జగనన్నహామీతోరైతుల్లోధీమా

17 Jan, 2019 06:52 IST|Sakshi
నారుమడి వేసేందుకు పొలాన్ని దున్నుతున్న రైతన్న

పగటి పూట 9గంటల పాటు ఉచిత కరెంటు 

వైఎస్సార్‌ భరోసా పథకంపై హర్షం 

ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులు పండించిన పంటలకు బీమా నేరుగా ప్రభుత్వం చెల్లిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో ఇచ్ఛాపురంలో చేసిన ప్రకటనతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతన్నలకు వెన్నుదన్నుగా బీమా పథకం ఉంటుంది. రైతుల్లో ఈ బీమాపై అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. అత్యధిక మంది రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోకపోవడం, పంటలు వేసే సమయానికి బీమా సమయం దాటిపోవడంతో బీమా చేయించుకోకుండా నష్టపోతున్నారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీవ్రంగా నష్టపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందే సహాయం అరకొరగానే ఉంటోందని ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్లుగా ప్రకృతి విపత్తు సమయంలో రైతులకు నష్టాలే తప్ప ఆదుకునే వారే కరువయ్యారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 2,40,844 హెక్టార్లలో 6,11,086 మంది రైతులు వివిధ రకాల పంటలు వేశారు. వీరిలో 3 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల వల్ల 13,194 హెక్టారుల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటిలో 702 హెక్టారుల్లో వరి, 293 హెక్టారుల్లో ప్రత్తి, 177 హెక్టారుల్లో చెరకు పంటల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. రబీలో మాత్రం తిత్లీ తుపాను కారణంగా వరి పంటతో పాటు పొగాకు పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి పైగా పంటలపై భీమాలేక నష్టపోయినట్లు రైతు సంఘం నాయకులు చెప్తున్నారు.

జగనన్న హామీతో రైతులకు భరోసా
ప్రజాసంకల్పయాత్ర చేసి గ్రామగ్రామాన ప్రజా సమస్యలను తెలుసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల కష్టాలను దగ్గరగా చూసి చలించిపోయారు. కష్టాలను తీర్చేవిధంగా ఇచ్ఛాపురం సభలో ఆయన ఇచ్చిన హామీలతో రైతులు చెప్పలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు పంటల సహాయంతో పాటు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయాన్ని పండుగలా చేస్తారని రైతులు అన్నారు. జగన్‌ పాలనలో తమ బతుకులు తప్పకుండా మారతాయని వారంటున్నారు. పంటల బీమా ప్రీమియంను ప్రభుత్వం చెల్లించడం, 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జగన్‌ హామీ ఇవ్వడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది.
రైతు భరోసా పథకం కింద ఖరీఫ్, రబీ సీజన్‌ ముందు రైతులకు పంట ఖర్చులను రూ. 12,500 పెట్టుబడి సహాయం, ఉచిత బోర్లు, వడ్డీలేని పంట రుణాలను అందిస్తామనే జగన్‌ ప్రకటనతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి మంచి రోజులు వస్తున్నాయని రైతులు ఆశతో ఎదురు చూస్తున్నారు. రానున్నది రైతు రాజ్యమే అని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వ్యవసాయానికి మంచి రోజులు వస్తాయి
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు ప్రకటించిన హామీలు తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ఉంది. వ్యవసాయానికి మంచి రోజులు రాబోతున్నాయి. పగటి పూట 9 గంటలకు ఉచిత విద్యుత్, ఉచిత బోర్లు వేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.– బిరుదుగడ్డ మురళి,రైతు, బుట్టాయగూడెం మండలం

రానున్నది రైతు రాజ్యమే
రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన వైఎస్సార్‌ భరోసా పథకం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఏడాదికి రూ. 12,500 చొప్పున రూ.50 వేలు నేరుగా రైతుకు ఇస్తామనడం సంతోషమే. రానున్నది రైతు రాజ్యమే. జగన్‌ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.– అల్లూరి సోమేశ్వరరావు, రైతు,రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం  

మరిన్ని వార్తలు