ఉసురు తీసిన రుణం

3 Jan, 2019 11:58 IST|Sakshi
రోదిస్తున్న సూర్యనారాయణ కుటుంబ సభ్యులు

అప్పులబాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

సాగు పెట్టుబడులకు2.5 లక్షల అప్పు

తీవ్ర మనస్తాపంతో చెడిన ఆరోగ్యం

పురుగుమందు తాగి విషాదాంతం

విశాఖపట్నం , చీడికాడ(మాడుగుల): కౌలు రైతు ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులతోపాటు వడ్డీ భారం పెరి గిపోవడంతో మంగళవారం సా యంత్రం పురుగుమందు తాగిన ఇతడు విశాఖ కేజీహెచ్‌లో వైద్యం పొందుతూ బుధవారం చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. చీడికాడ మండలం జి.కొత్తపల్లి పంచాయతీ శివారు చినగోగాడకు చెందిన పడాల సూర్యనారాయణ(72)కు ఎకరన్నర పొలం ఉంది. మరో ఎకరం పొలం కౌలుకు తీసుకుని వరి, చెరకు పంటలు చేపట్టాడు. వర్షాభావ పరిస్థితులతో మొత్తం పంటంతా పాడైపోయింది. తీవ్ర మనస్థాపంతో ఆరోగ్యం చెడిపోయింది. పంటల పెట్టుబడులకు, వైద్యం కోసం చేసిన అప్పలు తడిసిమోపెడయ్యాయి. వడ్డీ భారం మోయలేని పరిస్థితికి చేరింది. గతేడాదీ ఇదే పరిస్థితి చోటుచేసుకుంది. వ్యవసాయ మదుపుల కోసం చీడికాడ కెనరాబ్యాంకులో రూ.34వేలు అప్పు తెచ్చాడు. తన భార్య, అక్క బంగారం కుదువపెట్టి మరో రూ.2.5లక్షలు తెచ్చాడు. మరో రూ.3లక్షలు పలువురి వద్ద తీసుకున్నాడు. ఈ అప్పులన్నీ ఎప్పుడు తీరుతాయని తన తండ్రి తరచూ ఆందోళన చెందేవాడని కొడుకు కన్నంనాయుడు తెలిపారు. అధికారులు తమకు కౌలురైతు కార్డు అందించలేదన్నారు.

క్షీణించిన ఆరోగ్యం..
అప్పుల బాధతో తీవ్ర మనస్థాపానికి గురైన సూర్యనారాయణ ఆరోగ్యం క్షీణించింది. హెర్నియా(వరిభీజం)కు కూడా గురయ్యాడు. ఆపరేషన్‌కు  ఎన్‌టీఆర్‌ వైద్యసేవ వర్తించలేదు. ఆపరేషన్‌కు రూ.లక్ష, కుడికాలు చిప్ప అరిగిపోవడం, కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాడన్నారు. వీటన్నింటికీ భయపడి తన తండ్రి పురుగు మందు తాగినట్లు కన్నంనాయుడు చెప్పారు. మంగళవారం సాయంత్రం చినగోగాడలో సూర్యనారాయణ పురుగు మందు తాగాడు. చోడవరం ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం కుటుంబసభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వైద్యం పొందుతూ  బు«ధవారం చనిపోయాడని హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణ తెలిపారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చెస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు