కలరింగ్‌ ఇచ్చేందుకు అధికారులు నానాపాట్లు

20 Mar, 2019 07:15 IST|Sakshi
మద్యం స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్‌ శాఖ అధికారులు

సాక్షి, ఏలూరు టౌన్‌ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సి రావటం.. ఎన్నికల విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నామని కలరింగ్‌ ఇచ్చేందుకు అధికారులు నానాపాట్లు పడుతున్నారు. ప్రతి రోజూ భారీఎత్తున దాడులు చేస్తున్నట్టు, అక్రమ మద్యం స్వాధీనం.. అరెస్టులు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. ఇంతకీ ఇవన్నీ ఉత్తుత్తి దాడులేనని, పేరుకే దాడులు తప్ప చర్యలు శూన్యమనే ఆరోపణలు ఉన్నాయి. ముందుగా లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని మరీ కాగితాల మీద లెక్కలు చూపించుకునేందుకు అధికారులు తాపత్రయపడుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే సిండికేట్లతో ఒప్పందాలు చేసుకుని దాడులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 


సిండికేట్లతో రహస్య ఒప్పందం
జిల్లా వ్యాప్తంగా మద్యనియంత్రణ, ఆబ్కారీ శాఖ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో మొబైల్‌ టీమ్స్, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ టీమ్స్, ట్రైన్‌ చెకింగ్‌ టీమ్‌లతో పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని అధికారులు ప్రకటించారు. కానీ ఇవన్నీ ఉత్తుత్తి దాడులేనని ఆరోపణలు వస్తున్నాయి. ముందుగానే మద్యం సిండికేట్లతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటూ రోజుకు కొన్ని ప్రాంతాల్లో దాడులు చేస్తూ మద్యాన్ని సీజ్‌ చేయటం, అరెస్టులు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో దాడులు చేసి స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎన్నికల అనంతరం వారికి అప్పగించేలా ఒప్పందాలు చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఈ కారణంగానే సిండికేట్లు ఆయా ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఏర్పాట్లు చేయటం, అక్రమ మద్యాన్ని ఎక్సైజ్‌ శాఖ డీసీ కార్యాలయానికి తరలిస్తున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న మద్యం అంతా ఎన్నికలు ముగిసిన వెంటనే తిరిగి వారికి అప్పగించేలా ఒక రహస్య ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. ముందుగా సిండికేట్లు మద్యం కేసులను ఒక చోట ఉంచి, ఎక్సైజ్‌ అధికారులకు చెప్పటం, అధికారులు వాటిని స్వాధీనం చేసుకోవటం అంతా ఒప్పందంలో భాగమేనంటున్నారు. పోలీసులు దాడుల్లో మద్యం బాటిళ్లు దొరుకుతుంటే, ఎక్సైజ్‌ శాఖ అధికారుల దాడుల్లో మాత్రం ఏకంగా అట్టపెట్టెలతో భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవటం అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల అనంతరం మళ్లీ తిరిగి అట్టపెట్టెలతో సహా మద్యం బాటిళ్లను మద్యం షాపుల యజమానులకు వాటిని అప్పగించేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు