ఆ బార్లు 'ఏటీఎంలు'!

3 Nov, 2019 04:53 IST|Sakshi

‘ఎనీటైం మద్యం’ అమ్మకాలు 

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న బార్ల నిర్వాహకులు 

పార్సిల్‌ సేల్స్‌ పేరిట బయటకు విక్రయాలు 

విచ్చలవిడిగా డైల్యూషన్స్, బ్రాండ్‌ మిక్సింగ్‌ 

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని ఎక్సైజ్‌ శాఖ హెచ్చరిక 

గుంటూరు నగరంలో గుంటూరు–విజయవాడ రాష్ట్ర రహదారి పక్కనే ఉన్న ఓ బార్‌లో అర్ధరాత్రి దాటినా అమ్మకాలు జరుగుతాయి. పార్సిల్‌ సేల్స్‌ పేరిట మద్యాన్ని బయటకు తరలించి, అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడే డైల్యూషన్స్, బ్రాండ్‌ మిక్సింగ్‌ జరుగుతున్నా ఎక్సైజ్‌ శాఖ చోద్యం చూస్తోంది. గుంటూరులో అర్ధరాత్రి దాటినా మద్యం ఎక్కడ దొరుకుతుందంటే ఈ బార్‌ గురించే మందుబాబులు ఠక్కున చెబుతారు. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మద్యం విక్రయాల సమయాన్ని కుదించారు. పర్మిట్‌ రూములను ఎత్తేశారు. లిక్కర్, బీరు బాటిళ్లు మూడుకు మించి కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని.. ప్రజారోగ్యం, శాంతిభద్రతలే ముఖ్యమని భావించిన ప్రభుత్వం తొలి ఏడాది మద్యం దుకాణాల సంఖ్యను 20 శాతం తగ్గించింది. మిగిలిన 3,500 దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నిబంధనల ప్రకారమే విక్రయాలు సాగిస్తోంది. గతంలో మాదిరిగా ఎల్లవేళగా మద్యం దొరకడం లేదు. దీంతో మద్యం సిండికేట్లు బార్లపై దృష్టి పెట్టాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలను రాత్రి 8 గంటలకు మూసేస్తున్నారు. తర్వాత మద్యం దొరకదు. ఇదే అదనుగా బార్ల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో 840 బార్లలో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు. 

పార్సిల్‌ సేల్స్‌ పేరిట బయటకు..
మద్యం సీసాలను బయటకు అమ్మకూడదనేది బార్ల లైసెన్సులో ప్రధాన నిబంధన. బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులు పార్శిల్‌ సేల్స్‌ పేరుతో అధిక ధరలకు బయటకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే పనిచేస్తాయి. బార్లలో రాత్రి 11 గంటల వరకు మద్యం సరఫరా చేస్తారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా ఫుడ్‌ సర్వింగ్‌ పేరుతో అమ్మకాలు సాగుతున్నాయి. రెస్టారెంట్‌కు అన్ని అనుమతులు ఉంటేనే బార్‌ లైసెన్సు ఇస్తారు. రెస్టారెంట్‌ కూడా మున్సిపాలిటీ/కార్పొరేషన్‌ నిర్దేశించిన విధంగా నిర్మించాలి. దీనికి ట్రేడ్‌ లైసెన్సు ఉండాలి. ఇవేవీ లేకుండా బార్‌ నిర్వాహకులు రెస్టారెంట్‌ ఫుడ్‌ అమ్మకాల కంటే మద్యం విక్రయాలపైనే దృష్టి పెడుతున్నారు. వేళాపాళా లేకుండా ఇష్టం వచ్చిన ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు. 

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం 
మద్యం దుకాణాలు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోవడంతో సిండికేట్లు బార్లను ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. బార్లలో మద్యాన్ని లూజు సేల్స్‌గా అమ్ముకోవచ్చు. దీంతో కొత్త దందాకు తెరతీశారు. మద్యంలో నీళ్లు కలిపి జనానికి అంటగడుతున్నారు. విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. బ్రాండ్‌ మిక్సింగ్‌ చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. 

నిబంధనలు ఉల్లంఘించే బార్లపై కేసులు 
‘‘రాష్ట్రంలో బార్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం వాస్తవమే. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగం దాడులు చేసి, కేసులు నమోదు చేస్తోంది. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే బార్ల లైసెన్సులను రద్దు చేస్తాం. బార్లలో నిబంధనల ఉల్లంఘనల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరించే ఎక్సైజ్‌ అధికారులపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’’ 
– ఎం.ఎం.నాయక్, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌  

మరిన్ని వార్తలు