ఆగస్టు వరకు ఆగాల్సిందే!

23 Jul, 2019 04:46 IST|Sakshi

ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు

‘పసిఫిక్‌ ’లో ఎల్‌నినో కొనసాగుతుండడమే కారణం

జాడలేని అల్పపీడనాలు.. వాయుగుండాలు

మరో నెల రోజుల్లో లానినా అనుకూల పరిస్థితులు

ఆపై సమృద్ధిగా వర్షాలు

సాక్షి, అమరావతి బ్యూరో: ఆశించిన వర్షాల కోసం మరికొన్నాళ్లు ఆగాలా? అవుననే అంటున్నారు వాతావరణ నిపుణులు. నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం కావడమే కాక.. ఆపై అవి ముఖం చాటేయడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రుతుపవనాలు ప్రవేశించినప్పట్నుంచి మొక్కుబడి వానలే తప్ప విస్తారంగా వర్షాలు కురిసిన పరిస్థితి లేదు. సాధారణంగా జూలై మూడో వారం నాటికి బంగాళాఖాతంలో కనీసం 4–5 అల్పపీడనాలు, 2–3 వాయుగుండాలు ఏర్పడాల్సి ఉంది. అయితే ఇప్పటిదాకా రెండంటే రెండే అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అవి కూడా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడడం వల్ల రాష్ట్రంపై ఏమాత్రం ప్రభావం చూపలేక పోయాయి. నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపక పోవడానికి, వానలు సమృద్ధిగా కురవకపోవడానికి పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో (సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడం) కొనసాగుతుండడం కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో నెల రోజుల నాటికి ఎల్‌నినో న్యూట్రల్‌ స్థితికి చేరుకుని లానినా (సముద్ర ఉష్ణోగ్రతలు తగ్గడం) పరిస్థితులేర్పడతాయని అమెరికాకు చెందిన క్‌లైమేట్‌ ప్రెడిక్షన్‌ సెంటర్‌ (సీపీసీ) తాజా అంచనాల్లో స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో ఆగస్టు రెండో వారం నుంచి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఐదో వంతుకు పైగా లోటు వర్షపాతం..
జూలై మూడో వారం నాటికి కూడా రాష్ట్రంలో భారీ లోటు వర్షపాతమే (22%) కొనసాగుతోంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి జూలై 22 వరకు కురవాల్సిన వర్షపాతం కంటే ఐదో వంతుకు పైగా లోటు వర్షపాతం నమోదయింది. కోస్తాంధ్రలో 21, రాయలసీమలో 23% కురవాల్సిన దానికంటే తక్కువ వర్షం కురిసింది. 42% లోటుతో పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోకెల్లా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం (+2%) రికార్డయి ఒకింత మెరుగ్గా ఉన్నాయి.  

ఎందుకిలా..? 
ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో రుతుపవనాల ద్రోణి (మాన్సూన్‌ ట్రఫ్‌) హిమాలయాల వైపు వెళ్లిపోయింది. దీంతో అక్కడ (నేపాల్, ఈశాన్య రాష్ట్రాల్లో) భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులేర్పడి ఖరీఫ్‌ పంటకు విఘాతం కలిగించాయి. ఈ ద్రోణి వెనక్కి వస్తే మళ్లీ రాష్ట్రంలో వానలకు ఆస్కారం ఉంటుంది. ఇలా వెనక్కి వచ్చి బలపడాలంటే అక్కడ తూర్పు గాలులు ప్రారంభం కావాలి. ఈ పరిస్థితికి మరో రెండు వారాల సమయం పడుతుందని వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’తో చెప్పారు. గత ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి కొనసాగిందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, అవి రబీ పంటలకు భరోసానిస్తాయని తెలిపారు.  

మరిన్ని వార్తలు