11 Sep, 2023 14:32 IST|Sakshi

ఏడేళ్ల నుంచి కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయని ప్రభుత్వం

కొత్త అర్జీలకు, మ్యుటేషన్లకు కలగని మోక్షం

సంక్షేమ పథకాలకు తప్పనిసరి కావడంతో తీవ్ర ఇబ్బందులు

కార్డుల్లేక వివిధ స్కీంలకు దూరమవుతున్న పేదలు

నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే తెల్లరేషన్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత ప్రభుత్వం కొత్తగా రేషన్‌ కార్డులను ఇవ్వలేదు. 2016లో మాత్రం ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఆ సందర్భంలో చాలా మంది కొత్తగా కార్డులు, పేర్ల మార్పిడి, పిల్లల పేరు ఎక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.

అయితే అలాంటి సమస్యలు అన్ని పరిష్కారం కాకపోను చాలా మందికి కొత్తగా రేషన్‌ కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆతరువాత ప్రభుత్వం రేషన్‌ కార్టులకు సంబంధించి ఆన్‌లైన్‌ సైట్‌ను బందు పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే అధికారులు రేషన్‌ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెబుతుండడంతో చాలామంది పేదలు పథకాలకు దూరమవుతున్నారు.

రేషన్‌ కార్డుల్లేక.. వేలాది దరఖాస్తుల తిరస్కరణ..
తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 78,890 మంది దరఖాస్తు వచ్చాయి. అందులో నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 వేల మందికి మొదటి విడతగా లబ్ధి పొందనున్నారు.

అయితే ఈ పథకానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కేవలం 11 వేల మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో తెల్ల రేషన్‌ కార్డులు లేక చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి మొత్తం41,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కూడా రేషన్‌ కార్డులేని వారి వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

వీటితోపాటు మైనార్టీ బంధు పథకంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాము ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్‌ కార్డులతోపాటు పేర్ల మార్పులు, కొత్తగా పిల్లల పేర్లు ఎక్కించి కొత్త కార్డులు పంపిణీ చేయాలని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు.

తెల్ల రేషన్‌ కార్డు ఉంటేనే..
ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన గృహలక్ష్మి, బీసీలకు ఆర్థిక సాయం, మైనార్టీ బంధు, దళిత బంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిఒక్క దరఖాస్తుదారు తప్పనిసరిగా తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలి. లేదంటే దరఖాస్తు చేసుకున్నా కూడా ఆన్‌లైన్‌లో తీసుకోని పరిస్థితి.

అయినా కొందరు ఆన్‌లైన్‌లో కాకుండా కొన్ని పథకాలకు నేరుగా తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా అక్కడ ఆన్‌లైన్‌ చేశారు. కానీ, రేషన్‌ కార్డులేక పోవడంతో చాలా మంది దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్లోడ్‌ కాకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు.

రేషన్‌ కార్డు అందించాలి
తెల్ల రేషన్‌ కార్డు లేకపోవడంతో మేము గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయాము. గతంలో డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కూడా రాలేదు. 2016లో రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేషన్‌ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా రేషన్‌ కార్డు ఇచ్చి ఆదుకోవాలి. – అంబటి సంధ్య, పెద్దదేవులపల్లి

తెల్ల రేషన్‌కార్డు లేక దరఖాస్తు చేసుకోలేదు
నాకు రేషన్‌ కార్డు లేదు. చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాను. అయినా కార్డు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది. కానీ, రేషన్‌ కార్డులేక నేను దరఖాస్తు చేసుకోలేక పోయాను. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్‌ కార్డు తప్పనిసరి చేసి పేదలకు అవి పంపిణీ చేయకపోవడంతో పథకాల ఫలాలు అందరికీ అందడం లేదు. – శ్రీకాంత్‌, హనుమాన్‌ పేట, మిర్యాలగూడ

మరిన్ని వార్తలు