రగిలిన రైతన్న

6 Sep, 2014 02:39 IST|Sakshi

సీతానగరం/ బొబ్బిలి: ‘‘ఇప్పటివరకూ మమ్మల్నే మోసం చేశారు...ఇప్పుడు అధికారులను కూడా మోసం చేస్తున్నారు..... రైతులను నట్టే ట ముంచిన దొంగోడి ఆస్తులకు కాపలా కాస్తున్నారా... మా ఉసురు ఊరికే పోదు.. ఈ రోజు డబ్బు ఇస్తామని రమ్మని 144వ సెక్షన్ పెట్టి అడ్డగిస్తారా.. చూస్తాం.. రేపు కుటుంబాలతో సహా వస్తాం.. ఏమి చేస్తారో.. తెల్లచొక్కా వేసుకున్నవాళ్లందరినీ నమ్మి,  మీరు చెప్పిందల్లా వింటే ఇలా వీధి పాలు చేస్తారా’’ అంటూ అన్నదాత మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశాడు. బిల్లుల కోసం వచ్చిన రైతులు ఆందోళనకు దిగడంతో లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం వద్ద శుక్రవారం మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ నెల 2న ఫ్యాక్టరీ దగ్గర రైతులు ధర్నా చేసిన సందర్భంగా... 5వ తేదీ నుంచి బిల్లులు ఇస్తామని సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, సీఈఓ ఆంజనేయులు ప్రకటించారు. అయితే ఎన్‌సీఎస్ యాజమాన్యం శుక్రవారం నాటికి బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవడం, ఎప్పుడు చెల్లిస్తారో చెప్పలేని పరిస్థితి రావడంతో ఇటు రెవెన్యూ, అటు పోలీసు అధికారులు ఇరకాటంలో పడ్డారు.  రైతాంగానికి ఏమి సమాధానం చెప్పాలో తెలీక, బిల్లుల కోసం రైతులు ఎవరూ రావద్దని గ్రామాల్లో దండోరా వేయడమే కాకుండా, రైతులు ఫ్యాక్టరీ వద్దకు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించారు.

అప్పటికే ఏపీ చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో చాలా మంది రైతులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకొని ఆందోళన మొదలు పెట్టారు. రెండో తేదీన ఫ్యాక్టరీ లోపలకు రైతులు వెళ్లి కార్యాలయంపై రాళ్లతో దాడి చేయడంతో శుక్రవారం గేటు దాటి లోపలకు ఎవరకూ వెళ్లకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా గేట్లను తోసుకొని లోపలకు వెళ్లడానికి రైతులు, నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే పోలీసులు కూడా అదే స్థాయిలో నిలువరించారు. కొంత మంది నాయకులు, రైతులు గేట్లు దూకి లోపలకు వెళ్లడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
 
తహశీల్దార్ నిర్బంధం
రైతులు ఆందోళనను ఉద్ధృతం చేయడంతో సీతానగరం తహశీల్దార్ బి.సత్యనారాయణ సంఘటన స్థలానికి వచ్చి రైతులతో చర్చలు జరపడానికి ప్రయత్నించారు. సబ్ కలెక్టరే బిల్లులు ఇస్తామని ప్రకటించారని, అయినా అమలుకాలేదని, దీనిపై సమాధానం చెప్పాలని రైతులు చుట్టుముట్టారు. ఈ రోజు ఇస్తారా, లేదా, ఎప్పుడిస్తారో చెప్పాలంటే ఘెరావ్ చేసి నిర్బంధించారు. గేటు ముందే తహశీల్దార్‌ను కూర్చొపెట్టి రైతులంతా ఆయన చుట్టూ కూర్చొని యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు అరగంటకు పైగా తహశీల్దార్‌ను నిర్బంధించడంతో సబ్ కలెక్టరు శ్వేతామహంతి తీవ్రంగా స్పందించారు.

పలుమార్లు డీఎస్‌పీ ఇషాక్ మహమ్మద్‌తో మాట్లాడి  తహశీల్దార్‌ను బయటకు తీసుకురావాలని సూచించారు. దీంతో పోలీసులు అధికారులు తహశీల్దార్‌ను బయటకు తీసుకువస్తుండగా, రైతులు ఆయన్ను వెనక్కి లాగడంతో మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ తరువాత బొబ్బిలి తహశీల్దార్ మసిలామణి వచ్చి రైతులతో సమావేశమయ్యారు. ఇప్పటికే ఎన్సీఎస్‌కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టుకలెక్టరు రాజపత్రాన్ని విడుదల చేశారని, వాటిని వెంటనే వేలం వేసి బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. అయితే రైతులు ఆ మాటలను వినకుండా ఇటువంటివి చాలా సార్లు విన్నామని, మరోసారి మోసపోమని అంటూ అక్కడ నుంచి లేచి వెళ్లిపోయారు.
 
ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటున్నాం
ఎన్సీఎస్ యాజమాన్యం మీకు ఇచ్చిన మాటే కాదు.. మాకు ఇచ్చిన మాట కూడా తప్పిందని సబ్ కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చి ఆమె మాట్లాడారు. ఎన్సీఎస్ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వాటిని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు ఉన్నాయని తెలియడంతో  కలెక్టరు వాటిపై దృష్టి పెట్టారన్నారు.  నెల్లూరులో సుగర్ ఫ్యాక్టరీ ఉందని అక్కడ కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఆ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న భూములను అమ్మి రైతులు బకాయిలు తీరుస్తామని, అంతవరకూ సహకరించాలని కోరారు.
 
ఎన్సీఎస్ భూముల పరిశీలన

లచ్చయ్యపేట చ క్కెర కర్మాగారానికి సంబంధించిన భూములను స్థానిక ఓరియంటల్ బ్యాంకు అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఎన్సీఎస్ భూములను రెవెన్యూ రికవరీ యాక్టు ప్రకారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయా భూముల వద్ద సీతానగరం తహశీల్దార్ పేరుతో హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఈ నేపథ్యంలో భూములను పరిశీలించిన బ్యాంకు అధికారులు ఫొటోలు, వీడియోలు తీసి ఉన్నతాధికారులకు పంపించారు.    
 
నేడు రహదారుల దిగ్బంధం
చెరుకు బకాయిలు ఇస్తామని రమ్మనిచెప్పి 144వ సెక్షను విధించి రైతులను రాకుండా అడ్డుకుంటున్నారని ఏపీ చె రకు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారా యణ అన్నారు. శిబిరం వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.5నుంచి బిల్లులు ఇస్తామని చెప్పి మా ట తప్పి ఇప్పుడేమో అక్టోబరు 16న ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజను దాటి పోతుండడంతో రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారన్నారు. అక్టోబరు నాటికి చెరకు సీజను కూడా మొదలవుతుందన్నారు. బిల్లులు చెల్లించే వరకూ ఉద్యమం చేస్తామన్నా రు. శనివారం ఫ్యాక్టరీ పరిధిలో ఉండే అన్ని రహదారులను నాటుబళ్లతో దిగ్బంధించాలని పిలుపునిచ్చారు.
 
చెల్లని చెక్కు...
లచ్చయ్యపేట ఫ్యాక్టరీకి చెరుకు తోలిన పాపానికి చెల్లని చెక్కుతో ఇబ్బందులు పడుతున్నానని బలిజిపేట మండ లం జనార్దనవలస గ్రామానికి చెందిన తోట రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తాను 156 టన్నుల చెరుకును సరఫరా చేస్తే 129 టన్నులకు జూన్ 25న 2 లక్షల 20 వేల రూపాయల చెక్కు ఇచ్చారని, అది ఫ్యాక్టరీ వద్ద ఉండే ఓరియంటెల్ బ్యాంకు వద్దకు తీసుకెళితే ఖాతాలో డబ్బు లేదని తిప్పుతున్నారని అన్నారు.

>
మరిన్ని వార్తలు