ధాన్యం..ధర దైన్యం

15 Apr, 2019 12:23 IST|Sakshi
కళ్లంలో ఆరబోసిన వడ్లు

పెరిగిన పెట్టుబడులు

గణనీయంగా తగ్గిన దిగుబడులు

ఎకరాకు 30 బస్తాలకు మించని దిగుబడులు

కరువైన గిట్టుబాటు ధర  

ముమ్మరంగా వరికోతలు

కర్నూలు, కోవెలకుంట్ల/బనగానపల్లె: ఈ ఏడాది ఎండకారు వరి సాగు రైతులకు నష్టాలు మిగిల్చింది. సాగునీటి కష్టాలు, వివిధ రకాల తెగుళ్లు దిగుబడులపై ప్రభావం చూపాయి.  కోవెలకుంట్ల వ్యవసాయ సబ్‌ డివిజన్‌లోని ఆరు మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో కుందూనది, చెరువులు, బోర్లు, బావులు, తదితర సాగునీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో  4 వేల హెక్టార్లలో 555 రకానికి చెందిన వరిసాగు చేశారు. పంటకాలం పూర్తి కావడంతో  డివిజన్‌లోని ఆయా గ్రామాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.

పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన దిగుబడులు  
తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాది డిసెంబర్‌ నాటికే కుందూనది ఎండిపోయింది. దీంతో నదితీర రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడ్డారు. నాట్లు వేసిన నెల రోజులకే సాగునీరు అందకపోవడంతో రైతులు సాగునీటికోసం అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు అధికారులు కుందూనదికి నీటిని విడుదల చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. రబీ వరిసాగులో పెట్టుబడులు విపరీతంగా పెరిగి దిగుబడులు గననీయంగా తగ్గడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపులు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 22 వేల నుంచి రూ. 25వేలు వెచ్చించారు. సాగునీటి కష్టాలు, వాతావరణం అనుకూలించక, దోమపోటు, అగ్గి తెగులు కారణంగా ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గడానికి తోడు మార్కెట్‌లో వరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో బస్తా రూ.1100 మించి ధర లేకపోవడం, ఈ ధరకు విక్రయిస్తే పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వరికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.  

ఇక్కట్లలో కౌలు రైతులు
రైతులకు ఎకరానికి భూములను బట్టి రూ 15–20వేల రూపాయలు కౌలు చెల్లించాలి. ఆ తర్వాత పంటలకు పెట్టుబడి పెట్టాలి. ఇవన్నీ పోను మిగులు లభించాలంటే తప్పనిసరిగా కౌలు రైతులకు గిట్టుబాటు ధర లభించాలి.   – నరసయ్య, కౌలు రైతు, ఇల్లూరు కొత్తపేట  

గిట్టుబాటు ధర లేదు
రబీలో సాగు చేసిన వరిపంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ విషయంపై చాలామంది రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, గిట్టుబాటు ధర కల్పించి వరిపంటను కొనుగోలు చేయాలి.  – పవన్‌కుమార్, వ్యవసాయాధికారి

మరిన్ని వార్తలు