బీమా ఉంటేనే ధీమా..!

13 Aug, 2014 01:41 IST|Sakshi

కర్నూలు(అగ్రికల్చర్):  జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొని పైర్లు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో పంటల బీమాకు ప్రాధాన్యత ఏర్పడింది. రైతులు కూడా తాము సాగు చేసిన పంటలను బీమా చేయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాస్తవానికి పంటల బీమా గడువు జూలై నెల చివరితోనే ముగిసింది. రుణమాఫీ కాకపోవడం, రుణాలు రీ షెడ్యూల్ చేయకపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం స్పందించి సెప్టెంబర్ 15 వరకు గడువు పొడిగించింది. ఈ సారి బ్యాంకులు పంట రుణాల పంపిణీ చేపట్టకపోవడంతో రైతులందరూ నాన్ లోనింగ్ ఫార్మర్స్ కింద బీమా చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

 వేరుశనగకు వాతావరణ బీమా..
 జిల్లాలో 83వేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేస్తున్నారు. ఈ పంటకు వాతావరణ బీమా కల్పిస్తున్నారు. నాలుగు దశల్లో వర్షాభావం లేదా అధిక వర్షాలు, చీడ పీడలను పరిగణనలోకి తీసుకొని పరిహారాన్ని చెల్లిస్తారు. హెక్టారుకు రూ.27,500 విలువకు వాతావరణ బీమా చేసుకోవచ్చు. ఇందుకు పది శాతం ప్రీమియం రూ.2750 చెల్లించాల్సి ఉంది. ఇందులో రైతులు రూ.1375 భరించాలి. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. వేరుశనగకు వాతావరణ బీమా చేసే రైతులు కర్నూలులోని యునెటైడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలో సంప్రదించవచ్చని జేడీఏ ఠాగూర్ నాయక్ తెలిపారు.

 వరికి గ్రామం యూనిట్‌గా బీమా..
 గతంలో వేరుశనగకు గ్రామం యూనిట్‌గా బీమా సౌకర్యం ఉండేది. వేరుశనగను వాతావరణ బీమా కిందకు తీసుకురావడంతో వరికి గ్రామం యూనిట్‌గా బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. జిల్లాలో ఈ పంట లక్ష హెక్టార్ల వరకు సాగు కానుంది.

మరిన్ని వార్తలు