మద్యపాన వ్యసనం ఇంత ఘోరంగా ఉంటుందా? ఏకంగా యాసిడ్‌లా మూత్రం..

7 Nov, 2023 16:13 IST|Sakshi

మద్యపానం వ్యసనం అనేది ఓ రుగ్మత అని పలువురు ఆరోగ్య నిపుణులు గట్టిగా నొక్కి చెబుతున్న సంగతి తెలిసిందే. మనకు తెలిసినవాళ్లు లేదా సన్నిహితులు ఇలా ఉంటే గమనించి కౌన్సిలింగ్‌ ఇప్పించి మార్చాలని లేదంటే మానవ సంబంధాల తోపాటు ప్రాణాలు కూడా హరించిపోతాయని హెచ్చరిస్తుంటారు. కానీ ఇప్పుడూ ఈ ఘటన చూస్తే.. అదంతా నిజమే అని అనకుండా ఉండలేరు. ఈ వ్యసనం కారణంగా ఓ ప్రముఖ మోడల్‌ ఆరోగ్యం ఎంతలా క్షీణించిందో వింటే..వామ్మో! అని నోరెళ్లబెట్టడతారు!.

వివరాల్లోకెళ్తే..కాలిఫోర్నియాకు చెందిన 37 ఏళ్ల మోడల్‌, నటి జెస్సికా లాండన్‌ వోడ్కాకు బానిసైపోయింది. ఎంతలా అంటే 24 గంటలు అది తాగకపోతే లేను అనేంతగా మద్యం అంటే పడి చచ్చిపోయింది. ఆ అలవాటు చాలా చిన్న వయసులోనే ఆరోగ్యం మొత్తం కోల్పోయేలా క్షీణించేసింది. చివరికి ఆ వ్యసనం తనకు తెలియకుండానే తాగుతూ నేలపై పడిపోయి తెలియకుండానే అక్కడే మల మూత్ర విసర్జనలు చేసేంతలా ఆరోగ్యాన్ని దిగజార్చేసింది. వృధాప్యంలో వచ్చే వణుకు, భయం అన్ని ఈ వయసులోనే ఫేస్‌ చేసింది.

మాటిమాటికి స్ప్రుహ కోల్పోవడం అన్ని మరిచిపోతున్నట్ల మెదడు మొద్దుబారిపోవడం వంటి లక్షణాలన్ని ఒక్కసారిగా ఆవరించాయి ఆ మోడల్‌కి. దీని కారణంగా బయటకు వచ్చేందుకు కాదు కదా కనీసం తోడు లేకుండా బాత్రూంకి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. ఆఖరికి ఆమె మూత్రమే యాసిడ్‌లా మారి ఆమె చర్మాన్ని తినేసేంత స్థితికి వచ్చేసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె మెట్లపై స్ప్రుహ కోల్పోయి పడిపోయింది. పుండు మీద కారం చల్లినట్లుగా ఈ టైంలోనే తలకు కూడా బలమైన గాయం అయ్యింది. దీని కారణంగా మెదడులో బ్లడ్‌ క్లాట్‌ అయ్యి కణితిలా వచ్చింది.

దీంతో ముఖంలో ఒకవైపు అంతా పక్షవాతానికి గురై మాట కూడా రాని స్థితికి చేరుకుంది. ఇది సీరియస్‌ కాకమునుపే ఆపరేషన్‌ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో జెస్సికా ఆల్కహాల్‌కి పూర్తి స్థాయిలో దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా ఆల్కహాల్‌ మానడం అంత ఈజీ కాదు. దీని కారణంగా మూర్చ, పక్షవాతం, వణుకు లాంటి దారుణమైన సమస్యలను ఎదుర్కొంది. ఒకరకంగా మెదడు శస్త్ర చికిత్స కోసం తాగకుండా ఉండటమే ఆమెను ఆల్కహాల్‌ అడిక్షన్‌ నుంచి బయటపడేందుకు ఉపకరించిందనాలి. ఆ తర్వాత ఆపరేషన్‌ అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించింది. 

అసలు మద్య పానం వ్యసనం అంటే..

  • ఆల్కహాల్‌పై నియంత్రణ లేకుండా అదేపనిగా తాగడం.
  • అందుకోసం ఎలాంటి పని చేసేందుకైనా దిగజారడం.
  • ప్రియమైన వారితో సంబంధాలను తెంచుకునేలా ప్రవర్తించడం
  • తగని సమయాల్లో కూడా తాగడం
  • మద్యాన్ని దాచడం లేదా తాగేటప్పుడూ దాచడం తదితర విపరీతమైన లక్షణాలు ఉండే వారిని వైద్యుల వద్దకు తీసుకొచ్చి చికిత్స ఇప్పించాలి లేదంటే ప్రాణాంతక వ్యాధుల బారినపడి చనిపోతారు.

(చదవండి: మద్యపాన వ్యసనం మానసిక జబ్బా? దీన్నుంచి బయటపడలేమా?)

మరిన్ని వార్తలు