హలధారి..గోదారి

20 Jul, 2015 11:09 IST|Sakshi
హలధారి..గోదారి

రాజమండ్రి: గోదారమ్మ ఒడిలో డెల్టా రైతు పురుడు పోసుకున్నాడు. అక్షయపాత్ర లాంటి ధాన్యాగారాన్ని ఆస్తిగా ఇచ్చింది... పదిమందికీ అన్నం పెట్టే అన్నదాతను చేసింది గోదా'వరి'.. సిరుల ఝరి. ఒకనాటి క్షామపీడిత ప్రాంతమైన గోదావరి డెల్టాను సస్యశ్యామలమైనా.. దేశానికి అన్నంపెడుతూ గోదావరి డెల్టా అన్నపూర్ణగా మారిందన్నా అందుకు ఈ పావనవాహిని కరుణా కటాక్షమే కారణం. పుష్కర పండుగ నాడు ఆ తల్లి రుణం తీర్చుకుంటున్నారు ఈ ప్రాంత అన్నదాతలు. రైతు ఇంట ధాన్యాగారమే కాదు.. రాష్ట్ర ధాన్యాగారం నిండుతున్నది కూడా ఈ డెల్టాలో పండే వరి పంటతోనే.  గోదావరిపై ఉభయ గోదావరి జిల్లాల్లో 8.86 లక్షల ఎకరాల్లో వరి, 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి, వాటిలో అంతర పంటలుగా అరటి, కందా వంటి వాణిజ్య పంటలు సాగవుతున్నాయి. సుమారు 50 వేల ఎకరాల్లో కూరగాయ పంటలు పండుతున్నాయి. 80 వేల ఎకరాల్లో చేపల సాగు జరుగుతోంది. చివరకు పండే పంటలే కాదు.. పాడి రైతుల ఇంట పాల వెల్లువకు సైతం గోదావరి జీవనాధారమే.

లక్షల సంఖ్యలో పశుపక్ష్యాదులు గోదావరి మీద ఆధారపడి జీవిస్తున్నాయి. సాగు ఆరంభ సమయంలో కొబ్బరికాయ కొట్టి చేలల్లోకి గోదావరి నీటిని వదలడం ద్వారా ఏరువాక ఆరంభిస్తాడు. రైతు ఒక్కరే కాదు. డెల్టాను సస్యశ్యామలం చేస్తున్న పంట కాలువలకు వేసవి తరువాత నీరు వదిలే సమయంలో సాగునీటిపారుదల శాఖాధికారులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పసుపు, కుంకుమ, గాజులు, కొత్తరవిక, చీర గోదావరికి సమర్పించిన తరువాతే డెల్టా కాలువలకు నీరు వదులుతారు. దేవతగా భావించే గోదావరికి పుష్కర పండుగ వచ్చింది. అందుకే ఆ తల్లి రుణం తీర్చుకునేందుకు రైతులు తమతోపాటు నాగలి, ఎద్దులకు గోదావరి స్నానం చేయిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు