‘స్వచ్ఛత’ సమరం

25 Feb, 2014 00:38 IST|Sakshi

 హోటళ్లు,రెస్టారెంట్లలో పరిశుభ్రతపై సూచికలు
 మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక శాఖ
 నేటి నుంచి జిల్లాలోని అన్ని పట్టణాల్లో అమలు
 
 జిల్లాలో ఆహార పదార్థాల విక్రయాల వ్యాపారంలో పరిశుభ్రత కనిపించడం లేదు. రోగకారక అంగళ్లుగా మారిన హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై పురపాలక అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. ధనార్జనే ధ్యేయంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు ఇకపై ఆహార పదార్థాల తయారీ, నాణ్యతా ప్రమాణాల విషయంలో తగిన జాగ్రత్తలు వహించకపోతే ఇబ్బందులు తప్పవుని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీని కోసం మున్సిపాలిటీలు మంగళవారం నుంచి అపరిశుభ్రతపై ‘స్వచ్ఛత’ సమరానికి సిద్ధమవుతున్నాయి.
 
 సత్తెనపల్లి, న్యూస్‌లైన్
 ప్రజారోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హోటళ్ళు, రెస్టారెంట్లు, బేకరీలు,ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బయట విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రత, నాణ్యతపై అవగాహన కోసం పురపాలక, నగర పాలక సంస్థల్లో మంగళవారం నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని పురపాలక శాఖ సంచాలకుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ‘స్వచ్ఛత’పేరుతో ఈ నెల 25వ తేదీ నుంచి మార్చి 3 వరకు వారం రోజులపాటు గుంటూరు నగరంతో పాటు, జిల్లాలోని అన్ని పట్టణాల్లో ఆహార పదార్థాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను  వివరించే కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ నెల 26వ తేదీ వరకు మున్సిపల్ సిబ్బందితో అవగాహన కార్యక్రమాలు చేపడతారు. 25న మున్సిపాలిటీల పరిధిలో ఉన్న హోటళ్ళు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాటరింగ్ గ్రూప్స్, కమ్యూనిటీ హోటళ్ళు ఎన్ని ఉన్నాయో లెక్కిస్తారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు వాటిని ప్రజారోగ్య అధికారి, మున్సిపల్ కమిషనర్  తనిఖీ చేయాలి. ఇందులో వంటశాలలు, ఆహార పదార్థాల నిల్వ, తయారీ, మంచినీటి వసతి, పాలిథిన్ వాడకం, మలమూత్ర విసర్జన శాలలు, ఇతర విషయాలను పరిశీలించి నమోదు చేయాల్సి ఉంటుంది.
  26 నుంచి నాలుగు రోజుల పాటు వంటగదుల నిర్వహణ, వంట చేసే తీరు, నిల్వ ఉంచుతున్న తీరును పరిశీలిస్తారు. అనంతరం ఆయా హోటళ్ళ యజమానులతో సమావేశం నిర్వహిస్తారు.
 
  28న వంట సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు
 
  మార్చి 1 నుంచి అన్ని హోటళ్లు, బార్ అండ్ రెస్టాంట్‌లలో ఆహారం తీసుకునేటప్పుడు తీసు కోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సూత్రాలు, ఆహారం వృథాతో జరిగే నష్టాలను తెలియజేసేలా సూచికలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు.
 
 హోటళ్ళను పరిశీలించాలి
 హోటళ్ళు, రెస్టారెంట్లు, కళ్యాణమండపాలు తది తర వాటిల్లో ప్రజలకు అందిస్తున్న ఆహార పదార్థాలు, వంటశాలలను మున్సిపల్ సిబ్బంది పరిశీ లించాలి. 26న ఆయా నిర్వాహకుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేస్తాం. ఏమాత్రం హోటళ్ళల్లో పరిశుభ్రత లేకపోయినా, నిల్వ ఆహార పదార్థాలను విక్రయించినా సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజల ఆరోగ్య విషయంలో ఆయా నిర్వాహకులు సహకరించాలి.
  - సిరిసిల్ల సత్యబాబు,
 మున్సిపల్ కమిషనర్, సత్తెనపల్లి
 
 

మరిన్ని వార్తలు