పోరు హోరాహోరీ..ఫలితం డ్రా

17 Aug, 2014 00:33 IST|Sakshi
పోరు హోరాహోరీ..ఫలితం డ్రా

విశాఖపట్నం: తెలుగు టైటాన్స్‌కు సొంతగడ్డపై విజయం దక్కలేదు. తొలి అర్ధభాగంలో పట్టు బిగించిన తెలుగు టైటాన్స్‌ను మరోసారి బరిలోకి దిగిన తరువాత బెంగళూర్ బుల్స్ కుమ్మేశాయి. ముందుగా ఐదు పాయింట్లు(13-8) వెనకబడిన బుల్స్ మలి అర్ధభాగంలో ఐదు పాయింట్లు(20-15) ఆధిక్యంతో సమఉజ్జీగా (28-28)నిలిచి మ్యాచ్‌ను జారిపోకుండా నిలువరించింది. ఇరుజట్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించడంతో చెరో మూడేసి పాయింట్లతో సరిపెట్టుకున్నాయి.

మూడో స్థానంలోనే బెంగళూర్ బుల్స్ కొనసాగుతుండగా సెమీస్ ఆశను తెలుగు టైటాన్స్ వదులుకుంది. ప్రో కబడ్డీ పేరిట విశాఖ పోర్ట్ స్టేడియంలో శనివారం ప్రారంభమైన ఆరో రౌండ్ పోటీ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌తో బెంగళూర్ బుల్స్ ఢీకొట్టాయి. తరుము కూతలో టైటాన్స్ పాయింట్లను రాబట్టగలిగినా డిఫెన్స్‌లో వెనకబడటంతో ఆట చివరి నిమిషంలో ఫలితాలు తారుమారయ్యాయి. టైటాన్స్ జట్టు విశాఖలోనే మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది.  
 
టైటాన్స్‌కు లోనా...
 
తెలుగు టైటాన్స్ జట్టు తొలి అర్ధభాగంలో ఔట్ చేయడం ద్వారా పదిపాయింట్లు రాబట్టగా బుల్స్ ఎనిమిది పాయింట్లే సాధించాయి. టైటాన్స్ మూడు బోనస్ పాయింట్లు సాధించడంతో ఆధిక్యం సాధించింది.  రెండో అర్ధభాగంలో బుల్స్ చెలరేగాయి.  ఏకంగా  ఐదు బోనస్ పాయింట్లు సాధించిన బెంగళూర్ బుల్స్ మాత్రం జట్టు అంతా ఔటయి లోనాను టైటాన్స్‌కు సమర్పించుకుంది.  టైటాన్స్ ప్రత్యర్థిని ఔట్ చేయడం ద్వారా 12 పాయింట్లు రాబట్టగా బుల్స్ పదమూడు పాయింట్లు దక్కించుకుని మ్యాచ్‌ను చేజారకుండా జాగ్రత్తపడింది.  దీంతో ఇరుజట్లు 28 పాయింట్లతో సమ ఉజ్జీగా నిలిచాయి.  మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యేలు,  సినీనటుడు శ్రీకాంత్ మ్యాచ్ ఆసాంతం ఆస్వాదించారు.
 
బోనస్‌తో పాయింటే ఓటమైంది:
 
చివరిలో మ్యాచ్ చేజారిపోయింది.  ప్రత్యర్థి బోనస్ పాయింట్‌తో సరిపెట్టుకోకుండా ఔట్ చేసి వెనక్కి మళ్లడంతో  క్షణాల్లో మ్యాచ్ రూపు మారిపోయింది. తొలి అర్ధభాగంలో లీడ్‌ను చివరి నిమిషంలో కోల్పోయాం. జాతీయ జట్టు ఆటగాడి అనుభవం ముందు కాస్త తడబడ్డాం.  ముంబయ్ మ్యాచ్‌లో తప్పులు సరిదిద్దుకుంటాం.
 -రాహుల్, టైటాన్స్ రైడర్
 

మరిన్ని వార్తలు