మాజీ మంత్రి సతీమణి తోట వాణి దీక్ష విరమణ

16 Aug, 2013 14:53 IST|Sakshi

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి తోట నరసింహం భార్య వాణి గత ఆరు రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను హై డ్రామాను తలపించే విధంగా శుక్రవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. కాకినాడలోని భాను గుడి సెంటర్ లోని దీక్ష శిబిరానికి జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్, జిల్లా ఎస్పీ శివ శంకర్ రెడ్డిలు చేరుకుని  తోట వాణి దీక్షను భగ్నం చేశారు.  వాణి దీక్షను భగ్నం చేయడాన్ని కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే పోలీసులు పరిస్థితి చక్కదిద్ది వెంటనే తోట వాణిని కాకినాడ జనరల్ ఆస్పత్రికి తరలించి, బలవంతంగా దీక్షను విరమింప చేసినట్టు పోలీసుల అధికారి ఒకరు వెల్లడించారు.

వాణి దీక్ష విరమించిందని.. ఆమెకు చికిత్సను అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకట్ తెలిపారు. వాణి దీక్ష విరమించాలని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రులు పల్లం రాజు, చిరంజీవి, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మిలు కోరిన సంగతి తెలిసింది. అంతేకాకుండా ఆంటోని కమిటికి తమ అభిప్రాయాలను తెలుపాలని అభ్యర్థించారు. వాణి ఆరోగ్య పరిస్థితి విషమించిందని.. దీక్షను కొనసాగిస్తే కోమాలోకి వెళ్లే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం, పోలీసులు దీక్షను భగ్నం చేశారు.
 

మరిన్ని వార్తలు