తెల్ల ‘మొహం’

14 Apr, 2018 08:03 IST|Sakshi

రేషన్‌ సరఫరాకు సరికొత్త విధానం

కార్డుదారుల ఫేస్‌ రికగ్నైజేషన్‌(ముఖ గుర్తింపు)

కార్డుల్లోని ఫొటోల సహాయంతో ముఖాల గుర్తింపు

ఈ పద్ధతి అమలుకు అధికారుల కసరత్తు

ఇప్పటికే వేలిముద్రలు పడక అవస్థలు

కొత్త పద్ధతితో పెరగనున్న ఇబ్బందులు

పౌర సరఫరాల వ్యవస్థకు మంగళం పాడేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రేషన్‌ డిపోల ద్వారా అందించే      సరుకులన్నింటినీ ఒక్కొక్కటే కుదించుకుంటూ వచ్చింది. తాజాగా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసేందుకు ఫేస్‌ రికగ్నైజేషన్‌(ముఖాల గుర్తింపు) పరికరాలు ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే వేలిముద్రలు పడక, ఈ పోస్‌ పనిచేయక అవస్థలు పడుతున్న రేషన్‌దారులకు కొత్త పద్ధతిలో మరింత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.

సాక్షి,విజయవాడ:   పేదలకు ఇచ్చిన తెల్లకార్డును రద్దుచేసేందుకు ప్రభుత్వం కొత్తకొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే ఫింగర్‌ ప్రింట్స్, ఐరిస్, బయోమెట్రిక్‌ తదితర విధానాలను ప్రవేశపెట్టింది. అయినప్పటీకీ తెల్ల కార్డులు ఉన్న పేదల సంఖ్య తగ్గలేదు. దీంతో కొత్తగా ఫేస్‌ రికగ్నైజేషన్‌ (ముఖ గుర్తింపు) విధానాన్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ–పోస్‌ మిషన్‌కే కార్డుదారుడు ముఖం నమోదు చేసే కెమెరాను అనుసంధానం చేస్తారు. దాంతో ఆ ముఖాన్ని కార్డుపై ఉన్న ముఖాలతో సరిపోల్చి దాని ఆధారంగా కార్డుదారులను గుర్తించి, సరుకులు పంపిణీ చేస్తారు.

కార్డులపై ఉన్న ఫొటో గుర్తింపు ఆధారంగా..
జిల్లాలో 12.57 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రతికార్డుకు కార్డుదారుడు, వారి కుటుంబసభ్యుల ఫొటోలను అను సంధానం చేశారు. అయితే ఈ ఫొటోలు స్పష్టంగా లేవు. కుటుంబసభ్యులంతా ఒక గ్రూపుగా తీయించుకున్నారు. దీంతో కొంతమంది ముఖాలు స్పష్టంగా కనపడటం లేదు. అయితే వేలిముద్రలు నమోదు ఆధారంగా ఫొటోలు సరిగా లేకపోయినా సరుకులు పంపిణీ చేస్తున్నారు. అయితే వృద్ధులకు, కాయకష్టం చేసుకునే వారికి వేలిముద్రలు సరిగా పడక పోవడం వల్ల సరుకులు పూర్తిగా అందడం లేదు. జిల్లాలోనే ప్రతి నెల కనీసం రెండువేల మందికి ఈ విధంగా నిత్యావసరాలు అందడం లేదు. ఇది కాక సర్వర్‌ మొరాయిస్తూ ఉండటంతో పేదలు గంటలు తరబడి రేషన్‌ దుకాణాల వద్దనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కొత్తగా ముఖాలు గుర్తింపు పెడితే ఇంకా ఎన్ని ఇబ్బందులు వస్తాయోనని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.

ఒడిశా తరహాకు భిన్నంగా...
ఒడిశాలో ఇప్పటికే ముఖాలు గుర్తింపు ఆధారంగా సరుకులు పంపిణీ జరుగుతోంది. అయితే అక్కడ కార్డుదారుల కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఫొటోలను తీసి వేర్వేరుగా ఆన్‌లైన్‌ చేశారు. అందువల్ల కార్డులోని ఎవరు సరుకులకు వచ్చినా వెంటనే వారి ఫొటో ఆధారంగా ఈపోస్‌ మిషన్‌ వారిని గుర్తిస్తోంది. అయితే ఇక్కడ వ్యక్తిగతంగా  ఫొటోలు తీయకుండా కార్డులో ఉన్న గ్రూపు ఫొటో ఆధారంగా సరిపోల్చాలంటే ఒకొక్క కార్డుకు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు పట్టే అవకాశం ఉంది. 20శాతం మించి ఫొటో గుర్తించకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ముఖాలు సరిగా లేకపోతే మిషన్‌ గుర్తించకపోతే సరుకులు లభించవు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారుల వాయిస్‌ రికార్డింగ్‌ పద్ధతిని ప్రయోగాత్మకంగా కొన్ని మండలాల్లో ప్రవేశపెట్టింది. అది విజయవంతం కాలేదు.  ఇప్పుడు తిరిగి ముఖాల గుర్తింపు పద్ధతి ప్రవేశపెడుతున్నారని  ఇది ఎంతమేరకు విజయవంతమవుతుందో చూడాలని పౌరసరఫరాల శాఖాధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ విధానంపై ఆలోచిస్తున్నాం.
ఐరిస్, వేలిముద్రలు సరిగా పడని నేపథ్యంలో ముఖాలను గుర్తించే మెషిన్లను పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. ఆమేరకు కసరత్తు జరుగుతుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకు ఏవిధమైన ఉత్తర్వులు అందలేదు. – నాగేశ్వరరావు, డీఎస్‌వో

మరిన్ని వార్తలు