గద్వాల నుంచి జిల్లాలోకి.. 

8 Jul, 2019 11:07 IST|Sakshi

వెల్లువెత్తుతున్న నకిలీ విత్తనాలు

కర్నూలు(అగ్రికల్చర్‌) :  రాష్ట్రంలో పత్తి సాగయ్యే జిల్లాల్లో కర్నూలు ప్రధానమైంది. జిల్లాలో దాదాపు 3 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగవుతుంది. కొద్ది నెలలుగా పత్తి ధరలు ఆశాజనకంగా ఉండటం, జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటంతో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో  గ్రామాలను నకిలీ బీటీ పత్తి విత్తనాలు ముంచెత్తుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో రూ.20 కోట్ల నుంచి రూ.25  కోట్లకు పైగా నకిలీ విత్తన వ్యాపారం ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ వ్యవసాయ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. ఎమ్మిగనూరు, ఆస్పరి, దేవనకొండ, కర్నూలు, సి.బెళగల్, కోసిగి, మంత్రాలయం, హొళగుంద, హాలహర్వి, పెద్దకడబూరు, గోనెగండ్ల, మద్దికెర, తుగ్గలి, ఓర్వకల్‌ తదితర మండలాల్లో నకిలీ బీటీ పత్తి విత్తన ప్యాకెట్లు విక్రయిస్తున్నారు.

 గద్వాల నుంచి..  

బీటీలో నకిలీ విత్తనాలకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. చాలా ఏళ్లుగా ఈ పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సరఫరా అవుతున్నాయి. ఇక ఆశ్చర్యం కల్గించే అంశం ఏమిటంటే.. తెలంగాణలోని గద్వాల జిల్లా నుంచి ఇక్కడికి నకిలీ విత్తనాలు వస్తుండడం. కర్నూలు సబ్‌ డివిజన్‌లోని వివిధ మండలాల రైతులు గద్వాల విత్తనాలను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. బీటీ నకిలీ పత్తి విత్తనాలను ఏప్రిల్, మే నెలల్లోనే గ్రామాలకు చేర్చినట్లు సమాచారం. గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పరచుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. ప్యాకెట్‌ రూ.500 నుంచి రూ.600 ప్రకారం  విక్రయిస్తుండడంతో ఎక్కువ శాతం మంది రైతులు వాటినే కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పలు గ్రామాల్లో లూజు విత్తనాల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. 

కంపెనీ విత్తనమైతే ఇలా ఉండాలి... 

కంపెనీ బీటీ విత్తన ప్యాకెట్లను సులభంగా గుర్తించవచ్చు. ప్యాకెట్‌పై కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ ఉంటుంది. ఈ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే రింగ్‌ వస్తుంది. ఒకవేళ రింగ్‌ కాకపోతే నకిలీ విత్తనంగా అనుమానం పడొచ్చు. అలాగే కంపెనీ పేరు, అడ్రెస్, వెరైటీ తదితర వివరాలన్నీ ఉండాలి. ఇటీవల పట్టుబడిన నకిలీ విత్తనాల ప్యాకెట్లను పరిశీలిస్తే కస్టమర్‌ కేర్‌ నెంబర్లు లేవు. బ్రాండెడ్‌ కంపెనీల పేరుతోనే నకిలీ విత్తనాల ప్యాకెట్లు లభిస్తుండటం గమనార్హం. వీటి విక్రయిస్తున్న వారిని అక్కడక్కడ అరెస్టు చేస్తున్నా.. సూత్రధారులెవరనే విషయాన్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ విషయంపై వ్యవసాయ శాఖ జేడీ ఠాగూర్‌ నాయక్‌ను వివరణ కోరగా..నకిలీ విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక బృందాల ద్వారా ట్రాన్స్‌పోర్టు కంపెనీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లను తనిఖీ చేయించామన్నారు. రైతులు సహకరిస్తేనే నకిలీ విత్తనాల నియంత్రణ సాధ్యమని స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు