కొండ గుండెల్లో గునపం

26 Dec, 2015 00:16 IST|Sakshi
కొండ గుండెల్లో గునపం

గుప్త నిధుల కోసంకొండలను తవ్వేస్తున్న దుండగులు
భారీ జనరేటర్లు, విద్యుత్ లైట్ల వెలుగులో 200 అడుగులుపైగా తవ్వకాలు
డిటోనైటర్లతో కొండలు పేల్చివేత

 
కొండవీడు కొండల గుండెల్లో గుప్త నిధుల అత్యాశాపరులు గునపాలు దించుతున్నారు.. మంత్రగాళ్ల మాయమాటలు విని 200 అడుగుల లోతు వరకూ యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. జిలెటిన్ స్టిక్స్ సాయంతో కొండను పిప్పి పిప్పి చేసేస్తున్నారు..అర్ధరాత్రి వేళ ఆయుధాలు ధరించి.. ఆ ప్రాంతం వైపు ఎవరి కన్నూ పడకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.విచ్చలవిడిగా పేలుడు పదార్థాలు వినియోగిస్తూ..ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇవన్నీ తెలిసినా అధికారులు, పోలీసులు మొద్దు నిద్ర నటిస్తున్నారు.
 
గుంటూరు రూరల్ :   కొద్ది నెలలుగా వెంగళాయపాలెం సిలువకొండ, ఓబులునాయుడుపాలెం, పేరేచర్ల, కైలాసగరి, కొండవీడు కోట ప్రాంతాలతోపాటు కొండవీడు పరిధిలోని కొండల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగిస్తున్నారు. 10 నుంచి 20 మంది సభ్యులు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో సంచరిస్తున్నారు. వారితోపాటు తవ్వకాలకు అవసరమైన ఆయుధాలు, భోజన వసతికి నిత్యావసర సరుకులు తీసుకెళుతున్నారు. రాత్రి 10 గంటల నుంచి శతాబ్దాల చరిత్ర కలిగిన కోటల బూరుజులు, దావానాలను పగలగొడుతున్నారు. మూడు నెలల క్రితం తవ్వకాల్లో కొందరు వ్యక్తులకు మూడు పంచలోహ విగ్రహాలు దొరికాయని, వాటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని చుట్టుపక్కల గ్రామస్తులు చెబుతున్నారు. అత్యాధునిక స్కానర్లు ఉపయోగించి భూమిలో దాగి ఉన్న నిధులను గుర్తిస్తున్నారు. విచిత్ర చిత్రాలు, వింత శబ్దాలు, పూజలతో అటు వైపు ఎవరినీ రాకుండా భయపెడుతున్నారు.

భారీ స్థారుులో జిలెటిన్ స్టిక్‌లు, జనరేటర్లు, డ్రిల్లిగ్ మిషన్ల సాయంతో తవ్వకాలు చేస్తున్నారు. భారీ జనరేటర్లను కొండపై గుంటలను తీసి మట్టిలో కప్పి( సౌండ్ రాకుండా) దాని ద్వారా తవ్వకాలు నిర్వహించే గుహల్లోకి ప్రత్యేక విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. విద్యుత్ లైట్ల వెలుగులోనే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు బయటకు వస్తున్నాయంటే దాని వెనుక పలువురు పెద్దలు ఉన్నారని సమాచారం. స్థానికం కొందరిని ప్రలోభాలకు గురి చేసి వారిని సైతం అవసరాలకు వినియోగించుకుంటున్నారు. కొండపైనే సుమారు 200 అడుగుల లోతు గుహల్లోకి దిగేందుకు తాళ్ల సాయంతో మంచెలు, నిచ్చెనలు ఏర్పాటు చేసుకున్నారు.

మారణాయుధాలతో సంచారం
ఈ కొండల వైపు ఎవరైనా వస్తారనే అనుమానంతో దుండగులు మారణాయుధాలు ధరించి సంచరిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత వాసులు కొండవైపు వెళ్లేందుకు జంకుతున్నారు. తవ్వకాల సమయంలో అటు వైపు వెళితే ప్రాణాలకు ముప్పు వాటిల్లడం ఖాయం.  
 
అధికారులకు తెలిసే...?
కొండల్లో తవ్వకాల గురించి పోలీసు, అటవీ శాఖాధికారులకు తెలిసినా కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారుు.  రెండు శాఖల్లో కింది స్థాయి సిబ్బంది ద్వారా పెద్ద మొత్తాల్లో మామూళ్లు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
 
 

మరిన్ని వార్తలు