మంత్రి ఈశ్వర్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

3 Sep, 2023 06:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కాంగ్రెస్‌ పార్టీ దళితులకు ఏం చేసిందని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే దళితుల సంక్షేమం అమలైందన్న విషయాన్ని ఈశ్వర్‌ గుర్తుంచుకోవాలని అన్నారు.

శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వంలో దళితులకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో, గత మూడేళ్లలో ఎంతమందికి దళిత, బీసీ, మైనార్టీ బంధు పథకాలు అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని, బీఆర్‌ఎస్‌కు దమ్ముంటే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టిన చోట్ల ఓట్లు అడగాలన్నారు.

గత నాలుగేళ్లుగా ఏమీ పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం పేదలకు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. దళితుల జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని కేసీఆర్‌ మాట తప్పారని, వాటిని తాము అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించడంతో ఆయన ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని కాకుండా దళితులకు అన్యాయం చేసిన కేసీఆర్‌ను ఈశ్వర్‌ ప్రశ్నించాలని జీవన్‌రెడ్డి సూచించారు.  

మరిన్ని వార్తలు