రుణమాఫీ.. అధోగతి

22 Feb, 2016 01:58 IST|Sakshi

అప్పు కట్టాల్సిందేనంటూ రైతులకు నోటీసులు ఇస్తున్న బ్యాంకులు
తాకట్టు బంగారాన్నివేలం వేస్తున్న వైనం
ఆందోళనలో అన్నదాతలు
 

పెనుమూరు మండలం పెరుమాళ్లకండ్రిగకు చెందిన రైతు వెంకటాచలం నాయుడు పెనుమూరు కార్పొరేషన్ బ్యాంకులు రూ.75 వేలు రుణం తీసుకున్నారు. వడ్డీతో కలిపి రూ.1,11,343 అయ్యింది. వెంకటాచలం నాయుడుకు రుణమాఫీ వర్తింపచేస్తున్నట్లు ప్రభుత్వం లేఖ పంపింది. తొలి విడత కింద రూ.21,292 మంజూరు చేసింది. మిగిలిన మొత్తాన్ని మూడు కంతులుగా ఇస్తామని చెప్పినా రెండో విడత మొత్తాన్ని ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. బాబు ఇచ్చిన రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదు. ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని ఇచ్చేది .. చచ్చేది లేదు.. ముందు మా అప్పు కట్టండంటూ బ్యాంకు రైతుకు నోటీసు పంపింది. ఒక్క వెంకటాచలంనాయుడికే కాదు జిల్లాలో చాలా మంది రైతులకు బ్యాంకులు తాజాగా నోటీసులిచ్చాయి.
 
చిత్తూరు: రుణమాఫీని చంద్రబాబు సర్కారు గంగలో కలపడంతో జిల్లాలోని అన్నదాతలు రోడ్డునపడ్డారు. జిల్లావ్యాప్తంగా 2013 డిసెంబర్ 31వ తేదీ నాటికి వివిధ బ్యాంకుల్లో 7,43,158 మంది రైతులు రూ.5,404.30 కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే చంద్రబాబు సర్కారు కేవలం 3,67,993 మంది రైతులే రుణమాఫీకి అర్హులంటూ లెక్కలు తేల్చింది. రూ.50 వేలు లోపు రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తున్నామని, రూ.50 వేలు నుంచి రూ.1.50 లక్షల  రుణాలను నాలుగు కంతుల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.50 వేలు లోపు మాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటించినా వాస్తవానికి వాటిల్లో 60 శాతం రుణాలను కూడా మాఫీ చేయలేదు. ఇక రూ.50వేల పైన రుణాలకు సంబంధించి కేవలం తొలి కంతు మాత్రమే బ్యాంకుల్లో జమ చేసిన ప్రభుత్వం మిగిలిన మూడు కంతుల సంగతిని గాలికొదిలేసింది. రుణమాఫీ కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం బాండ్ల రూపంలో జమ చేస్తుందని భావించిన బ్యాంకులకు చుక్కెదురైంది. రెండో కంతు చెల్లిస్తామంటూ వ్యవసాయ శాఖ మంత్రి పదే పదే చెప్పినా ఆచరణలో అది అమలుకు నోచుకోలేదు.
 
బ్యాంకర్ల దాష్టీకం..
రుణమాఫీ కింద ఇస్తానన్న మొత్తాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో బ్యాంకులు రుణ వసూళ్లకు దిగాయి. ఉన్నఫలంగా రూ.లక్షల రుణం ఎలా తీర్చాలంటూ రైతులు లబోదిబోమంటున్నారు. అసలే అరకొర రుణమాఫీతో రైతులను మోసం చేసిన ప్రభుత్వం చెప్పిన మొత్తాన్ని కూడా చెల్లించక పోవడంతో అన్నదాతలు ఆందోళనలో చెందుతున్నారు.
 
వేలానికి తాకట్టు బంగారం..
రుణమాఫీ అమలు కాకపోవడంతో బ్యాంకులు తాకట్టు పెట్టిన రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి. వారం రోజులుగా జిల్లావ్యాప్తంగా పలు బ్యాంకుల్లో బంగారం వేలం పాటలు ఊపందుకున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 3,49,268 మంది రైతులు బంగారాన్ని తాకట్టు పెట్టి  రూ.2,910 కోట్ల రుణాలను పొందారు. రుణాలు పొంది నిర్దేశిత గడువు 18 నెలలు దాటిపోవడంతో బ్యాంకులు రైతుల బంగారాన్ని వేలం వేస్తున్నాయి. దీంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు.
 
 

మరిన్ని వార్తలు